తియ్యండ్రా బండ్లు | present telugu cinema situation | Sakshi
Sakshi News home page

తియ్యండ్రా బండ్లు

Published Fri, Nov 10 2017 11:46 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

present telugu cinema situation - Sakshi

బండగాళ్ల బెండు తియ్యాలంటే... బండ్లు కావద్దూ!కండలున్న క్రూరులు కంగుతినాలంటే... యాక్సిలరేటర్‌ తొక్కొద్దూ!సినిమాలో స్పీడు కావాలంటే... డైరెక్టర్‌ ‘యాక్షన్‌ యాక్షన్‌’ అని మొత్తుకోవడం కాదు. మత్తు వదిలించే యాక్షన్‌ సీక్వెన్స్‌ కావాలి... కుదిరితే సినిమా అంతా యాక్షన్‌ ఉండాలి. యాక్షన్‌కి ఇప్పుడు కొత్త డిక్షన్‌.. వయలెన్స్‌... తియ్యండ్రా బండ్లు... తొక్కండ్రా యాక్సిలరేటర్‌లు.

సినిమాలు వచ్చిన కొత్తల్లో ఫైటింగులు లేవు. మాటలే మక్కెలిరగదీసేవి. అవి కూడా పెద్దపెద్ద మాటలేం కాదు. ‘మంచీ మర్యాద లేదా?’, ‘మనిషికీ, పశువుకీ తేడా ఏముందీ’.. ఇలాంటివి! ఆ మాత్రానికే క్యారెక్టర్లు హర్ట్‌ అయ్యేవి!

‘‘అంటే.. వాణ్ణి కొట్టడం నా వల్ల కాదంటావ్‌?!’’ అంటాడు బ్రహ్మాజీ. తల అడ్డంగా ఊపి, పెదవి విరుస్తాడు తనికెళ్ల భరణి. ఆ ఊపుడుకి, ఆ విరుపుకి అర్థం.. ‘నీ వల్ల కాదు’ అనే. ‘‘పోనీ చంపేయ్‌నా?’’ అంటాడు బ్రహ్మాజీ. భరణి నమ్మలేనట్లు చూస్తాడు. ఇద్దరూ పొలం మధ్యలో ఉంటారు. చుట్టూ అనుచరులు ఉంటారు. బ్రహ్మాజీ నిలబడి ఉంటాడు. భరణి నవారు మంచం మీద కూర్చొని ఉంటాడు. చొక్కా కాలర్‌ పైకి లేపి, కాలు వంకరగా నిలబెట్టి, నడుము మీద చెయ్యి వేసుకుని స్కెచ్‌ ఏమిటో చెప్తాడు బ్రహ్మాజీ.‘‘ఎల్లుండి నూకాలమ్మ జాతర. ఊళ్లో ప్రతివాడూ గుడికి వస్తాడు. వాడూ వస్తాడు. కానీ మళ్లీ ఎల్లడు. వీరమ్మ చెరువు దగ్గర నాలుగు సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడే అనుకో. చుక్కలగుడి దగ్గర ఇంకో మూడు సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడా మిస్‌ అయ్యాడనుకో. సర్వితోపు చివర్లో ఈసారి ఐదు సుమోలు పెడతాను’’ అంటాడు.2005లో వచ్చిన ‘అతడు’ సినిమాలోని సీన్‌ ఇది. ఇందులో బ్రహ్మాజీ స్కెచ్‌ వేసింది.. మహేశ్‌ బాబుని చంపడం కోసమని మీకు తెలిసే ఉంటుంది.

