మొక్కలకు భాష ఉంటుందని, నీళ్లు పోసినపుడు ఆనందంతో కొమ్మలు ఊపూతూ ఆనందాన్ని ప్రకటిస్తాయని చాలా సార్లు విన్నాం. తాజాగా మొక్కలకూ బాధ ఉందనే విషయాన్ని తొలిసారిగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు మొక్కలు కూడా గట్టిగా అరుస్తాయని పరిశోధకులు వెల్లడించారు.
చెట్లు, మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకలించినప్పుడు, లేదా వాటి కాండాన్ని మధ్యలో నరికినప్పుడు మొక్కలు ఆక్రోశిస్తాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాలను గుర్తించారు. సెల్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నిశ్శబ్దమైన మైదానంలో కూడా మనకు వినబడని శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాలకు అర్థం ఉంటుంది. ఈ శబ్దాలను వినగలిగే జంతువులూ ఉన్నాయి. కాబట్టి చాలా శబ్ద పరస్పర చర్య జరిగే అవకాశం ఉందని పరిణామాత్మక జీవశాస్త్రవేత్త లిలాచ్ హడానీ తెలిపారు. సాధారణ సమయాల్లో కూడా మొక్కలు కొన్ని రకాల శబ్దాలు చేస్తాయని, మనిషి వినలేని ఈ శబ్దాలను కొన్ని జంతువులు, కీటకాలు గుర్తిస్తాయని తేల్చారు.
లిలాచ్ హడానీ
డా. హడానీ , ఆమె బృందం ఈ ప్రయోగాల కోసం టమాటాలు, పొగాకు మొక్కలను పరిశీలించారు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ద్వారా ఒత్తిడి లేని మొక్కలు, కాండం పెకిలించిన మొక్కలు, నిర్జలీకరణ మొక్కలు ఉత్పత్తి చేసే శబ్దాల మధ్య తేడాను గుర్తించానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయాల్లో మొక్కలు మీటరు దూరం మేర వినబడేలా హై పిచ్ శబ్దాలు చేస్తాయని గుర్తించారు. ఒత్తిడి లేని మొక్కలు ప్రశాంతంగానే ఉంటున్నట్టు గుర్తించారు. ఒత్తిడిలో ఉన్న మొక్కలు చేసిన శబ్దాలు అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు లేదా క్లిక్ చేసినట్టుగా ఉంటాయని, మనుషులకు వినబడవని పేర్కొన్నారు.
మొక్కలు తమ బాధలను తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగించే మార్గాలలో ఇదొకటి కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడి సమయాల్లో చెట్లు, మొక్కలు తమ రంగులు మార్చుకోవడం, లేదా ముడుచుకుపోవడం, ఇతర మార్పులకు లోనవుతాయని తెలుసు. అయితే, ఇవి శబ్దాలను కూడా వెలువరిస్తాయో లేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.. అయితే, మొక్కలు ఈ శబ్దాలను ఎలా చేస్తాయనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment