పాట్నా ప్లేట్ | Patna plate | Sakshi
Sakshi News home page

పాట్నా ప్లేట్

Published Fri, May 20 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

పాట్నా ప్లేట్

పాట్నా ప్లేట్

బిహార్  వాసుల్లాగే సింపుల్‌గా ఉంటుంది.అప్పుడే పడిన వానకు గుప్పుమన్న మట్టి వాసనలా  మన ఊరి పరిమళాన్ని గుర్తుచేస్తుంది.  ఇట్టే చేసుకోవచ్చు.. లొట్టలేసుకోవచ్చు. బీ రెడీ ఫర్ బిహార్ ఆహారం! ఎంజాయ్ పాట్నా ప్లేట్!!

 

మూంగ్ దాల్ కి గోలీ
కావల్సినవి: పొట్టు తీయని పెసలు - 200 గ్రా.లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు; అల్లం- వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; గరం మసాలా - టీ స్పూన్ (లవంగాలు, యాలకులు, ధనియాలు, దాల్చిన చెక్కలను వేయించి పొడి చేసినది); కారం - అర టీ స్పూన్; టొమాటో - సగం ముక్క (సన్నగా తరగాలి); ఉల్లిపాయ - సగం ముక్క (సన్నగా తరగాలి); ఉప్పు - రుచికి తగినంత; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్

 
పోపు మిశ్రమానికి...  టొమాటో- సగం ముక్క, ఉల్లిపాయ సగం ముక్క, పసుపు-పావు టీ స్పూన్, కారం- అర టీ స్పూన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్-అర టీ స్పూన్, పచ్చిమిర్చి-1(తరగాలి), కొత్తిమీర- టీ స్పూన్, ఉప్పు తగినంత

 
తయారీ:  పెసరపప్పును 2 గంటలు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లను వడకట్టి గ్రైండర్‌లో పప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాలపొడి, కాగిన టేబుల్ స్పూన్ నూనె కొద్దిగా నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి  మూకుడును స్టౌ మీద పెట్టి, వేడయ్యాక అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి పప్పు మిశ్రమం పోసి కలపాలి. కొన్ని నిమిషాలు ఉడకనివ్వాలి  దీంట్లో టొమాటో, ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఉడికించాలి. మిశ్రమం బాగా గట్టిపడ్డాక మంట తీసేయాలి  మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ముద్దలు తీసుకొని, గుండ్రని బాల్స్ తయారు చేయాలి  మూకుడులో టేబుల్ స్పూన్ నూనె వేసి, మసాలాకోసం ఇచ్చిన పదార్థాలను వేసి కలపాలి. మిశ్రమం లూజ్‌గా అవడానికి కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. ముక్కలు బాగా ఉడికాక దీంట్లో పప్పు ఉండలు, గరం మసాలా వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి  చివరగా కొత్తిమీర చల్లి దించాలి.

 

ఫిష్ కర్రీ
కావల్సినవి: చేపముక్కలు - అర కేజీ; ఆవ ముద్ద - టేబుల్ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్; కారం - అర టీ స్పూన్; పసుపు - అర టీ స్పూన్; ఆవనూనె - 2 టేబుల్ స్పూన్లు (తగినంత); ఆవాలు - అర టీ స్పూన్; మెంతిపిండి - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 2 ; ఎండుమిర్చి - 2; టొమాటోలు - 2 (సన్నగా తరగాలి); ఉప్పు - తగినంత; కొత్తిమీర తరుగు - టీ స్పూన్

 
తయారీ:  చేపముక్కలను శుభ్రం చేసుకోవాలి  పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు చేపముక్కలకు పట్టించాలి  ఆవనూనెలో చేపముక్కలను వేయించి, పక్కనుంచాలి  కడాయిలో ఆవనూనె వేసి అందులో ఎండుమిర్చి, ఆవాలు, ఆవముద్ద, పచ్చిమిర్చి తరుగు, మెంతిపొడి వేసి కలపాలి  దీంట్లో పసుపు, టొమాటో తరుగు వేసి వేగాక, వెల్లుల్లి ముద్ద వేసి 5-7 నిమిషాలు ఉడికించాలి  దీంట్లో 3 కప్పుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు, కారం వేసి మరో 5 నిమిషాలు ఉడికించి, వేయించిన చేప ముక్కలు వేయాలి  సన్నని మంట మీద 10 నిమిషాలు ఉంచి, దించి కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి.

 

పకోడి
కావల్సినవి: శనగ పిండి - 250గ్రా.లు; ఉప్పు - రుచికి తగినంత; పసుపు - పావు టీ స్పూన్; కారం - అర టీ స్పూన్; మ్యాంగో పొడి (అమ్చ్యూర్ పొడి)- టీ స్పూన్; ఏదైనా ఆకుకూర - టీ స్పూన్;


వాము - అర టీ స్పూన్;

 
ఉల్లిపాయలు - 125 గ్రాములు (నిలువుగా సన్నని ముక్కలు కట్ చేయాలి);

 బంగాళ దుంపలు - 120గ్రా.లు (సన్నని ముక్కలు);

 
నూనె - వేయించడానికి తగినంత


తయారీ:  పిండిలో నూనె, కూరగాయలు మినహా అన్ని రకాల పదార్థాలు వేసి కలపాలి  తగినన్ని నీళ్లు పోసి, పిండిని బాగా కలుపుకోవాలి  తర్వాత కూరగాయల ముక్కలు వేసి కలపాలి  కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి  చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని కాగుతున్న నూనెలో వేసి అన్నివైపులా బంగారు రంగు వచ్చేలా వేయించాలి  వేయించిన పకోడీలను పేపర్‌నాపికిన్ మీద వేయాలి. ఇలా చేయడం వల్ల పకోడీల నూనె పేపర్ పీల్చుకుంటుంది. పకోడీలు కరరలాడుతుంటాయి.

