aesthetics
-
Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ హర్నాజ్ గురించి ఈ విషయాలు తెలుసా?
Interesting Facts About Harnaaz Sandhu: ప్రపంచం ఎదుట భారతీయ సౌందర్యం మరోసారి మెరుపు నవ్వు నవ్వింది. ప్రపంచం ఎదుట భారతీయ సంస్కారం మరోసారి తన ఎరుకను ప్రదర్శించింది. ప్రపంచం ఎదుట భారతీయ స్త్రీ సౌందర్యకాంక్ష తన శిరస్సు మీదకు జయ కిరీటాన్ని ఆహ్వానించింది. చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు ‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుంది. 21 ఏళ్ల హర్నాజ్ 2021లో 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత మరోసారి ఈ కిరీటాన్ని దేశానికి తెచ్చింది. ‘చక్ దే ఫట్టే ఇండియా’ అని కేరింతలు కొట్టింది హర్నాజ్ కిరీటం గెలిచాక. అంటే ‘సాధించు. గెలుపు సాధించు ఇండియా’ అని అర్థం. నేడు ఇండియా గెలిచింది. ‘విశ్వసుందరి’ మిస్ ఇండియా హర్నాజ్ సంధు (మధ్యలో) ఇరువైపులా రన్నరప్స్ పరాగ్వేకు చెందిన మిస్ నాడియా, సౌతాఫ్రికాకు చెందిన మిస్ లలేలా డిసెంబర్ 12న (మన తేదీ ప్రకారం 13 తెల్లవారుజామున) భారతీయురాలైన హర్నాజ్ సంధు తల మీద విశ్వసుందరి కిరీటం తళుక్కున మెరిసింది. ప్రపంచమంతా కరతాళధ్వనులు మోగిస్తుండగా దేశం అందమైన ఈ విజయంతో ఉత్సాహంగా నిద్ర లేచింది.1994లో సుస్మితా సేన్ మొదటిసారి ఈ టైటిల్ గెలిచి స్ఫూర్తి ఇచ్చాక 2000లో లారా దత్తా రెండోసారి గెలిచాక మూడోసారి టైటిల్‌కై సాగుతున్న ఎదురుచూపులకు అడ్డుకట్ట వేస్తూ హర్నాజ్ ఈ సౌందర్యాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇజ్రాయిల్ రేవు పట్టణం ఐలత్లో తాత్కాలికంగా నిర్మించిన భారీ ప్రాంగణంలో సుప్రసిద్ధ వ్యాఖ్యాత స్టీవ్ హార్వే హోస్ట్‌గా జరిగిన ఈ విశ్వ పోటీలో 80 దేశాల పోటీదారులను దాటి హర్నాజ్ ఈ కిరీటాన్ని గెలుచుకుంది. ఎర్రసముద్రం మురిసిపోయింది ఎర్రసముద్రం ఒడ్డు మీద ఉన్న 50 వేల జనాభా కలిగిన ఐలత్ పట్టణంలో హర్నాజ్ విజయంతో భారత్ పేరు మార్మోగింది. ఎవరీ అందగత్తె అని ఎర్రసముద్రం తొంగి చూసి మురిసిపోయింది. ‘భారతీయ సౌందర్యానికి నేను బెస్ట్ వెర్షన్‌ని’ అని పోటీలకు వెళ్లబోతూ వ్యాఖ్యానించిన హెర్నాజ్ 80 దేశాల అందగత్తెలతో తలపడి ముందు టాప్ 16లో ఆ తర్వాత టాప్ 10లో ఆపైన టాప్ 5లో వెళ్లి టైటిల్ మీద ఆశలు రేపింది. టాప్-3లోకి రాగానే ఉత్కంఠ నెలకొంది. చివరి ఇద్దరిలో పరాగ్వే దేశ పోటీదారైన నాడియా చేతులు పట్టుకుని అంతిమ ఫలితం కోసం నిలుచున్న హెర్నాజ్ ‘ఇండియా’ అన్న ప్రకటన వెలువడిన వెంటనే ఆనందబాష్పాలు రాల్చింది. సెకండ్ రన్నర్ అప్‌గా సౌత్ ఆఫ్రికాకు చెందిన లలేలా నిలిచింది. సౌందర్యంతో పాటు చైతన్యం కూడా అందాల పోటీలో భాగంగా ప్రశ్న–జవాబు ఘట్టంలో లాటరీ ద్వారా ‘గ్లోబల్ వార్మింగ్’ అంశం తన వంతుకు రాగా హర్నాజ్ చైతన్యవంతమైన జవాబు చెప్పింది. ‘ఒకనాడు మనకు మన జీవితం సాక్షాత్కరిస్తుంది. అది వీక్షించదగ్గదిగా ఉండాలని మనం అనుకుంటాం. కాని పర్యావరణానికి మనం చేస్తున్న అవమానకరమైన కీడు వల్ల ఆ జీవితం మనం ఆశించినట్టుగా ఉండదు. ప్రకృతి