అరుపులు.. చరుపులు
వయలెన్స్‌ని.. అది కూడా.. పెద్ద పెద్ద అరుపులు, కేకలు, పరుగులు, సుమోలు, క్వాలిస్‌లతో కనువిందు చేస్తూ శ్రవణానందం కలిగించే వయలెన్స్‌ని తెలుగు సినిమాలు యూత్‌కి ఎంటర్‌టైన్‌మెంటుగా మార్చాయి! ‘తియ్యండ్రా బండ్లు’ అని అనే డైలాగ్‌ వినిపిస్తే.. థియేటర్‌లో ఉన్న మనకు తిక్కరేగిపోతుంది! చొక్కా చింపేసుకుంటాం.  ఒక్క అరుపుతో, లేదా ఒక్క చరుపుతో తెరపై భారీ బండ్లు గాల్లోకి లేచి, ఒక్కసారిగా కింద పడితే మన ఫ్రంటు, బ్యాకు, టాపు డాల్బీలో అదిరిపోతుంది. ‘తియ్యండ్రా బండ్లు’ అనే డైలాగ్‌ అంతకుముందు రెండు మూడు సినిమాల్లో ఉన్నప్పటికీ 2006లో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంతో పాపులర్‌ అయింది. 2005లో తెలుగులోకి డబ్‌ అయిన తమిళ చిత్రం ‘గజనీ’లో కనీవినీ ఎరుగనంత వయలెన్స్‌ ఉందని టాక్‌ వచ్చింది. అంతకు ఏమాత్రం తగ్గని హింస ‘విక్రమార్కుడు’లో ఉంది. హీరో రవితేజను చంబల్‌ లోయ విలన్లు కత్తులు కటార్లతో వెంటాడుతుంటారు. రవితేజ భుజంపై ఒక చిన్నారి ఉంటుంది. ఆ చిన్నారి భుజంపై ఆమె స్కూల్‌ బ్యాగ్‌ ఉంటుంది. తనను, పాపను కాపాడుకునేందుకు రవితేజ తప్పించుకునే ప్రయత్నంలో జరిగే హింస అత్యంత భయానకమైనది! ఈలోపు డబల్‌ యాక్షన్‌లో ఇంకో రవితేజ పై నుంచి దిగుతాడు. పాపను, పాపను ఎత్తుకుని ఉన్న రవితేజను తప్పిస్తాడు. ఆ వెంటనే అతడు చెప్పే డైలాగులు హింసలకే హింస! వెర్బల్‌ వయలెన్స్‌ అన్నమాట.‘‘చావు అంటే భయపడ్డానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకుననుకున్నార్రా. రాథోడ్‌. విక్రమ్‌ రాథోడ్‌. భయం నాక్కాదురా. చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ములేక ఆరు నెలలనుంచీ పిచ్చికుక్కలా నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే పదిమంది తోడు దానికి కావాలి’’ అంటాడు రవితేజ.

‘చిన్నా.. రాడ్లు తియ్‌’
లాస్ట్‌ సీన్‌లో విలన్‌ వినీత్‌కుమార్‌... డీఎస్పీ రవితేజ కోసం ఎదురుచూస్తుంటాడు. మీడియా అక్కడే ఉంటుంది. ‘‘సర్‌.. టైమ్‌ తొమ్మిది కావస్తోంది. విక్రమ్‌ రాథోడ్‌ వచ్చి మీ గోడవున్‌లన్నీ పగలగొట్టేస్తానంటున్నాడు. ఇప్పుడు మీరేం చేస్తారు’’ అని అడుగుతాడు ఓ టీవీ రిపోర్టర్‌. తొమ్మిది దాటుతుంది. రవితేజ రాడు. తొమ్మిదిన్నర అవుతుంది. రాడు. పదకొండున్నర అవుతుంది. రాడు. ఫోన్‌ వస్తుంది. ‘‘ఎక్కడ్రా నీ గోడవున్లు? అడ్రస్‌ తెలియడం లేదు. అన్నట్టొరేయ్‌ ఇక్కడ నీ లిక్కర్‌ ఫ్యాక్టరీ కనిపిస్తే బోర్‌ కొట్టి పేల్చేశాను’’ అంటాడు. విలన్‌ అదిరిపడతాడు. ‘‘దమ్ముంటే అక్కడే ఉండు. నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను’’ అంటాడు. వెహికిల్స్‌ అన్నీ రెడీ గా ఉంటాయి. అప్పుడే అంటాడు విలన్‌.. ‘తియ్యండ్రా బండ్లు’ అని! తర్వాత.. మళ్లీ వయలెన్స్‌. అలా బండ్లు తియ్యడం అన్నది కాలక్రమంలో వయలెన్స్‌కి సిగ్నేచర్‌ పంచ్‌ అయిపోయింది.రామ్‌గోపాల్‌ వర్మ ‘శివ’ సినిమాలో ఇలాంటి డైలాగే ఉంటుంది. ‘చిన్నా రాడ్లు తియ్‌’ అని! యూత్‌కి ఆ డైలాగ్‌ ఇచ్చిన కిక్కు ఒకరోజులో దిగలేదు.

