మన దేశం ఛాయాచిత్ర స్వర్గధామం!
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
ఫొటోగ్రఫీకి అవసరమైన వనరులు భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. నేడదే ప్రపంచ ఫొటోగ్రాఫర్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతి ఏడాది బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ, ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా, ఫ్రాన్స్‌కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీలా ఆర్‌ట సంస్థలు అందించే ఫొటోగ్రఫీ ఆనర్స్‌లో అత్యధిక అంశాలు మన దేశంలో చిత్రీకరించినవి కావడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ స్టీవ్ మ్యాక్‌రే ఇప్పటికే 85 సార్లు భారతదేశాన్ని సందర్శించాడంటే మరోమాట చెప్పక్కర్లేదు.
మనదేశంలో ఏ మూలకు వెళ్లినా కెమెరాకు 365 రోజులు పని దొరుకుతుంది అంటారు ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫిక్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ఓ.పి.శర్మ. ముఖ్యంగా ఆగస్టు నుండి ఏప్రిల్ వరకు మనదేశంలో జరిగే వివిధ పండుగలు, ఉత్సవాలు ‘కెమెరా’ కంటికి అద్భుతమైన అందాలను అందిస్తాయి.
భారతీయ గ్రామీణ సౌందర్యం గురించి చెప్పనక్కర్లేదు. ఒడిశాలో నివసించే బొండా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో నివసించే బంజారీలు, లడక్‌లో నివసించే ధా గిరిజనుల జీవనశైలి, ధరించే దుస్తులు, ఆభరణాలు ఛాయాచిత్రకారులకు వరంగా చెప్పుకోవచ్చు.
ఛాయాచిత్రకారుడి కన్ను విశాలమైంది. అది చూసే ప్రతి కన్నుకి విభిన్నమైంది. ప్రఖ్యాత ఫొటో జర్నలిస్ట్ రఘురాయ్ తాజహమహల్‌ను 1000 కోణాల్లో విభిన్నంగా తీశారు!
భారతదేశంలో కెమెరా కన్ను వికసింపజేసిన ఆర్యుల్లో ఒకరు రాజా దీనదయాళ్. నాగపూర్ నుండి హైదరాబాద్ వచ్చి నిజాం ఆస్థాన ఫొటోగ్రాఫర్‌గా అజరామరమైన చిత్రాలు తీసిన దీనదయాళ్ వారసత్వాన్ని రాజాత్రయంబర్ తీసుకున్నారు. నాటినుంచి అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ నేడు ఆధునికతను సంతరించుకుంది మన ఛాయా చిత్రం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫొటోగ్రఫీ పోటీలలో భారతీయులు... ముఖ్యంగా మన తెలుగువారు ముందు వరుసలో ఉంటున్నారు. రాబోయే కాలంలో మన ప్రతిభ మరింత వికసించాలని కోరుకుందాం.
- టి. శ్రీనివాసరెడ్డి, ఫొటోగ్రాఫర్