 

ఉడ్ యాపిల్ (వెలగపండు) షర్బత్
కావల్సినవి: వెలగపండు - 1 (మీడియమ్ సైజ్); బెల్లం - 3 టేబుల్ స్పూన్లు;
యాలకులు - 2;  నిమ్మరసం - టేబుల్ స్పూన్;  పంచదార - తగినంత; ఉప్పు - అర టీ స్పూన్; చల్లటి (ఐస్) నీళ్లు - 2 కప్పులు;


తయారీ:వెలగపండు లోపలి గుజ్జు, యాలకుల పొడి, బెల్లం 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి  దీంట్లో నిమ్మరసం, అర కప్పు నీళ్లు పోసి మళ్లీ బ్లెండ్ చేయాలి  చివరగా చల్లటి నీళ్లు పోసి బ్లెండ్ చేసి గ్లాస్‌లో పోసి చల్లగా అందించాలి.

 

ఠేక్వా
కావల్సినవి: మైదా/గోధుమపిండి- 200 గ్రాములు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; పంచదార/బెల్లం - 250 గ్రాములు; బాదంపప్పు, జీడిపప్పు పలుకులు - 3 టేబుల్ స్పూన్లు, కిస్‌మిస్-టేబుల్ స్పూన్; నూనె - తగినంత; యాలకుల పొడి - పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ - చిటికెడు, ఎండుకొబ్బరి - అర కప్పు, చాకో చిప్స్ - 2 టేబుల్ స్పూన్లు

 
తయారీ: మైదాలో సన్నగా తరిగిన బాదంపప్పు, జీడిపప్పు పలుకులు, చాకో చిప్స్, కిస్‌మిస్, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కనుంచాలి  పంచదార లేదా బెల్లంలో కప్పు నీళ్లు పోసి, కరిగించి వడకట్టి పొయ్యి మీద పెట్టి మరిగించాలి  మైదాలో కరిగించిన పంచదార/ బెల్లం నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. పిండి మృదువుగా అయ్యేవరకు కలపాలి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని, గుండ్రంగా చేసి, వత్తి, కాగుతున్న నూనె లేదా నెయ్యిలో వేసి రెండువైపులా వేయించాలి.


నోట్: ఠేక్వాలను నెయ్యిలో కాకుండా ఓవెన్‌లో బేక్ చేసుకుంటే కుకీస్‌లా వస్తాయి. బేకింగ్ ట్రేకి నెయ్యి రాసి, 375 డిగ్రీల హీట్ వద్ద 20 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి.

 

ఛోఖా
కావల్సినవి: ఆవనూనె - అర కప్పు ; టొమాటోలు - 3 (గుజ్జు చేయాలి); వంకాయలు - 2  (ఉడికించి గుజ్జు చేయాలి); బంగాళదుంపలు - 3 (ఉడికించి గుజ్జు చేయాలి); కారం - అర టీ స్పూన్; ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి) ; పచ్చిమిర్చి - 3 (సన్నగా తరగాలి); నిమ్మకాయ - 1; కొత్తిమీర - ఒక కట్ట; ఉప్పు - తగినంత

 
తయారీ:  కడాయిలో ఆవనూనె వేసి వేడి చేయాలి. దీంట్లో టొమాటో గుజ్జు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత వంకాయ, బంగాళదుంప గుజ్జు వేసి కలపాలి  కొద్దిగా ఉడికాక కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపాలి  మిశ్రమం బాగా గుజ్జుగా అయ్యేంతవరకు ఉడికించి, మంట తీసేసి నిమ్మరసం కలపాలి  చివరగా కొత్తిమీర చల్లి దించాలి.

 

దాల్ భరీ పూరీ
కావల్సినవి  పెసరపప్పు - 200 గ్రాములు; ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు ; సోంపు - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత, కొత్తిమీర - 2 కట్టలు అల్లం తరుగు -  టీ స్పూన్; కారం - అర టీ స్పూన్; నూనె - వేయించడానికి తగినంత మైదా/గోధుమ పిండి - కప్పు; నీళ్లు - తగినన్ని; ఉప్పు - తగినంత

 
తయారీ: పప్పు 15 నిమిషాలు నీళ్లలో నానబెట్టి వడకట్టాలి. దీంట్లో ఉప్పు, అల్లం, సోంపు, ధనియాల పొడి, కొత్తిమీర, కారం వేసి కలిపి మెత్తగా రుబ్బాలి. పిండిలో పప్పు మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి ముద్ద చేయాలి.  మూకుడులో నూనె పోసి కాగనివ్వాలి  చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, పూరీలా వత్తాలి. ఇలా తయారుచేసుకున్నవాటిని కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా కాల్చాలి  ఈ పూరీలను ఏదైనా గ్రేవీ కర్రీతో వడ్డించాలి.

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement