రాజు ఓ జ్ఞానిని కలిశాడు.‘‘స్వామీ.. నాకోసం మీరు దయచేసి భగవంతుడి దగ్గర ప్రార్థించగలరు’’ అని రాజు ఎంతో వినయంగా అడిగాడు.జ్ఞాని ‘‘అలాగే’’ అన్నాడు.‘‘దేవుడా, ఈ భూప్రపంచం మీద అందరూ సంతోషంతో ఉండాలి. అంతటా ప్రశాంతత నెలకొనాలి. అందరికీ సకల సిరిసంపదలు సమకూరి మంచి జరగాలి’’ అని జ్ఞాని ప్రార్థించాడు.ఈ మాటలన్నీ జ్ఞాని పెద్దగానే చెప్పాడు. ఆ మాటలను విన్న రాజు నిరాశ చెందాడు.జ్ఞాని ప్రార్థన ముగియడంతోనే రాజు ఆయనతో..‘‘స్వామీ ఏమిటిది.. నాకోసం కదా మిమ్మల్ని ప్రార్థించమన్నాను. కానీ మీరు ప్రపంచంలోని వారందరి కోసమూ ప్రార్థించారు. పోనీ అందులో నేను పాలిస్తున్న నా దేశం పేరో, నా పేరో లేదు.. నేనిలా మిమ్మల్ని కోరలేదుగా... ప్రత్యేకించి నా కోసం కదండీ ప్రార్థించమన్నాను’’ అన్నాడు.జ్ఞాని చిరునవ్వుతో చూశాడు.‘‘మీకొక విషయం అర్థం కాలేదనుకుంటాను. ప్రపంచం కోసం నేను ప్రార్థించడంలో తప్పేమీ కనిపించలేదు. అందరూ బాగుండాలని కదా నేను కోరుకున్నాను. అందరిలో మీరు లేకుండా పోతారా.. మీరూఉన్నారుగా..’’ అని జ్ఞాని అన్నాడు.అయితే జ్ఞాని జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు.‘‘అయినా ...’’ అని రాజు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. జ్ఞాని లోపలికి వెళ్లి ఓ బక్కెట్టు నిండా నీరు తీసుకొచ్చి రాజుకి అందించాడు.
ఆ నీరు తన ఆవరణలో ఉన్న చెట్లకు పోయమన్నాడు. రాజు అలాగే చెట్లన్నింటికీ పోసి జ్ఞాని వద్దకు వచ్చాడు.‘‘అన్నట్టు నీరెక్కడ పోశారు’’ అని జ్ఞాని అడిగాడు.‘‘అన్ని చెట్లకు పోశాను’’అన్నాడు రాజు.‘‘చెట్లలో ఏ భాగానికి పోశారు.’’ అడిగాడు జ్ఞాని.‘‘వేరుకే’’ అన్నాడు రాజు.‘‘మీ చర్య విచిత్రంగా ఉంది. కొమ్మల్లో ఆకులు చాలా వరకూ వాడినట్లు కనిపిస్తున్నాయి కదా... మీరేమో ఆకులపైన పోయకుండా వేళ్లకు నీరు పొయడమేంటీ’’ అని అడిగాడు జ్ఞాని.అప్పుడు రాజు ‘‘వేరుకి పోస్తే ఆ నీరు అన్ని కొమ్మలకూ ఆకులకూ తానుగా విస్తరించదా చెప్పండి’’ అని అన్నాడు.‘‘సరిగ్గా నేనూ అదే చేశాను..’’ అన్నాడు జ్ఞాని.‘‘ప్రపంచంలోని మానవజాతి అంతా బాగుండాలని, కాపాడమని దేవుడిని ప్రార్థించాను. ఇలా వేడుకోవడం వల్ల అది అందరి కోసమూ కోరుకున్నట్టే అవుతుంది. అంతే తప్ప మిమ్మల్ని విస్మరించినట్లు కాదు’’ అని జ్ఞాని చెప్పడంతోనే రాజుకి విషయంబోధపడింది. మరో మాట మాట్లాడక మౌనం వహించి తన కళ్లు తెరిపించిన జ్ఞానికి నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించాడు.
– యామిజాల జగదీశ్
అందరి కోసం
Published Tue, Apr 16 2019 12:05 AM | Last Updated on Tue, Apr 16 2019 12:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment