ఎంత సజీవ ప్రేమయో! | Premayo how to live! | Sakshi
Sakshi News home page

ఎంత సజీవ ప్రేమయో!

Published Thu, Feb 13 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

Premayo how to live!

‘ప్రేమ’ అనేది మనుషులకు మాత్రమే పరిమితమైన వ్యవహారమా? ‘అవును కదా’ అని ఎవరైనా అనుకుంటే  మాత్రం తప్పులో కాలేసినట్లే. పార్క్‌లు, లవ్‌లెటర్లు, బ్యాండ్ మేళాలు,  శుభలేఖలు, విందులు వినోదాలు...ఇలాంటి వేమీ లేకపోయినా జీవప్రపంచంలో కూడా పవిత్రమైన ప్రేమ, వివాహబంధాలు ఉంటాయి. అలాగే అపోహలు, అలకలు, విభేదాలతో...వాటికి కూడా మనలాగే ‘బ్రేక్ అప్’లూ ఉంటాయి. నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది ఎన్నో పరిశీలనల ద్వారా తెలిసిన వాస్తవం.
 
కొంతకాలం క్రితం ‘ఆస్ట్రియన్ టైమ్స్’లో వచ్చిన ఒక కథనం ప్రపంచాన్ని  ముక్కున వేలేసుకునేలా చేసింది. ‘తాబేలు జంట విడాకులు తీసుకుంది’ అనేది హెడ్ లైన్.
 
‘ఎనభై సంవత్సరాల నుంచి అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట విడాకులు తీసుకోక తప్పలేదు’ అనే వాక్యం  మరింత ఆశ్యర్యానికి గురి చేసింది!
 
 మన్మథ రాణి!
 రాణి తేనెటీగ ఒకటి నుంచి నలభైవరకు భాగస్వాములను ఎంచుకుంటుంది. ‘ఏకపతీవ్రతం’ నిబంధన రాణి తేనెటీగ దగ్గర పనిచేయదు.
 
 ఇప్పుడొక చిన్న ఫ్లాష్‌బ్యాక్:

 ఆస్ట్రియాలో జూ.
 ‘బాబీ’లాంటి ఒక  ‘బీబి’ ప్రేమకథ!
 బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘బాబీ’ గుర్తుకు రాగానే లవ్ సీన్స్ గుర్తుకు వస్తాయి. ‘హమ్ తుమ్..’ పాట నోటికొస్తుంది. ఆ జూలో ఉండే ఆడతాబేలు పేరు బీబి. ఈ బీబి అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ‘పోల్డి’ లవ్‌లో పడింది. ఈ పోల్డి ఒక మగతాబేలు. స్విట్జర్లాండులోని బసెల్ జూలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కారణం తెలియదుగానీ,  ఆ తరువాత ఆస్ట్రియాలోని క్లజెన్‌ఫర్ట్ జూకు ఈ జంటను తీసుకు వచ్చారు. దేశం మారవచ్చుగానీ...వాటి మధ్య ఉన్న ప్రేమ మారలేదు.
 
‘నీకు నేను...నాకు నువ్వు...ఒకరికొకరం’ అని  డ్యూయెట్లు కూడా పాడుకునేవి. వాటి బంధం జూ సిబ్బందికి కన్నులపండుగగా ఉండేది.
 
ఒక తరం ఉద్యోగులు మరో తరం ఉద్యోగులకు  ఈ జంట గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్లు. కారణం ఏమిటో తెలియదుగానీ, ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న ఈ జంట విడిపోయింది. సిబ్బంది వాటిని వేరు వేరు ఎన్‌క్లోజర్‌లలో పెట్టారు. ‘బ్రేకప్’కు ముందు ఆడ తాబేలు బీబి తరచుగా మగతాబేలు ‘పోల్డి’ పైకి దాడికి దిగేదట!
 
సుదీర్ఘమైన ప్రేమబంధంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ జంట మధ్య దూరాన్ని తగ్గించాలని జూ సిబ్బంది రంగంలోకి దిగారు. ‘కౌన్సిల్సింగ్’ ‘రొమాంటిక్ గుడ్‌ఫుడ్’  ‘జాయింట్ గేమ్స్’...ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్క ప్రయత్నమూ ఫలించలేదు. వాటి మధ్య దూరం తగ్గనే లేదు! అంతమాత్రాన వాటి సంతోషానికి వచ్చిన ఇబ్బంది లేదు. ‘సింగిల్’గా  కొత్త జీవితాన్ని సంతోషంగానే గడుపుతున్నాయి. ఇదీ ‘విడాకులు తీసుకున్న’ ఆ తాబేలు జంట కథ.
 
ఈ నేపథ్యంలో జీవప్రపంచంలో కొన్ని జీవుల ప్రేమ, బ్రేకప్‌ల గురించి తెలుసుకోవడం  ఆసక్తికరంగా ఉంటుంది. సంక్షిప్తంగా...
 
 ఒక లైలా కోసం... తిరిగాను వనం!
 మన కథల్లో మామూలుగా తోడేళ్లకు విలన్ ఇమేజ్ ఉంది. ప్రేమ విషయంలో మాత్రం వాటికి క్లీన్ ఇమేజ్ ఉంది. తోడేళ్లు   ఒకరితో మాత్రమే వీలైనంత ఎక్కువగా ప్రేమానురాగాలు పంచుకుంటాయి. వాటి బంధాలు మనుషులను తలపిస్తాయి.
 
 అవును...వాళ్లిద్దరూ కష్టపడ్డారు!
 ఇంగ్లండ్‌లోని ఒక వన్యప్రాణి సంరక్షణకేంద్రంలో ప్రేమికులైన హంసల జంట మధ్య విభేదాలు ఏర్పడి ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. విరహాన్ని భరించలేక అవి నానా కష్టాలు పడ్డాయి. ఇలా అయితే కుదరదని  విభేదాలను సమాధి చేసి మళ్లీ కలిసాయి. ఒక పత్రిక సరదాగా ఇలా హెడ్‌లైన్ పెట్టింది: ‘వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకున్నారు.’
 
 ఆనాటి ఆ ప్రేమబంధం...ఏమైనదో!
 గిబన్ కోతులు  బ్రేకప్‌లకు దూరంగా ఉంటాయి.  అన్యోన్యంగా కలిసి ఉంటాయి. వాటివి బలమైన బంధాలు. కానీ ఈమధ్య కాలంలో కాస్త తేడా వచ్చిందట. మునుపటి అనుబంధం కనిపించడం లేదట. ఒకదాన్నొకటి మోసం చేసుకుంటున్నాయట!
 
 మన్మథరాజా.. మన్మథరాజా!
 బొనొంబొ మగ చింపాంజీలు ఎక్కువ సంఖ్యలో జీవితభాగస్వాములను ఎంచుకుంటాయి. కొత్త వారిని ‘ప్రేమముగ్గు’లో దించడానికి  సృజనాత్మక మార్గాలలో ఆలోచిస్తుంటాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement