
కూల్‌డ్రింక్స్
చక్కెర అధికంగా ఉన్న కూల్‌డ్రింక్స్‌ను రోజూ తీసుకోవడం వల్ల మహిళల గర్భధారణ శక్తి తగ్గిపోతుందని బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు అంటున్నారు. మహిళలతో మాత్రమేనా ఈ సమస్య అంటే.. కానేకాదు ఇది మగవాళ్లకూ వర్తిస్తుందని.. రోజుకు ఒక కూల్‌డ్రింక్ తాగినా సరే.. తండ్రి అయ్యే అవకాశాలు తగ్గుతాయని వీరు అంటున్నారు. కాకపోతే ఈ అధ్యయనం అమెరికాలో జరిగింది కాబట్టి.. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే రకమైన ఫలితాలు ఉంటాయన్న గ్యారెంటీ లేదు. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు 21 – 45 ఏళ్ల మహిళలు, 1045 మంది పురుషులతో మాట్లాడి.. వివరాలు సేకరించారు. ఆరోగ్య వివరాలతోపాటు, జీవనశైలి వివరాలు, ఆహారం, కూల్‌డ్రింక్‌ల వివరాలు కూడా తీసుకున్నారు.
ఆ తరువాత మహిళల నుంచి రెండు నెలలకు ఒకసారి కొన్ని వివరాలు సేకరిస్తూ వచ్చారు. గర్భధారణ జరిగేంతవరకూ ఈ ప్రక్రియ కొనసాగింది. పురుషులు, మహిళలు ఇద్దరి వివరాలు, గర్భధారణ సమయాలను పరిగణలోకి తీసుకున్న తరువాత ఇద్దరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం 20 శాతం వరకూ తగ్గినట్లు స్పష్టమైంది. రోజుకు కనీసం ఒక్క కూల్‌డ్రింక్ తాగిన మహిళల్లో 25 శాతం తగ్గుదల ఉండగా.. పురుషుల్లో ఇది 33 శాతం వరకూ తగ్గినట్లు స్పష్టమైంది.