గాలిలో కాలుష్యం ఎక్కువైంది. ఎన్ని మొక్కలు నాటుతున్నా తగ్గడం లేదు. ఇదీ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య. మరి పరిష్కారం..? జొయానే కోరీని అడగాల్సిందే. అన్ని మొక్కల కంటే కనీసం 20 రెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణం నుంచి పీల్చేసుకునే కొత్త మొక్కను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ శాస్త్రవేత్త. అంతేనా? ఇంకా బోలెడు విశేషాలున్నాయి ఈ కొత్త మొక్కకు. ఈ మొక్కల్ని ఆహారంగానూ వాడుకోవచ్చు. పైగా అత్యంత కఠినమైన కరవు పరిస్థితులను కూడా తట్టుకుని బతకగలదు. సెనగల రుచిని పోలి ఉంటుంది. మానవ చర్యల కారణంగా భూమి వేడెక్కుతోందని... పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరిగిపోయి మనిషి మనుగడ కష్టమవుతుందని మనం తరచూ వింటూ ఉంటాం.
ఈ నేపథ్యంలోనే కోరీ ఆలోచనల్లోని కొత్త మొక్కకు ప్రాధాన్యం లభిస్తోంది. సుబేరిన్ అనే పదార్థం స్ఫూర్తిగా వీరు కొత్త మొక్కను అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. ఈ పదార్థమున్న మొక్క గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్ ను పీల్చేసుకుంటూ నేలలో నిక్షిప్తం చేస్తుందని... సముద్రతీర ప్రాంతాల్లో పెరిగే వేర్వేరు జాతుల గడ్డిలో సుబేరిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూంటుందని కోరీ వివరించారు. డీఎన్‌ఏలో మార్పులు చేయడం ద్వారా నీడలోనూ ఏపుగా పెరిగే మొక్కలను ఇప్పటికే అభివృద్ధి చేసిన కోరీ త్వరలోనే ఈ కొత్త మొక్కను సృష్టిస్తానని చెబుతున్నారు. భూమి మీద కార్బన్‌డయాక్సైడ్‌లో 50 శాతాన్ని పీల్చేయవచ్చునని కోరీ అంచనా.
Comments
Please login to add a commentAdd a comment