యాక్షన్‌లో థ్రిల్‌ ఉంటుంది. వయలెన్స్‌ కూడా మిక్స్‌ అయితే అది ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అవుతుంది! సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, సాంబ, దమ్ము.. ఇలాంటివన్నీ ఈ ఫార్ములాతో ఎంటర్‌టైన్‌ చేసిన సినిమాలే. వయలెన్స్‌లో మళ్లీ రకాలు ఉన్నాయి. ఫాక్షన్‌ వయలెన్స్, మాఫియా వయలెన్స్, లవ్‌ వయలెన్స్, భూతప్రేతాల వయలెన్స్, రక్తచరిత్రల వయలెన్స్, దండుపాళ్యంల వయలెన్స్‌.. అన్నీ కూడా చక్కగా మనల్ని బాల్కనీలో కూర్చోబెట్టి, పాప్‌కార్న్‌ తినిపిస్తూ ఎంజాయ్‌మెంట్‌ని ఇచ్చేవే!
వయలెన్స్‌లో ఏమిటంత ఎంటర్‌టైన్‌మెంట్‌?! ఎమోషన్‌ కదలిస్తుంది. కామెడీ కడుపారా నవ్విస్తుంది. యాక్షన్‌ రక్తాన్ని పరుగులు తీయిస్తుంది. వయలెన్స్‌ ఒక్కటే.. సర్రున నరాల్లోకి ఎక్కేస్తుంది. మళ్లీ నిజ జీవితంలోని వయలెన్స్‌కు ఇంత గ్లామర్‌ ఉండదు. అవును గ్లామరే! ‘ఒక్కడు’ సినిమాలో మహేశ్‌బాబు ఒక్క దెబ్బ కొట్టగానే ప్రకాశ్‌రాజ్‌ ఎగిరెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌ మీద పడతాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోతుంది. ఆ పేలిపోవడంలో గ్లామర్‌ ఉంది. ‘సరైనోడు’ సినిమాలో బన్నీ ఫస్ట్‌ సీన్‌లోనే బలిసిన దున్నపోతుల్లాంటి గూండాలను తుక్కుతుక్కు చేస్తాడు. ఆ సీన్‌లో బన్నీ బలిష్టమైన గుర్రంలా ఉంటాడు. ఆ ఉండడంలో గ్లామర్‌ ఉంది. ‘సింహా’ లాస్ట్‌ సీన్‌లో హీరో నేల మీది మట్టిని తీసుకుని గుండెలకు రాసుకుని, సేమ్‌ అదే ప్లేస్‌లో తన ప్రత్యర్థుల చేతుల్లో చనిపోయిన తండ్రిని తలచుకుంటూ ఒక్కొక్కణ్ణీ వట్టి చేతుల్తో ఉట్టి పగలగొట్టినట్టు కొట్టేస్తుంటాడు! చివరికి మెయిన్‌ విలన్‌ని గండ్రగొడ్డలితో ఖైమా కొట్టేస్తాడు. ఆ కొట్టడంలో గ్లామర్‌ ఉంది.

చెంపదెబ్బ.. టు.. కసాబిసా
ఆడవాళ్లు సున్నిత హృదయులనీ, మగవాళ్లు రఫ్‌ వెధవలనీ అనుకుంటాం. అది నిజమే. అయితే వయలెన్స్‌ని ఎంజాయ్‌ చెయ్యడంలో ఆడామగా తేడా ఉండదు. అక్కడ మనం ఒక హ్యూమన్‌ బీయింగ్‌ మాత్రమే. సినిమాల్లో ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చుతుంది. అందరికీ నచ్చేది మాత్రం ఫైటింగ్‌. మనం చెయ్యవలసిన ఫైటింగ్, మనం చెయ్యలేని ఫైటింగ్‌ ఎదురుగా ఇంకొకరు చేస్తుంటే భలే సంతోషంగా ఉంటుంది. చిన్న చెంప దెబ్బే అయినా, మనం కొట్టలేనిది ఇంకొకడు కొట్టాడంటే లోపల్లోపల హ్యాపీగా ఫీలవడానికి ఆడేమిటి? మగేమిటి?
సినిమాలు వచ్చిన కొత్తల్లో ఫైటింగులు లేవు. మాటలే మక్కెలు ఇరగదీసేవి. అవి కూడా పెద్దపెద్ద మాటలేం కాదు. ‘మంచీ మర్యాద లేదా?’, ‘మనిషికీ, పశువుకీ తేడా ఏముందీ’.. ఇలాంటివి! ఆ మాత్రానికే క్యారెక్టర్లు హర్ట్‌ అయ్యేవి. క్రమక్రమంగా చెంపదెబ్బలు మొదలయ్యాయి. ‘టప్‌’మని ఒక చిన్న చప్పుడు. అంతే! తర్వాత ‘డిష్యుం’ అనే సౌండ్‌ క్రియేట్‌ అయింది. ‘బాబోయ్‌ ఎంత పెద్ద దెబ్బో’ అనిపించేలా! ఒకరిని ఒకరే కొట్టడం, మూకుమ్మడిగా ఒకర్నొకరు కొట్టుకోవడం, నలుగురైదుగురు కలిసి ఒకర్ని కొట్టడం, ఒకడే నలుగురైదుగుర్ని కొట్టడం, చివరికి.. ‘‘ఒక్కొక్కణ్ణి కాదు షేర్‌ ఖాన్‌.. వందమందిని ఒకేసారి రమ్మను..’ అని మగధీరలో రామ్‌ చరణ్‌ సవాల్‌ విసిరే వరకు వెళ్లింది. వంద మందీ వచ్చేస్తారు. ఒక్కొక్కర్నీ కసాబిసా నరికేస్తాడు చరణ్‌. అదొక హిస్టారికల్‌ వయలెన్స్‌.