మరణిస్తుంది. ఇప్పటికైనా ఈ చేటును మనం నివారించగలం. కనీసం అక్కర్లేని లైట్లను ఈ రాత్రి నుంచే ఆఫ్ చేయడం మొదలెడదాం’ అంది. అలాగే ‘నేటి యువతులు ఎదుర్కొంటున్న వొత్తిడిని మీరెలా చూస్తారు’ అనే ప్రశ్నకు ‘నేటి యువతులకు అన్ని శక్తులూ ఉన్నాయి. కాని వారికి వారి పైన నమ్మకం లేదు. ఇతరులతో పోల్చుకుని న్యూనత చెందుతున్నారు. మీరు మీలాగే ఉండటం మీ ప్రత్యేకత అని తెలుసుకోవాలి’ అంటూ సమాధానం చెప్పింది. ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్‌కు విశ్వకిరీటం దక్కగానే తొలి భారతీయ విశ్వసుందరి సుస్మితాసేన్ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘ప్రతి భారతీయుని గర్వం హర్నాజ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ’ అని వ్యాఖ్యానించింది. ఇక లారాదత్తా అయితే ‘విశ్వసుందరుల క్లబ్‌లోకి ఆహ్వానం. ఈ విజయం కోసం 21 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్ చేసింది. నిన్న మొన్నటి వరకూ ఒకటి రెండు పంజాబీ సినిమాల్లో నటించింది సంధు. బహుశా అతి త్వరలో ఆమెను బాలీవుడ్ తెర మీద చూడొచ్చు. మధ్యతరగతి విజయం ‘హర్నాజ్ మధ్యతరగతి అమ్మాయి. మధ్యతరగతి అమ్మాయిలు కలలు కని సాధించుకోవచ్చు అనడానికి ఉదాహరణ’ అంటుంది హర్నాజ్ తల్లి రవిందర్ సంధు. ఆమె గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు. హర్నాజ్ తండ్రి పేరు పి.ఎస్.సంధు. ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు హరూన్. వీరి కుటుంబం చండీగడ్‌లోని మోహలీలో ఉంటుంది. ఒకవైపు అందాలపోటీ జరుగుతుంటే హర్నాజ్ తల్లి దగ్గరలో ఉన్న గురుద్వార్‌లో రాత్రంతా ప్రార్థనలో కూచుంది. తెల్లవారుజామున హర్నాజ్ టైటిల్ గెలవడం చూసి సోదరుడు హరూన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గురుద్వారాలోని తల్లికి ఈ విషయం తెలియచేశాడు. ‘నా కూతురు తిరిగి రావడంతోటే ఆమెకు ఇష్టమైన ‘మక్కికి రోటీ’, ‘సర్సన్ ద సాగ్’ చేసి పెడతాను’ అంది తల్లి ఉత్సాహంగా. హర్నాజ్ చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేది. సాటి విద్యార్థుల గేలి ఎదుర్కొనేది. అయినా సరే టీనేజ్‌లోకి వచ్చాక అందాలపోటీ పట్ల ఆసక్తి పెంచుకుంది. 2017లో ‘మిస్ పంజాబ్’ టైటిల్ గెలుచుకుంది. 2019లో ‘మిస్ ఇండియా’లో సెమీ ఫైనలిస్ట్ దశకు చేరుకుంది. ‘అప్పుడు అర్థమైంది నాకు అందాల పోటీ అంటే కేవలం అందంగా కనిపించడం కాదు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అని. విశ్వ కిరీటం సాధించడానికి ఆ విధంగా నేను సిద్ధమయ్యాను.’ అంటుంది సంధు. కుటుంబ సభ్యులతో హర్నాజ్ The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 -
చర్మ సౌందర్యానికి పుచ్చకాయ
టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసంలో 1 టేబుల్ స్పూన్ తేనెని కలిపి ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలు పాటు ఆరనిచ్చి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇది మీ చర్మానికి కావాల్సిన తేమను సమకూర్చి మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసంలో 1 టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖంపై పట్టించాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, కోమలంగా మార్చేస్తుంది. టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసంలో గుజ్జుగా చేసిన అవకాడో పండుని కలిపి ఈ మిశ్రమాన్ని మీ ముఖం మెడ మీద పట్టించాలి. 20 నిమిషాలు తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. -
జ్ఞాపకాల అల్లికలు
పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాలలో ఆడపిల్లలే అలంకారం. చిన్నారి పాపాయి మొదలు ఆడపిల్లలందరికీ పూల జడలు ఉండేవి. మేనత్తలు, పిన్నులు, అమ్మమ్మలు.. వారిని ఆటపట్టిస్తూ జడ కుట్టేవారు. రామాయణభారతాలు చదివిన అమ్మమ్మలు, జడ కుడుతున్నంతసేపు ఆ కథలలోని ఘట్టాలు చెబుతూ, పిల్లలకు విద్య నేర్పేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లి కూతురు జడ కుట్టడానికి కాంట్రాక్ట్ వారు వస్తున్నారు. ప్లాస్టిక్ పూలు, బంగారు పూలు, వెండిపూలు, పూసల పూలతో జడలు కుట్టించుకుంటున్నారు. దాంతో పూలజడలు జ్ఞాపకాల గుబాళింపులుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ఆ కాలనీలో జయమ్మ గారు, వెంకటలక్ష్మి గారు ఇద్దరూ వేసవికాలంలో క్షణం తీరిక లేకుండా ఉంటారు. సందులోని ఆడపిల్లలంతా వీరిద్దరినీ తలో రోజు సొంతం చేసుకుంటారు. పూల జడ కుట్టాలంటే వారిద్దరే ఆ కాలనీ మొత్తానికి. జయమ్మగారికి ఇద్దరు ఆడ పిల్లలు, వెంకటలక్ష్మి గారికి ఐదుగురు ఆడపిల్లలు. ఈ కాలంలో మాత్రం వారిద్దరికీ చెరో యాభై మంది ఆడపిల్లలు. పూలజడల్ని వెయ్యడంలో తల్లి కంటె ఆప్యాయంగా పలకరించే జయమ్మ ఒక శైలి, అమ్మమ్మ కంటె ఆదరంగా అభిమానించే వెంకటలక్ష్మిది ఒక శైలి. మధ్యాహ్నానికి సిద్ధమైపోవాలి పూల జడల కోసం ప్రత్యేకంగా జడ మొగ్గల్ని ఎంపిక చేసుకుంటారు. అవి చక్కగా నిలువుగా కుదురుగా ఉంటాయి. జడ మొగ్గలు, కొబ్బరి పుల్లలు, కనకాంబరాలు, మరువం, పొడవాటి అట్టలు, సూది, దారం, సవరం, జడగంటలతో.. ఆ రోజు పూలజడ కుట్టించుకోవాలనుకున్న ఆడపిల్లలు మధ్యాహ్నం రెండు గంటలకల్లా సిద్ధం కావాలి. పూల మార్కెట్‌కి వెళ్లి, కిలో మల్లెమొగ్గలు, కొద్దికొద్దిగా కనకాంబరాలు, మరువం తెచ్చుకుని జడకు సిద్ధమైపోయేవారు. మల్లె, కనకాంబరం, మరువం మొగ్గలకు ఉన్న తొడిమలు తీసి, పెద్దపెద్దగా పొడవుగా ఉన్న మొగ్గలను పుల్లలకు గుచ్చి, ఆ పుల్లలను జడ ఆకారంలో కత్తిరించిన అట్ట మీద రెండు వైపులా రెండు వరసలలో కుట్టి, మధ్యలో అడ్డంగా మొగ్గలను సూదితో గుచ్చుతూ నాలుగు వరసలు మల్లె మొగ్గలు, రెండు వరసలు కనకాంబరాలు, ఒక వరుస మరువంతో అందమైన మల్లె మొగ్గల జడ త్రివర్ణ పతాకంలా శ్రీకారం చుట్టుకుని, ఆకారం దాలుస్తుంది. జడలోకి పండుగొచ్చేది! పూలజడ వేసుకున్న రోజున ఆడపిల్లలకు పండుగే. చక్కటి పట్టు లంగా కట్టుకుని, చేతులకు నిండుగా రంగురంగుల గాజులు వేసుకుని, తరతరాలుగా భోషాణంలో నిద్దరోతున్న బంగారు హారాలను మేల్కొల్పి, మెడలో అలంకరించుకునేవారు. జడ కిందుగా బంగారు రంగులో జడకుప్పెలు వయ్యారాలొలుకుతూ తాండవమాడేవి. అక్కడితో ఆగేవారా! పట్టు లంగా, కాసులపేరు, పూలజడను కలకాలం పదిలపరచుకోవడం కోసం, ఫొటో స్టూడియోలకి వెళ్లి, మూడు అద్దాలలో జడ మాత్రమే కనపడేలా నిలబడి ఫొటో తీయించుకోవడం అప్పట్లో చాలా గొప్ప. ఇప్పటివి అప్పటికప్పుడే అలాంటి పూలజడ ఇప్పుడు జ్ఞాపకాల్లో మిగిలిపోయింది! పట్టు పరికిణీల స్థానాన్ని చుడీదార్లు, చేతికి గాజుల బదులు బ్రేస్లెట్స్, బంగారు ఆభరణాల స్థానంలో జూట్, థ్రెడ్ జ్యూయలరీ వచ్చేసినట్లుగానే, నల్లటి వాలు జడల స్థానంలో జుట్లు వదులుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఒకవేళ పూల జడ వేసుకున్నా, రెడీమేడ్‌గా దొరికే వన్ గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్ పూల జడలను అలా తెచ్చి, ఇలా తగిలించుకుంటున్నారు. ఇవి జ్ఞాపకాలను మిగల్చవు. అప్పటికప్పుడు ప్రశంసలు మాత్రం అందుతాయి. – పురాణపండ వైజయంతి -
రెండోరోజు అలంకారం బాలాత్రిపురసుందరి
నిర్మలమైన మనస్సుకూ, నిత్యసంతోషానికీ చిహ్నాలు చిన్నారులు. నవరాత్రి వేడుకలో ఈ రోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరిస్తారు. బాల్యం దైవత్వంతో సమానమని ప్రతీకాత్మకంగా నిరూపించడమే ఈ అలంకరణ ఆంతర్యం. బాలారూపంలో అమ్మను దర్శించే భక్తులకు ఎటువంటి మనోవికారాలకు లోనుకాని ప్రశాంత చిత్తం కలుగుతుందని విశ్వాసం. దిక్కులన్నిటినీ కాంతిపుంజాలతో నింపుతూ జ్ఞానాన్ని ప్రదానం చేసే అభయ హస్తంతో, వరదానం చేస్తూ స్ఫటికమాల, విద్యాప్రదాయినిగా పుస్తకాన్ని, ఎర్రకలువను చేత ధరించి చతుర్భుజాలతో మోమున చిరు మందహాసంతో శ్రీబాలాత్రిపురసుందరీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. నివేదన: కట్టెపొంగలి, దద్యోదనం శ్లోకం: దధానాకర పద్మాభ్యామక్షమాలా కమండలూ! దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యమత్తమా! భావం: వరదాభయ హస్తాలతో జ్ఞానం అనే అక్షరమాలను స్ఫటికమాలను ధరించి జ్ఞానప్రదానం చేయుము జగద్ధాత్రీ! అర్చన, సందర్శన ఫలమ్: ఉన్నతవిద్య, విశేషజ్ఞాన సంపదలు చేకూరతాయి. - దేశపతి అనంత శర్మ -
అపురూప సంస్కారవతి
సంక్షిప్తంగా... రాణీ గాయత్రీదేవి అసలు తన పదమూడో ఏట చూడాలి రాకుమారి గాయత్రీదేవిని! ఆ అతిలోక సౌందర్యం ఎదుట ఎంతమంది రాజులు మోకరిల్లారో, ఎంతమంది శలభాలై రాలిపడ్డారో!! గట్టిగా నిలబడినవాడొక్కడే... జైపూర్ మహారాజు మాన్సింగ్! అప్పుడతడికి ఇరవై ఒక్కేళ్లు. అందగాడు, సంపన్నుడు. మంచి ‘పోలో’ ఆటగాడు. ఎనిమిదేళ్లపాటు వీళ్ల మధ్య ప్రేమ నడిచింది. అమె ఇరవై ఒకటో ఏట పెళ్లి జరిగింది. అప్పటికే మాన్‌సింగ్‌కి రెండు పెళ్లిళ్లు! అయినా సరే, మూడో భార్యగా అతడి చెయ్యి అందుకుంది. అదీ రహస్యంగా, తర్వాత అధికారికంగా. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక పార్లమెంటుకు పోటీ చేసిన తొలి రాకుమారిగా గాయత్రీ దేవి కలకలం రేపారు. