ఒలింపిక్స్‌లో పాల్గొనాలని.. పతకం సాధించి దేశ గౌరవాన్ని అంతర్జాతీయంగా ఇనుమడింపచేయాలని ప్రతీ అథ్లెట్ కోరుకుంటారు. నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మకమైన ఈ పోటీల కోసం తీవ్రంగా చెమటోడుస్తారు. గాయాల వల్లనో లేదంటే మరే కారణం వల్లనైనా ఒలింపిక్స్‌కు దూరమైతే వారు పడే బాధ వర్ణనాతీతం. అయితే గర్భిణిగా ఉన్న అథ్లెట్లు పతకం సాధించాలన్న ఆశయంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఒలింపిక్స్‌లో పాల్గొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. పదిమందికి పైగా గర్భిణి అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఓ వైపు ప్రాణాన్ని లెక్క చేయకుండా.. లక్ష్యం వైపు వాళ్లు వేసిన అడుగులు తోటి అథ్లెట్లలో స్ఫూర్తిని నింపేవి. కొందరు తమకు తెలిసి బరిలోకి దిగితే.. మరికొందరు గర్భిణులమని తెలియకుండానే పోటీల్లో పాల్గొన్నారు. ఇంకొందరైతే తాము గర్భిణులమని ఒలింపిక్స్ ముగిసిన తర్వాత వెల్లడించారు. అలాంటివారిలో కొందరు...
1- ఆంకీ వాన్ గ్రన్స్వెన్... ఈక్వెస్ట్రియన్ స్టార్ అథ్లెట్.. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో గ్రన్స్వెన్ బరిలోకి దిగినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. కారణం ఆమె ఐదు నెలల గర్భిణి. అయినా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి వ్యక్తిగత డ్రెస్సేజ్ విభాగంలో పతకం సాధించింది. అది కూడా బంగారు పతకం కావడం విశేషం. డచ్‌కు చెందిన గ్రన్స్వెన్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్ నుంచి 2012 లండన్ ఒలింపిక్స్ వరకు ప్రతీ ఒలింపిక్స్‌లోనూ ఈక్వెస్ట్రియన్‌లో తన ప్రతిభతో పతకం సాధిస్తూ వచ్చింది. ఒలింపిక్స్‌లో ఏ రైడర్ కూడా ఇన్ని పతకాలు సాధించలేదు.
2- సుర్యానీ స్పెషల్ రికార్డ్...
నుర్ సుర్యానీ మహ్మద్ తైబి... మలేసియాకు చెందిన ఈ షూటర్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో ఆమె ఎనిమిది నెలల గర్భిణి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బరిలోకి దిగిన సుర్యానీ 34వ స్థానంలో నిలిచింది. పతకం సాధించకపోయినా సుర్యానీ మాత్రం స్పెషల్ రికార్డును సొంతం చేసుకుంది. 8 నెలల గర్భంతో పోటీల్లో పాల్గొన్న తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డులకు ఎక్కింది.
3- 2010 వాంకోవర్ వింటర్ ఒలింపిక్స్‌లో కెర్‌స్టిన్ (జర్మనీ) స్కెలెటన్ క్రీడాంశంలో రజత పతకం సాధించింది. పోటీ సమయానికి ఆమె రెండు నెలల గర్భిణి.
జునో స్టోవర్ ఇర్విన్(అమెరికా)...1952 ఒలింపిక్స్ డైవింగ్‌లో కాంస్య పతకం సాధించింది. అప్పటికే ఆమె మూడున్నర నెలల ప్రెగ్నెంట్.
జర్మనీ ఆర్చర్ కరోలినా 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌ల్లో గర్భిణిగానే పోటీల్లో బరిలోకి దిగింది. 2000లో కరోలినా లక్ష్యాన్ని గురిపెట్టి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది.
2012 లండన్ ఒలింపిక్స్‌లో కెర్రీ వాల్ష్‌తో పాటు అన్నా మారియా జోహన్సన్ (హ్యాండ్‌బాల్), నుర్ సుర్యానీ(షూటింగ్) కూడా గర్భిణిలే. ఒక ఒలింపిక్స్‌లో ముగ్గురు ప్రెగ్నెంట్ అథ్లెట్లు బరిలోకి దిగడం తొలిసారి.
తొలి ఒలింపియన్ జులిన్...
1920 ఒలింపిక్స్‌లో మగ్డా జులిన్.. ఫిగర్ స్కేటింగ్ సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగి బంగారు పతకం సాధించింది. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి. గర్భిణిగా బరిలోకి దిగిన తొలి ఒలింపియన్.
4- కెర్రీ వాల్ష్ జెన్నింగ్స్.. అమెరికా బీచ్ వాలీబాల్ స్టార్... లండన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో కెర్రీ బరిలోకి దిగింది. అయితే అప్పుడు ఆమె ఏడు వారాల గర్భిణి.. తోటి అథ్లెట్లు వద్దని వారించారు.. డాక్టర్లయితే పిండంతో పాటు ప్రాణానికి ప్రమాదమని కెర్రీని హెచ్చరించారు. అయినా ఆమె ఇవేమీ పట్టించుకోలేదు. ప్రాణాన్ని పణంగా పెట్టి అమెరికాకు స్వర్ణాన్ని అందించింది.