కేన్సర్ కబళిస్తోంది..
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కేన్సర్‌తో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కేన్సర్ మరణాల్లో 34% మంది రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్ల కారణంగానే సంభవిస్తున్నాయి. కేన్సర్‌తో మరణించే మహిళల్లో 26.4% మంది రొమ్ము, గర్భాశయ కేన్సర్ల కారణంగానే చనిపోతున్నారని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి.. రాష్ట్రాలకు పంపించింది.
దీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రధానంగా కేన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, హైబీపీ, వంటివి ఉన్నాయి. 2012లో దేశవ్యాప్తంగా 1.45 లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారినపడగా.. వారిలో 70,218 మంది చనిపోయారు. అలాగే ఏటా సగటున సుమారు 1.23 లక్షల మంది మహిళలు గర్భాశయ కేన్సర్ బారిన పడుతుండగా.. అందులో 67,500 మంది మరణిస్తున్నారు. ఇక 2012లో 77,033 మంది నోటి కేన్సర్ బారినపడగా.. 52,067 మంది చనిపోయారని గ్లోబోకెన్ నివేదికను కేంద్రం ప్రస్తావించింది.
దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 60% మరణాలు
ఇటీవల యువకులు, మధ్య వయస్కులు కూడా మధుమేహం బారిన పడుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్-ఇండియాబీ (2014) అధ్యయనం ప్రకారం 6.24 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు మరో 7.7 కోట్ల మంది ప్రీ-డయాబెటిక్ స్థాయిలో ఉన్నారని స్పష్టం చేసింది. మరోవైపు 2008 లెక్కల ప్రకారం దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 26 శాతం గుండె సంబంధిత కారణాలతోనే చనిపోయారు. గుండె జబ్బుల కు ప్రధానంగా అధిక రక్తపోటు కారణంగా ఉంటోంది. పెద్ద వయసు వారిలో 32.5 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నట్లు అంచనా వేసింది.
మొత్తంగా దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 60 శాతానికిపైగా దీర్ఘకాలిక రోగాలతోనేనని కేంద్రం వెల్లడించింది. ఇందులో 52 శాతం మందిని ప్రాథమిక స్థాయి జాగ్రత్తలతో కాపాడుకోవచ్చని స్పష్టం చేసింది. అనారోగ్యకర ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, పొగాకు ఉత్పత్తుల వినియో గం, ఆల్కహాల్, కాలుష్యం, ఒత్తిడి, పేదరికం, ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం వంటివి దీర్ఘకాలిక రోగాలకు ప్రధాన కారణాలుగా కేంద్రం పేర్కొంది.
గ్రామస్థాయి వరకు ఆరోగ్య సేవల బలోపేతం
ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మూడు రకాల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఒకటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అందుకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం. రెండోది దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించడం. మూడోది దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి చికిత్స చేయడం. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆరోగ్యంపై అవగాహన, వ్యాధులను ముందే గుర్తించే కార్యక్రమాలు అమలుకావడం లేదని కేంద్రం పేర్కొంది. అందువల్ల రోగాల బారిన పడకుండా చూసేందుకు గ్రామస్థాయి వరకు ‘వెల్‌నెస్ కేంద్రాల’ను నెలకొల్పాలని సూచించింది.