స్టాటిన్ మందుల వాడకంపై కొత్త ఆలోచన...
గుండె జబ్బు చేస్తే... శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించే మందులు జీవితాంతం వాడాలని డాక్టర్లు చెబుతూంటారు. స్టాటిన్లు అని పిలిచే ఈ మందులతో దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. అయితే చిన్న రక్త పరీక్ష ద్వారా గుండె జబ్బు చేసిన వారికి నిజంగానే స్టాటిన్ల అవసరం ఉందా? లేదా? అన్నది తేల్చవచ్చునని అంటున్నారు ఓ విలేకరి. ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆస్ట్రేలియన్ సైన్స్ రిపోర్టర్ మేరియానే దిమాసీ అంచనా ప్రకారం... కొలెస్ట్రాల్ మోతాదును అంచనా వేసేందుకు చేస్తున్న పరీక్షల్లో తప్పులున్నాయి.
శరీరానికి చెడు చేస్తుందని భావిస్తున్న ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ మోతాదును కాకుండా... ప్రతి ఎల్‌డీఎల్ కణానికి అతుక్కుని ఉండే అపోలిపోప్రోటీన్ బీ100 (అపోబ్ బీ)ను లెక్కపెట్టడం మంచిదంటున్నారు దిమాసీ. దీనివల్ల శరీరంలో ఎల్‌డీఎల్ కణాలు ఎన్ని ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుందని, తదనుగుణంగా స్టాటిన్ల వాడకంపై ఒక నిర్ణయానికి రావచ్చునని దిమాసీ అంచనా.
అపోబ్ బీ ప్రొటీన్ కూడా గుండె జబ్బులను గుర్తించేందుకు మెరుగ్గా ఉపయోగపడుతుందని సైన్స్ చెబుతోంది. అయితే ఈ పరీక్ష కొంచెం ఖరీదైంది కాబట్టి.. చౌకగా చేయగల ఎల్‌డీఎల్, నాన్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పరీక్షలు చేస్తున్నారని.. ఫలితంగా అవసరం లేని వారు కూడా స్టాటిన్లు వాడుతూ దుష్ప్రభావాల బారిన పడుతున్నారని అంటున్నారు.
చక్కెరలు తక్కువ, క్యాల్షియం ఎక్కువ చేస్తే కేన్సర్‌కు చెక్?
చక్కెరలు తక్కువగా అందేలా చేస్తే కేన్సర్‌ను జయించవచ్చునని చాలామంది చెబుతూంటారు. అయితే ఈ పద్ధతి అన్ని కేన్సర్ల విషయంలో ఉపయోగపడకపోవచ్చునని అంటున్నారు సింగపూర్ శాస్త్రవేత్తలు. కొన్ని రకాల కేన్సర్లు చక్కెరలు తగ్గినా సాధారణంగా విస్తరించాయని.. ఇంకొన్నింటి విస్తరణ వేగం మందగించిందని తాము ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నామని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ ఈగన్ ఓగ్రీస్ తెలిపారు.
అయితే ఈ ప్రయోగాల సందర్భంగా తాము ఒక కొత్త విషయాన్ని గుర్తించామని.. చక్కెరలు బాగా తగ్గిన సందర్భాల్లో కేన్సర్ కణాలు తమ మనుగడ కోసం కాల్షియంపై ఆధారపడటం మొదలుపెట్టాయని ఆయన చెప్పారు. అతితక్కువ మోతాదులో ఉండే చక్కెరలు.. కేన్సర్ కణాల పై పొరలపై వోల్టేజీ మార్పులకు కారణమై క్యాల్షియం అయాన్లు లోనికి ప్రవేశించేలా చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు.
ఈ అంశం ఆధారంగా కేన్సర్ వ్యాధికి సరికొత్త చికిత్స అందించే అవకాశముందని ఆయన అంచనా వేస్తున్నారు. చక్కెరలను గణనీయంగా తగ్గిస్తూనే, క్యాల్షియం మోతాదును గణనీయంగా పెంచడం ద్వారా కేన్సర్ కణాలను నాశనం చేయవచ్చునని వీరు సూచిస్తున్నారు.
వ్యోమగాములకు వ్యర్థాలతోనే ఆహారం?
వినేందుకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించే విషయమిది. భవిష్యత్తులో సుదూర గ్రహాలకు పయనమయ్యే వ్యోమగాములకు వారి వ్యర్థాలతోనే ఆహారాన్ని సిద్ధం చేయవచ్చునని అంటున్నారు పెన్‌స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మూత్రాన్ని శుద్ధి చేసుకుని మంచినీరుగా మార్చుకుని వాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారుగానీ.. ఇలా వ్యర్థాలను ఆహారంగా మార్చుకునే ఆలోచన మాత్రం ఇదే తొలిసారి.
అంతరిక్ష ప్రయోగాలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి.. వ్యోమగాములకు తగినంత ఆహారం నిల్వ చేయడమూ ఆర్థికంగా భారమవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో అతితక్కువ ఖర్చుతో వారికి ఆహారం అందించడం ఎలా అన్నది ఓ సవాలుగా మారింది. అయితే కొన్ని రకాల బ్యాక్టీరియాను ఉపయోగించుకుని మానవ వ్యర్థాలనే ఆహారంగా మార్చవచ్చునని పెన్‌స్టేట్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూమి మీద వ్యర్థాలు ఎరువుగా మారుతున్నట్లే కొన్ని బ్యాక్టీరియా మానవ వ్యర్థాల ద్వారా ప్రొటీన్లు, కొవ్వులను ఉత్పత్తి చేయగలవని వీరు గుర్తించారు.
అంతేకాకుండా కేవలం 13 గంటల్లోనే సగం వరకూ వ్యర్థాలను ఆహారంగా మార్చడం వీలైందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ క్రిస్టోఫర్ హౌస్ తెలిపారు. అయితే తాము మానవ వ్యర్థాలను కాకుండా... కృత్రిమంగా తయారు చేసిన, ద్రవ, ఘన వ్యర్థాలను ప్రయోగాల్లో ఉపయోగించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment