సింహగర్జన-సింహబలుడు...
పోస్టర్ స్టోరీ
మన్‌మోహన్ దేశాయ్‌ను రాజ్ కపూర్ తర్వాత బాలీవుడ్‌లో అంత మాస్ పల్స్ తెలిసిన డెరైక్టర్‌గా అందరూ గుర్తిస్తారు. ‘ఆ గలే లగ్‌జా’ (1973), ‘రోటీ’ (1974) వంటి సినిమాల వరకూ ఒక ధోరణిలో తీసిన మన్‌మోహన్‌దేశాయ్ ‘ధరమ్ వీర్’ (1977) సినిమాతో ఫార్ములా సినిమాల దారి పట్టాడు. విడిపోయిన అన్నదమ్ములు తిరిగి కలవడం అనే ఫార్ములాను నాసిర్ హుసేన్ (యాదోంకి బారాత్)తో పాటు మన్‌మోహన్‌దేశాయ్ కూడా విపరీతంగా పాప్యులరైజ్ చేశాడు. ‘ధరమ్ వీర్’ అదే ఫార్ములాతో హిట్ అయ్యింది.
సంస్థానాలు, గుర్రాలు, కాస్టూమ్‌లు, కత్తులు.... వీటితో తెర మీద కొత్త ఆకర్షణను నిలబెట్టిన మన్‌మోహన్‌దేశాయ్ మంచి సంగీతాన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించాడు. ‘ఓ మేరి మెహబూబా’... పాట ఈ సినిమాలోదే. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టిన ధరమ్‌వీర్ ప్రభావం తెలుగు మీద పడింది. ఆ మరుసటి సంవత్సరమే తెలుగులో ‘సింహ గర్జన’, ‘సింహ బలుడు’ సినిమాలు తయారయ్యి విడుదలయ్యాయి. సింహగర్జనలో కృష్ణ, గిరిబాబు నటిస్తే సింహబలుడు ఎన్టీఆర్ కెరీర్‌లో ఒక అసఫల చిత్రంగా మిగిలింది. ఇటీవల కన్నుమూసిన ఎం.ఎస్. విశ్వనాథన్ సింహబలుడులో ‘సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్’ పాటను హిట్ చేశాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.