కేంద్రం దిష్టిబొమ్మ దహనం
పుర్రె బొమ్మను రద్దు చేయాలని బీడీ కార్మికుల ఆందోళన
గంభీరావుపేట : బీడీ కట్టలపై పుర్రె గుర్తును తొలగించాలని, మూసేసిన కంపెనీలను వెంటనే తెరిపించి పని కల్పించాలని కోరుతూ శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బీడీకార్మికులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సిద్దిపేట, కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వారు మాట్లాడుతూ.. కంపెనీలు మూసేయడంతో పనుల్లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. సీఐటీయూ సిరిసిల్ల డివిజన్ అధ్యక్షుడు ముద్రకోల ఆంజనేయులు, కార్యదర్శి పంతం రవి మాట్లాడుతూ బీడీ కట్టలపై 85శాతం పుర్రె, క్యాన్సర్ హెచ్చరికలను ముద్రించాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. కేంద్రం సిగరెట్ కంపెనీలతో కుమ్మక్కై బీడీ కంపెనీలను మూసేసే కుట్ర పన్నిందన్నారు. బీడీ కార్మికుల శ్రమదోపిడీపై గంభీరావుపేటలో మార్చి 31న విచారణ చేపట్టిన అధికారులు బాధ్యులపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.