అపురూప సంస్కారవతి | Plus sanskaravati | Sakshi
Sakshi News home page

అపురూప సంస్కారవతి

Published Thu, Mar 27 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

Plus sanskaravati

సంక్షిప్తంగా... రాణీ గాయత్రీదేవి

అసలు తన పదమూడో ఏట చూడాలి రాకుమారి గాయత్రీదేవిని! ఆ అతిలోక సౌందర్యం ఎదుట ఎంతమంది రాజులు మోకరిల్లారో, ఎంతమంది శలభాలై రాలిపడ్డారో!! గట్టిగా నిలబడినవాడొక్కడే... జైపూర్ మహారాజు మాన్‌సింగ్! అప్పుడతడికి ఇరవై ఒక్కేళ్లు. అందగాడు, సంపన్నుడు. మంచి ‘పోలో’ ఆటగాడు. ఎనిమిదేళ్లపాటు వీళ్ల మధ్య ప్రేమ నడిచింది. అమె ఇరవై ఒకటో ఏట పెళ్లి జరిగింది. అప్పటికే మాన్‌సింగ్‌కి రెండు పెళ్లిళ్లు! అయినా సరే, మూడో భార్యగా అతడి చెయ్యి అందుకుంది. అదీ రహస్యంగా, తర్వాత అధికారికంగా.
 
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక పార్లమెంటుకు పోటీ చేసిన తొలి రాకుమారిగా గాయత్రీ దేవి కలకలం రేపారు. 1962  ఎన్నికల్లో  కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ‘స్వతంత్ర పార్టీ’ తరఫున  జైపూర్ నుంచి నిలబడి 1,92,909 ఓట్లు గెలుచుకుని (పోలైన 2,46,516 ఓట్లలో) గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు! తిరిగి 67 ఎన్నికల్లోనూ, 71 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఎమర్జెన్సీ సమయంలో ఐదు నెలలపాటు తీహార్ జైల్లో ఉన్నారు.
 
గాయత్రీదేవి 1919 మే 23న లండన్‌లో జన్మించారు. కూచ్ బెహార్ సంస్థానపు ముద్దుల పట్టి గాయత్రి. బాల్యంలో ఆమెపై ప్రధానంగా ఇద్దరు మహిళల ప్రభావం ఉంది. ఒకరు: ఆమె తల్లి, రాజమాత. 1922లో గాయత్రి తండ్రి చనిపోగా, ఆ తర్వాత దశాబ్దకాలం పాటు రాజమాతే పరిపాలించారు. ఇంకొకరు: గాయత్రి అమ్మమ్మ, బరోడా మహారాణి. ఆమె భర్త తన హయాంలో బరోడాను దేశంలోనే అత్యాధునిక సంస్థానంగా అభివృద్ధి పరిచారు.

ఈ ఇద్దరు రాణులూ కలిసి గాయత్రీదేవిని చక్కటి ఇంగ్లీషు సంస్కారంతో కూడిన భారతీయ యువరాణిగా మలిచారు. అందుకే గాయత్రీదేవి మాన్‌సింగ్‌ను చేసుకుంటానని అనగానే అక్కడి రాజపుత్రుల కఠిన ఆచారాలను ఈ పిల్ల తట్టుకోగలదా అని కలత చెందారు. అయితే తట్టుకోవడం మాత్రమే కాదు, ఆధునిక యువతిగా తన ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు గాయత్రీదేవి.

అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సంస్థాన వ్యూహాలు, వ్యవహారాలలో భర్తకు చేదోడుగా, కీలక సలహాదారుగా నిలిచారు. 1943లో ‘గాయత్రీదేవి బాలికల పాఠశాల’ను నెలకొల్పి, తొలి యేడాదే 40 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్ టీచర్‌ని నియమించారు. ఆ పాఠశాల దేశంలోనే అత్యుత్తమ బాలికల పాఠశాలగా గుర్తింపు పొందింది.
 
1947లో స్వాతంత్య్రం వచ్చాక జైపూర్, మరో పద్దెనిమిది సంస్థానాలు కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. జైపూర్ రాజధాని అయింది. ఆమె భర్త రాష్ట్ర గవర్నర్ అయ్యారు. అయితే అధికారాలన్నిటినీ కాంగ్రెస్ తన చేతుల్లోనే ఉంచుకుంది. ఆ పరిస్థితుల్లో గాయత్రీదేవి స్వతంత్ర పార్టీలో చేరారు.
 
1970లో ప్రభుత్వం సంస్థానాలను పూర్తిగా రద్దు చేసింది. గాయత్రీదేవి, అమె భర్త కొన్నాళ్లు ఇంగ్లండ్‌లో గడిపారు. అక్కడ ఉన్నప్పుడే మాన్‌సింగ్ పోలో ఆటకు అంపైరింగ్ చేస్తూ కుప్పకూలి, మరణించారు. అనంతరం గాయత్రీదేవి రాజమాత  అయ్యారు.
 
1975లో జైల్లో ఉన్నప్పుడు గాయత్రీదేవి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆ తర్వాతి రెండున్నర దశాబ్దాలు గాయత్రీదేవి జీవితం ఒక రాజపుత్ర వితంతువు జీవితంలా నిస్సారంగా, నిరర్థకంగా గడవలేదు. ప్రపంచమంతటా పర్యటించారు. వేసవి కాలాలను ఇంగ్లండ్‌లో తను చదువుకున్న మంకీ క్లబ్ పాఠశాల ఉన్న ప్రాంతమైన నైట్స్‌బ్రిడ్స్‌లో; శీతాకాలాలను జైపూర్‌లో తమ ఇద్దరి కోసమే తన భర్త కట్టించిన లిలీపూల్ సౌధంలో ప్రశాంతంగా, నిరాడంబరంగా గడిపారు.

1980లలో ‘ప్రిన్సెస్ రిమెంబర్స్’ అనే పేరుతో ఆమె ఆత్మకథ ఇంగ్లండ్‌లో వెలువడింది. తొంభై ఏళ్ల వయసులో 2009లో ఆమె ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. 1943లో ఈ అసమాన సౌందర్యవతి ఫొటోలను సెసిల్ బీటన్ అనే ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ప్రత్యేకంగా షూట్ చేశారు. ఇటీవలే వాటిలోని ఒక ఫొటో... ‘ఇండియన్ ఉమెన్ త్రూ ద ఏజెస్’ అనే థీమ్‌లో భాగంగా న్యూఢిల్లీ ప్రదర్శనలో ప్రత్యక్షమయింది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement