ప్రేమ... అందులోంచి ఈర్ష్య... అసూయ...
ఇతరులతో మాట్లాడితే సహించలేకపోవడం...
తనను మాత్రమే ఇష్టపడాలనే తత్త్వం...
ప్రేమలో ఇవన్నీ సర్వసాధారణం...
ఇందులో అసాధారణమైనదే ఓవర్ ‘పొసెసివ్‌నెస్’ అంటున్నాడు సుభాష్ తన ‘పొసెసివ్‌నెస్’ లఘుచిత్రం ద్వారా...
డెరైక్టర్స్ వాయిస్
మాది విశాఖపట్టణం. నేను వైజాగ్‌లోని ఎం.వి.జి.ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బి.టెక్ (ఐటీ) చేశాను. ప్రస్తుతం చెన్నైలోని ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలో ‘మాస్టర్స్ ఇన్ ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్’ కోర్సు చేస్తున్నాను. నాకు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం బాగా ఉంది. ముఖ్యంగా స్నేహితులు సపోర్ట్ చేస్తున్నారు.
మా స్నేహితుడితో కలిసి ఎం.ఆర్.ప్రొడక్షన్ స్థాపించాను. ఈ బ్యానర్ మీద ఇప్పటికి 99 లఘుచిత్రాలు తీశాను. మా సంస్థ స్థాపించి ఈ సంవత్సరం డిశంబరు ఒకటికి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది. 100వ చిత్రం తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కథ విషయానికి వస్తే... ప్రేమించుకునే వారి మధ్య పొసెసివ్‌నెస్ ఉంటుంది. దానివల్ల ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ఒక్కోసారి వారి ప్రేమకు బ్రేకప్ చెప్పే పరిస్థితి వస్తుంది. అటువంటివారిని నేను ప్రత్యక్షంగా చూశాను. అలా ఒక వాస్తవ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ వారు ముందుకొచ్చి, మా చిత్రానికి దేశవ్యాప్తంగా www.airtel.co.inID67 ద్వారా పబ్లిసిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వెడ్ మంత్ర, సెలబ్రిటీ క్రికెట్ లీగ్... లొకేషన్‌లో షూట్ చేశాం.
షార్ట్ స్టోరీ
శ్వేత, రాకేశ్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. రాకేశ్ ఓవర్ పొసెసివ్‌గా ఉంటాడు. దాంతో వాళ్ల ప్రేమ బ్రేకప్ చెప్పే స్థితికి వచ్చేస్తుంది. ఆ తరవాత ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. క్లుప్తంగా ఇదీ కథ.
కామెంట్
ప్రస్తుత యువతకు ఇదొక సందేశాత్మక చిత్రం. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో పెట్టిన నాలుగు రోజులకే రెండు లక్షల వ్యూస్ దాటాయి. చిత్రాన్ని చాలా మంచి ప్రమాణాల్లో తీయడం వల్ల చలనచిత్రం చూస్తున్న భావన కలుగుతుంది. ఇందులో రెండు పాటలు ఉన్నాయి. ఆ పాటలు, ట్యూన్స్ బాగానే ఉన్నాయి. వాటి చిత్రీకరణ మాత్రం చాలా బావుంది.
ముఖ్యంగా ఇందులో సంభాషణలు మంచి స్థాయిలో ఉన్నాయి. ‘ప్రేమలో పొసెసివ్‌నెస్ ఉండచ్చు గాని, ఓవర్ పొసెసివ్‌గా ఉండకూడదు’ ‘ఏం చేస్తున్నావు.. వెయిట్ చేస్తున్నా... అయితే వచ్చేస్తున్నాను’ ‘కస్టమర్ కేర్ వాళ్లకి చేస్తే నీ కంటె తొందరగా సమాధానం చెబుతారు’ ‘నిన్ను ప్రేమించడం ముఖ్యం కానీ, అది అందరికీ చూపించడం కాదు’ ‘వాడెవడికైనా కష్టం వస్తే, కర్చీఫ్ ఇచ్చేసి వస్తాను, కానీ నీకు కష్టం వస్తే కనిపించకుండా కన్నీళ్లు పెట్టుకుంటాను’ ‘ఇద్దరు మనుషులు కలిసుండాలంటే కావలసింది నమ్మకం’ ‘ఒకరిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ ఇష్టం జీవితాంతం ఉంటుంది’ ‘నిన్ను మామూలు అమ్మాయిలా కాకుండా, మా అమ్మలా ప్రేమించాను’ వంటి డైలాగులు కథకు బలం చేకూర్చాయి.
సినిమా టైటిల్‌లో జీ అక్షరం మీద లవ్ సింబల్ బావుంది. హీరోగా వేసిన కుర్రాడు బావున్నాడు. అమ్మాయి కూడా బావుంది కానీ, వాయిస్‌లో అంత పట్టు లేదు. మంచి డైలాగులను మంచి మాడ్యులేషన్‌తో, మంచి గొంతులో వినిపించినప్పుడే ఆ సంభాషణలు అందరి మనసుల్లో నాటుకుంటాయి.
మంచి చిత్రాలు తీస్తున్న ఈ డెరైక్టర్ ఇటువంటి చిన్నచిన్న సూచనలను పాటిస్తే, తప్పక మంచి డెరైక్టరు కాగలుగుతాడు.
- డా.వైజయంతి