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ‘స్వతంత్ర పార్టీ’ తరఫున జైపూర్ నుంచి నిలబడి 1,92,909 ఓట్లు గెలుచుకుని (పోలైన 2,46,516 ఓట్లలో) గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు! తిరిగి 67 ఎన్నికల్లోనూ, 71 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఎమర్జెన్సీ సమయంలో ఐదు నెలలపాటు తీహార్ జైల్లో ఉన్నారు. గాయత్రీదేవి 1919 మే 23న లండన్‌లో జన్మించారు. కూచ్ బెహార్ సంస్థానపు ముద్దుల పట్టి గాయత్రి. బాల్యంలో ఆమెపై ప్రధానంగా ఇద్దరు మహిళల ప్రభావం ఉంది. ఒకరు: ఆమె తల్లి, రాజమాత. 1922లో గాయత్రి తండ్రి చనిపోగా, ఆ తర్వాత దశాబ్దకాలం పాటు రాజమాతే పరిపాలించారు. ఇంకొకరు: గాయత్రి అమ్మమ్మ, బరోడా మహారాణి. ఆమె భర్త తన హయాంలో బరోడాను దేశంలోనే అత్యాధునిక సంస్థానంగా అభివృద్ధి పరిచారు. ఈ ఇద్దరు రాణులూ కలిసి గాయత్రీదేవిని చక్కటి ఇంగ్లీషు సంస్కారంతో కూడిన భారతీయ యువరాణిగా మలిచారు. అందుకే గాయత్రీదేవి మాన్సింగ్ను చేసుకుంటానని అనగానే అక్కడి రాజపుత్రుల కఠిన ఆచారాలను ఈ పిల్ల తట్టుకోగలదా అని కలత చెందారు. అయితే తట్టుకోవడం మాత్రమే కాదు, ఆధునిక యువతిగా తన ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు గాయత్రీదేవి. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సంస్థాన వ్యూహాలు, వ్యవహారాలలో భర్తకు చేదోడుగా, కీలక సలహాదారుగా నిలిచారు. 1943లో ‘గాయత్రీదేవి బాలికల పాఠశాల’ను నెలకొల్పి, తొలి యేడాదే 40 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఇంగ్లిష్ టీచర్ని నియమించారు. ఆ పాఠశాల దేశంలోనే అత్యుత్తమ బాలికల పాఠశాలగా గుర్తింపు పొందింది. 1947లో స్వాతంత్య్రం వచ్చాక జైపూర్, మరో పద్దెనిమిది సంస్థానాలు కలిసి రాజస్థాన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. జైపూర్ రాజధాని అయింది. ఆమె భర్త రాష్ట్ర గవర్నర్ అయ్యారు. అయితే అధికారాలన్నిటినీ కాంగ్రెస్ తన చేతుల్లోనే ఉంచుకుంది. ఆ పరిస్థితుల్లో గాయత్రీదేవి స్వతంత్ర పార్టీలో చేరారు. 1970లో ప్రభుత్వం సంస్థానాలను పూర్తిగా రద్దు చేసింది. గాయత్రీదేవి, అమె భర్త కొన్నాళ్లు ఇంగ్లండ్‌లో గడిపారు. అక్కడ ఉన్నప్పుడే మాన్సింగ్ పోలో ఆటకు అంపైరింగ్ చేస్తూ కుప్పకూలి, మరణించారు. అనంతరం గాయత్రీదేవి రాజమాత అయ్యారు. 1975లో జైల్లో ఉన్నప్పుడు గాయత్రీదేవి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆ తర్వాతి రెండున్నర దశాబ్దాలు గాయత్రీదేవి జీవితం ఒక రాజపుత్ర వితంతువు జీవితంలా నిస్సారంగా, నిరర్థకంగా గడవలేదు. ప్రపంచమంతటా పర్యటించారు. వేసవి కాలాలను ఇంగ్లండ్‌లో తను చదువుకున్న మంకీ క్లబ్ పాఠశాల ఉన్న ప్రాంతమైన నైట్స్‌బ్రిడ్స్‌లో; శీతాకాలాలను జైపూర్‌లో తమ ఇద్దరి కోసమే తన భర్త కట్టించిన లిలీపూల్ సౌధంలో ప్రశాంతంగా, నిరాడంబరంగా గడిపారు. 1980లలో ‘ప్రిన్సెస్ రిమెంబర్స్’ అనే పేరుతో ఆమె ఆత్మకథ ఇంగ్లండ్‌లో వెలువడింది. తొంభై ఏళ్ల వయసులో 2009లో ఆమె ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. 1943లో ఈ అసమాన సౌందర్యవతి ఫొటోలను సెసిల్ బీటన్ అనే ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ప్రత్యేకంగా షూట్ చేశారు. ఇటీవలే వాటిలోని ఒక ఫొటో... ‘ఇండియన్ ఉమెన్ త్రూ ద ఏజెస్’ అనే థీమ్‌లో భాగంగా న్యూఢిల్లీ ప్రదర్శనలో ప్రత్యక్షమయింది!