
ఇడియట్ బాక్స్‌తో క్యాన్సర్ చిక్కు!
రోజూ గంటల కొద్దీ టీవీ చూస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే గంటకు లోపు టీవీ చూసే వారితో పోలిస్తే మీలాంటి వారికి పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు. తగిన శారీరక వ్యాయామం లేనివారికి, క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కునేందుకు చేసిన పరిశోధనల్లో ఇదే అతిపెద్దదని వారు చెబుతున్నారు.
దాదాపు యాభై లక్షల మంది పురుషులపై ఆరేళ్లపాటు ఈ పరిశోధనలు జరిగాయి. టీవీ ఎక్కువ సేపు చూడటమన్నది చిరుతిళ్లు, పొగతాగడం వంటి అలవాట్లకు కారణం కావచ్చునని గతంలో కొన్ని పరిశోధనలు నిర్ధారణ చేసిన నేపథ్యంలో వీటి తాలూకూ దుష్ప్రభావాలు పేగు క్యాన్సర్‌గా పరిణమించవచ్చునని తాజా పరిశోధన చెబుతోంది.
ఈ కారణాల వల్లనే కంప్యూటర్ ముందు పనిచేసే వారికంటే టీవీ చూసే వారిలోనే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సూత్రం మహిళలకు వర్తించకపోవడం గమనార్హం. ఏతావాతా.. కడుపులో చల్ల కదలకుండా కూర్చునే వారితో పోలిస్తే కొద్దోగొప్పో వ్యాయామం చేసే పురుషులకు ఈ ప్రమాదకరమైన వ్యాధి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ లిండా బాల్డ్ తెలిపారు.
అర డిగ్రీ పెరిగినా 50 లక్షల మంది మునక...
భూమి సగటు ఉష్ణోగ్రతలు కేవలం అర డిగ్రీ సెల్సియస్ పెరిగినా దాదాపు 50 లక్షల మంది ముంపు ప్రమాదానికి గురవుతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం... అడవుల నరికివేత, కాలుష్యం తదితర అనేక కారణాల వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ భూతాపోన్నతిని ఈ శతాబ్దపు చివరికి 2.0 డిగ్రీ సెల్సియస్‌కు చాలా తక్కువగా ఉండేలా చర్యలు చేపట్టాలని మూడేళ్ల క్రితం నాటి ప్యారిస్ ఒప్పందం ద్వారా ప్రపంచదేశాలూ అంగీకరించాయి కూడా.
అయితే ప్రిన్స్‌టన్, రట్గర్స్, టఫ్టస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం భూతాపోన్నతి 0.5 డిగ్రీలు పెరిగినా ప్రమాదమేనని హెచ్చరిస్తోంది. సముద్ర మట్టాలు పెరిగిపోవడం వల్ల తీర ప్రాంతాల్లో ఉండే దాదాపు 50 లక్షల మంది వరద ముంపునకు గురవుతారనీ, వీరిలో కనీసం 60 వేల మంది చిన్న చిన్న దీవుల్లో ఉండేవారు ఉంటారని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రతను లెక్కకట్టేందుకు కొన్ని పరికరాలను ఏర్పాటు చేసి జరిపిన అధ్యయనం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు వారు అంటున్నారు.
ఒక్క న్యూయార్క్ నగరంలోనే వందేళ్లకు ఒకసారి వచ్చేంత తీవ్రస్థాయి తుఫానులు ఏటా వస్తాయని భూతాపోన్నతి రెండు డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఇలాంటి తుఫానులు ఏడాదికి రెండు వరకూ తాకుతాయని వివరిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే 2100 నాటికి 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే సగటు సముద్ర మట్టం 48 సెంటీమీటర్ల వరకూ పెరుగుతుందని రెండు డిగ్రీ సెల్సియస్ పెరుగుదల ఉంటే 56 సెంటీమీటర్ల పెరుగుదల ఉండవచ్చునని వారు చెబుతున్నారు.
కార్బన్ నానోట్యూబులతో చౌకైన ఇంధనం...
అమెరికాలోని స్టార్టప్ కంపెనీ మ్యాటర్‌షిఫ్ట్ ఓ వినూత్నమైన ఇంధన తయారీకి మార్గం సుగమం చేసింది. కార్బన్ నానోట్యూబులో పెద్దస్థాయిలో ఫిల్టర్లను తొలిసారి తయారు చేయగలగడంతో గాల్లోంచి తీసేసిన కార్బన్ డయాక్సైడ్‌తోనే మళ్లీ పెట్రోలు, డీజిళ్లను తయారు చేసేందుకు వీలేర్పడింది.
కార్బన్ నానోట్యూబులతో తయారైన ఫిల్టర్లు ఎథనాల్ తయారీతోపాటు ఉప్పునీటిలోని లవణాలను చౌకగా తొలగించేందుకు బాగా ఉపయోగపడతాయని రెండు దశాబ్దాలుగా తెలిసినప్పటికీ పెద్దస్థాయిలో తయారు చేయలేకపోవడం ప్రతిబంధకంగా మారింది. మ్యాటర్‌షిఫ్ట్ తొలిసారి వాణిజ్యస్థాయిలో భారీ ఎత్తున కార్బన్ నానోట్యూబుల ఫిల్టర్‌ను తయారు చేయగలగడంతో పరిస్థితి మారిపోనుందని అంచనా.
ఈ అతిసూక్ష్మమైన ఫిల్టర్ల ద్వారా గాల్లోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఉపయోగించుకుని పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను తయారు చేయవచ్చునని.. ఈ ఇంధనాల తయారీకి ప్రస్తుతం అవుతున్నదానికంటే చాలా తక్కువ వ్యయంతోనే వాటిని తయారు చేయగలగడం ఇంకో విశేషమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.