జుట్టు పెరగాలంటే...
బ్యూటిప్స్
జుట్టు రాలడం ఓ సమస్య అయితే, పెరుగుదల లేకపోవడం మరో సమస్య. వంటింటి పదార్థాలతో జుట్టురాలడాన్ని నివారించడంతో పాటు పెరుగుదలకు కావల్సిన కిటుకులేంటో చూద్దాం..
ఉల్లిరసం
వెంట్రుకల పెరుగుదలకు ఇది చాలా ప్రాచీనమైన వంటింటి చిట్కా. రెండు ఉల్లిపాయల పై పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిని మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. రసం తీసి, వెంట్రుక కుదుళ్లకు పట్టించాలి. 15 నిమిషాలు తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసాన్ని మాడుకు పట్టిస్తే చాలు.
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ శాతం ఎక్కువ. ఇది కొలాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కణాలు రక్తప్రసరణను మెరుగుపరచి వెంట్రుక పెరగడానికి దోహదం చేస్తాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్
తలస్నానం చేసిన తర్వాత అలాగే వదిలేయకుండా 3 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను లీటర్ గోరువెచ్చని నీళ్లలో కలిపి, ఈ నీటిని తలకు బాగా పట్టించాలి. 10 నిమిషాల తర్వాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేసిన ప్రతీసారీ ఇలా చేస్తూ ఉండాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ జట్టు కుదుళ్లలోని పీహెచ్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేసి వెంట్రుక పెరడగానికి తోడ్పడుతుంది.
గుడ్డు మాస్క్
సల్ఫర్, జింక్, ఐరన్, సెలీనియమ్, ఫాస్ఫరస్, ఐడన్, ప్రొటీన్లు, విటమిన్లు తదితర పోషక విలువలు సమృద్ధిగా ఉన్న గుడ్డులోని తెల్లసొన, తేనె కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత కొన్ని నీళ్లలో షాంపూ కలిపి తల రుద్ది, కడిగేయాలి. వారం రోజులకు ఒకసారైనా ఇలా చేయడం వల్ల శిరోజాలకు తగినంత మృదుత్వం లభిస్తుంది.