వయలెన్స్‌ అంటే కచ్చితంగా రక్తం కారాలనేం లేదు. కమెడియన్‌ని వట్టి పుణ్యానికే హీరో ఫటక్‌ ఫటక్‌మని కొట్టి చంపడం ఒక రకం వయలెన్స్‌. బావగారు చెల్లెలికి అరిచేతిలో నరకం చూపించడం హోమ్‌లీ వయలెన్స్‌. ‘ఖలేజా’లో మహేశ్‌బాబు నోరెత్తితే ‘పంచ్‌’లు పడడం అదో టైపు వయలెన్స్‌. హాలీవుడ్‌ నుంచి, బాలీవుడ్‌ నుంచి తెచ్చుకున్న వయలెన్స్‌లు కూడా కొన్ని! ఏ జానర్‌ వయలెన్స్‌ అయినా ఆ సీన్‌ వరకు ఖాయంగా సినిమాను గట్టెక్కిస్తుంది.

ఎందుకింత ఇష్టపడతాం?
ఈ ప్రశ్నకు సమాధానంగా రకరకాల థియరీలు, థీసిస్‌లు ఉన్నాయి. ఒక థియరీ ప్రకారం.. వ్యవస్థపై కోపాన్ని, అన్యాయాలపై ఆగ్రహాన్ని, దౌర్జన్యాలపై  ప్రతీకారాన్ని తీర్చుకోడానికి సినిమా హీరోలకు మాత్రమే సాధ్యమౌతుంది. అది చూసి మనం ఆ కొద్ది సేపు సంతృప్తి చెందుతాం. హింసను ఇష్టపడని ప్రేక్షకులు కూడా ఆ హింసా సన్నివేశాల్లోని థ్రిల్‌ని, సస్పెన్స్‌నీ లైక్‌ చేస్తారు. అంటే వాళ్లు నికోటిన్‌ని ఇష్టపడతారు కానీ, సిగరెట్‌ని లైక్‌ చెయ్యరు.

అనుకరించేవారి మాటేమిటి?
ట్రెండ్‌ ఏదైనా దానికి ఫాలోయింగ్‌ ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ కనెక్ట్‌ అవుతారు. సైకిల్‌ చెయిన్‌ తెంపితే తెగదు. కానీ తెంపాలని చూస్తారు. నాగార్జున తెంపాడు కదా! అదే సినిమాలో బుద్ధిగా కాలేజీకి వెళ్లి చదువుకున్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే రామ్‌గోపాల్‌ వర్మ అలాంటి బుద్ధిమంతులను చూపించడు. మామూలు సినిమాలు బుద్ధిమంతుల లాంటివి. ఆదర్శమే కానీ, ఆచరించేలా ఎట్రాక్ట్‌ చెయ్యవు. అందుకే వయలెన్స్‌ ఉన్న సినిమాలు జనానికి నచ్చుతుంటాయి. మితిమీరి వయలెన్స్‌ ఉంటే సెన్సార్‌ బోర్డు కత్తెరకు చిక్కుతుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement