
హైదరాబాద్‌లో ప్రీతి ప్రారంభించిన ఫ్యామిలీ పబ్
భార్యాభర్త ఇద్దరూ పని ఒత్తిడికి లోనవుతున్నప్పుడు.. రిఫ్రెష్‌మెంట్ మగవాళ్లకు ఎంత అవసరమో ఆడవాళ్లకూ అంతే అవసరం. మానసికోల్లాసం కోసం నగరం దాటి వెకేషన్‌కు వెళ్లడం ప్రతివారమూ కుదిరేపని కాదు. అందుకే పిల్లలు, అమ్మానాన్నలు కలిసి ఇష్టమైన ఆహారం తింటూ, మ్యూజిక్ వింటూ, చేయాలనిపిస్తే డాన్స్‌చేస్తూ తమను తాము రీచార్జ్ చేసుకోగలిగిన ‘పబ్’ని తెలుగు వాళ్లకు పరిచయం చేశారు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రీతి.
తెలుగు రాష్ట్రాల్లో తొలి ఫ్యామిలీ పబ్ స్థాపించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ప్రీతి
‘‘పబ్ అనగానే అది సంస్కారవంతులు వెళ్లకూడని ప్రదేశం అని, ఆడవాళ్లు అడుగుపెట్టకూడదని.. ఇలాంటి గట్టి అభిప్రాయాలు మనలో ఉన్నాయి. ‘పబ్’ అనేది మద్యం సేవించడానికి వెళ్లే ప్రదేశంగా మాత్రమే మనకు ఒక ముద్ర బలంగా పడిపోయి ఉంది. ఇంతవరకు మన దగ్గర ఫ్యామిలీలకు పబ్‌కు లేకపోవడం వల్ల ఏర్పడిన దురభిప్రాయం ఇది’’ అంటారు ప్రీతి.
‘‘ఒక మహిళ తన భర్త, పిల్లలతో సెలవు రోజును ఆహ్లాదంగా గడపగలిగిన ప్రదేశంగా పబ్‌ని తీర్చిదిద్దడమే నా ఉద్దేశం. ఇప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉపాధి పెరిగినట్లే ఒత్తిడి కూడా పెరిగిపోయింది. నెలకు యాభై వేలు– లక్ష రూపాయలు సంపాదించుకోవడం కోసం వారమంతా మెదడును ఒడిసిపట్టి పని చేయించక తప్పదు. వారాంతంలో రిఫ్రెష్ కాకపోతే మళ్లీ వారంలో కొత్త ఒత్తిడిని తలకెత్తుకోవడానికి సిద్ధం కాలేరు. అలాంటి వాళ్ల కోసం నా కెరీర్‌లో భాగంగా హైదరాబాద్‌లో నేను ఏర్పాటు చేసుకున్నదే ఈ ఫ్యామిలీ పబ్’’ అని చెప్పారామె.
కొత్త సోపానం
‘‘నిజానికి ఫ్యామిలీ పబ్ అనే కాన్సెప్ట్ మనదేశంలోకి మూడు దశాబ్దాలవుతోంది. ‘షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్’ పేరుతో 1991లో బెంగళూరులో మొదలైంది. మాది తెలుగు కుటుంబమే అయినా నేను పుట్టింది పెరిగింది బెంగళూరులోనే. ఎంబీఏ బిజినెస్ మేనేజ్‌మెంట్ చేసిన తర్వాత ఒక యూరోపియన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో హెచ్‌ఆర్ స్పెషలిస్ట్‌గా పని చేశాను. మా కంపెనీ కార్యకలాపాలు ఆసియా దేశాల్లో ఏడింటిలో జరుగుతుండేవి. చైనా, థాయ్‌ల్యాండ్‌తోపాటు మా కంపెనీ హెడ్‌క్వార్టర్ ఉన్న జర్మనీకి కూడా వెళ్లాల్సి వచ్చేది. మన దగ్గర వీధి చివర కాఫీ షాప్‌లు ఉన్నట్లు అక్కడ ఫ్యామిలీ పబ్‌లుంటాయి. ఆ దేశాల వర్క్ కల్చర్ మన దగ్గరకు కూడా వచ్చేసింది. పైగా మన దగ్గర మహిళకు ఉద్యోగంతోపాటు ఇంటి పనులు అదనం. మన మగవాళ్లు ఇంటిపనుల్లో సాయం చేయడం నూటికి ఏ పదిళ్లలోనో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కెరీర్‌కు న్యాయం చేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు ఆడవాళ్లు. నేను పెళ్లి చేసుకుని కోడలిగా హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత నేను గమనించిన విషయం ఇది. పెళ్లయిన తర్వాత కూడా హైదరాబాద్– సింగపూర్‌ల మధ్య ప్రయాణిస్తూ ఉద్యోగం చేశాను. బాబు పుట్టిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేశాను. బాబుకి ఇప్పుడు రెండేళ్లు. నేను నా కెరీర్‌ని తిరిగి నిర్మించుకోవడానికి సిద్ధమైనప్పుడు మా ఫ్యామిలీ నడుపుతున్న విద్యాసంస్థలను చూసుకోవడం అనే ఆప్షన్ నా ఎదురుగా ఉంది. అప్పుడు నేను ఫ్యామిలీ మొత్తం సంతోషంగా గడపగలిగిన నైబర్‌హుడ్ పబ్‌ల గురించి చెప్పాను. అప్పుడు మా వారు ‘ఆ కాన్సెప్ట్‌ని నువ్వు టేకప్ చేస్తేనే న్యాయం జరుగుతుంది. కానీ ఇది నీకు చాలెంజింగ్‌గా ఉంటుందేమో’ అన్నారు. నేనా చాలెంజ్‌ని స్వీకరించి ఈ ఏడాది జనవరి 15వ తేదీన పబ్‌ను ప్రారంభించాను.
తొలి అడుగు పడాలి
పబ్ నిర్వహణ మగవాళ్ల వ్యాపార సామ్రాజ్యం అనేది కేవలం అపోహ మాత్రమే. ఏ రంగమైనా సరే ఆడవాళ్లు అడుగుపెట్టనంత వరకే అది మగవాళ్ల సామ్రాజ్యం. ఆడవాళ్లలో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే చాలు... ఆమె చూపించిన దారిలో నడవడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. నేను ఈ రంగంలో తొలి అడుగు వేశాను. ఈ రంగంలో మహిళలకు ఉద్యోగావకాశాలు పెరగాలంటే యజమాని స్థానంలో మహిళ ఉంటేనే సాధ్యం. ఏ సంస్థలోనైనా మహిళల మీద వేధింపులు లేని వాతావరణం ఉండాలంటే మహిళా ఉద్యోగుల నిష్పత్తి పెరగాలి. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర పాతిక మంది ఉద్యోగులున్నారు. ఈ నెల ఎనిమిదవ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నుంచి ఫ్యామిలీ పబ్‌లో మహిళా ఉద్యోగులు ఉంటారు. ‘ఆడవాళ్లు మీకు ఈ ఉద్యోగాలెందుకు? ఫలానా ఉద్యోగాలు చూసుకోండి’ అని తీర్పులిచ్చేస్తోంది మగసమాజం. అవకాశాలను ఆడవాళ్ల ముందు పెట్టాలి. ఉపయోగించకోవడం, ఉపయోగించుకోకపోవడం ఆడవాళ్ల ఇష్టమై ఉండాలి’’ అన్నారు ప్రీతి. మగవాళ్లు తీర్పు చెప్పడం ఎలా ఉంటుందంటే... ఒక సినిమాకి రివ్యూ రాసేటప్పుడు ‘ఇది ఆడవాళ్ల సినిమా’ అని మగవాళ్లే నిర్ణయించేస్తుంటారు. తమకు నచ్చే సినిమా ఏదో నిర్ణయించుకునే అవకాశాన్ని కూడా ఆడవాళ్ల చేతిలో ఉంచరన్నమాట. ఆ ధోరణి నుంచి మన సొసైటీ బయట పడాలి. అందుకు ఒక సాహసోపేతమైన అడుగు వేశారు ప్రీతి. – వాకా మంజులారెడ్డి
రాత్రి రెండు వరకు
నేను కోరుకుంటున్నట్లు యాభై శాతం ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేయడం సాధ్యమేనా... అనే సందేహం వచ్చినమాట నిజమే. అయితే మేము నిర్వహించనున్న మూడు రోజుల ఫ్రీ వర్క్‌షాప్‌కి పేర్లు నమోదు చేసుకున్న వాళ్లలో గృహిణులు కూడా ఉన్నారు. డీజే, ఆర్టిస్టులు కూడా మహిళలే ఉంటారు. నేను పెట్టుబడి పెట్టి నిర్వహణ బాధ్యత ఉద్యోగుల మీద వదిలేయడం లేదు. కౌంటర్ నుంచి కిచెన్ వరకు అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తాను. వీకెండ్స్‌లో రాత్రి రెండు గంటల వరకు కూడా పబ్‌లోనే ఉంటాను. ఇది కార్యక్షేత్రం. నేనిలా ఉండగలుగుతున్నాను కాబట్టి మహిళాఉద్యోగులకు కూడా భరోసా ఉంటుంది. మల్టీ క్విజిన్ రెస్టారెంట్‌లో చెఫ్‌లు, ఫ్రంట్ ఆఫీస్, స్టీవార్డ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ప్లేస్‌మెంట్స్ ఇప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. నేను సమాజంలో ఒక మెట్టు మంచి స్థానంలో ఉన్నాను. నా వంతుగా మరికొంత ఆడవాళ్లకు ఉపాధి కల్పించడం నా బాధ్యత. – ప్రీతి, షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్ నిర్వహకురాలు
Comments
Please login to add a commentAdd a comment