
మనలో అందరికీ ఏదో ఒకటి లేదా రెండు రంగులు ఇష్టమైనవై ఉంటాయి. ఆ ఇష్టమైన రంగు దుస్తులు, ఇతర అలంకరణ వస్తువులను అప్పుడప్పుడు వాడి సంతృప్తి పొందుతుంటాం. కానీ, తనకు ఇష్టమైన ఒక రంగును కొన్నేళ్లుగా అమితంగా ప్రేమిస్తూ, దానినే ధరిస్తూ, ఆ రంగుతోనే ఇంటినంతా అలంకరించుకొని, ఆ రంగులోనే జీవిస్తున్న అందమైన లేడీ ఒకరున్నారు. పేరు కిట్టెన్ కే సెరా. వయసు 56 ఏళ్లు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటుంది. టీవీ నటిగా గుర్తింపు పొందింది. తను చేసే టీవీ కార్యక్రమాలన్నింటిలోనూ పింక్ దుస్తుల్లోనే కనిపించేది. బెవర్లీ హిల్స్ చివావా2 సినిమాలోనూ పింక్ కలర్ ఆహార్యంతోనే నటించింది. ‘ది పింక్ లేడీ ఆఫ్ హాలీవుడ్’ అని ఈమెను అంతా ముచ్చటగా పిలుచుకుంటారు.
ముప్పై ఏళ్లకు పైగా గులాబీ రంగు తప్ప మరేమీ ధరించని ఈ పింకమ్మ జుట్టు రంగు పింక్, గోళ్ల రంగు పింక్, పెదాల రంగు పింక్, దుస్తులు పింక్... చివరకు తను వాడే కారు పింక్, ముద్దులొలికే కుక్క రంగు పింక్... ఇలా లైఫ్‌ని అంతా పింక్‌మయంగా మార్చుకున్న కిటెన్ కే సెరా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికల మీదా పింక్‌గానే కనిపిస్తూ ‘వరల్డ్ పింక్ క్వీన్’ అంటూ అభిమానుల చేత పిలిపించుకుంటుంది. అమ్మాయిల చెంపలను గులాబీ రంగు బుగ్గలు అంటూ పొగిడే కవులు ఈ గులాబీ లేడీని చూస్తే ఏమని పొగిడెదరో.. అనిపించకమానదు.