భానుమతి రిప్లై | seen is ours tittle is yours | Sakshi
Sakshi News home page

భానుమతి రిప్లై

Published Sun, Jun 10 2018 1:06 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

seen is ours tittle is  yours - Sakshi

మెయిన్‌స్ట్రీమ్‌ తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ పాత్రతోనే ఊహించని పాపులారిటీ తెచ్చుకున్న ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ అనిపించుకున్న ఈ సినిమా ఈ మధ్య కాలంలోనే విడుదలైంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... 

రాజు పెళ్లిచూపుల్లో అమ్మాయిని చూశాడు. అమ్మాయి రేణుక బాగా చదువుకుంది. చూడచక్కని అందం. కాదనలేడు. కానీ ‘తమ్ముడు కూడా సరేనంటేనే పెళ్లి’ అన్నాడు. రేణుక ఈ మాటకు కొంత ఆందోళన పడింది. చెల్లి భానుమతికైతే ఈ మాట కోపాన్నే తెచ్చిపెట్టింది. ‘‘సెకండ్‌ ఒపీనియనా? అసలేమనుకుంటుండు? మనమే వద్దని చెబ్దాం.. మనకేం అవసరం లేదు. దొబ్బెయమను..’’ రాజు వెళ్లిపోవడంతోనే ఇంట్లో వాళ్లముందు తన కోపాన్నంతా బయటపెట్టింది. కానీ నాన్న చెప్పినట్లు చెయ్యాలి కదా! రాజు తమ్ముడిని రైల్వే స్టేషన్‌ దగ్గర పికప్‌ చేస్కునే పనితనే తీసుకుంది. రైలు దిగాడు రాజు తమ్ముడు. ‘పెళ్లికొడుకు తమ్ముడు’ అన్న కార్డ్‌ పట్టుకొని స్టేషన్‌లో ఎదురుచూస్తోంది భానుమతి. రాజు తమ్ముడు దగ్గరకొచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు – ‘‘హేయ్‌! ఐ యామ్‌వరుణ్‌ అండీ.. మీరు?’’. భానుమతి అతనితో మాట్లాడటం ఏమాత్రం ఇష్టం లేనిదానిలా, ‘‘పెండ్లికూతురి చెల్లి.’’ అని కోపంగా సమాధానమిచ్చింది. ‘‘మీకు నా మీద కోపమా?’’ అనడిగాడు వరుణ్‌. 

‘‘కోపమా?’’ అంటూ కోపాన్నంతా మాటల్లోకి మార్చి, వరుణ్‌ భయపడిపోయేలా ఆ మాటలను బయటకు వదిలింది భానుమతి. కథ ఒక రోజు ముందుకు కదిలింది. వరుణ్, రాజు ఈ సంబంధం తమకు ఇష్టమేనని చెప్పేశారు. ఆ ఒక్క రోజులోనే భానుమతి కూడా వాళ్లిద్దరు మంచివాళ్లే అనే నిర్ణయానికొచ్చేసింది. పెళ్లవ్వడానికి మధ్యలో ఇంకే అడ్డంకులూ లేవు. ‘‘కానీ వారం రోజుల్లోనే పెళ్లయిపోవాలి.’’అన్నాడు రాజు. రాజు, వరుణ్‌ అమెరికా వెళ్లిపోవాలి, ఈ పెళ్లవ్వగానే. ‘‘వారం రోజుల్లో అంటే..’’ అనైతే అన్నాడు కానీ, రేణుక తండ్రి కూడా అంతకుమించి ఇంకేం మాట్లాడలేదు. వారం రోజుల్లో పెళ్లయిపోయింది. ఈ వారం రోజుల్లో వరుణ్, భానుమతికి ఎంత దగ్గరయ్యాడంటే, ఆమె అడిగితే కాఫీ పెట్టిస్తాడు. పరీక్షలకు ప్రిపేర్‌ చేయిస్తాడు. ఆమెతో కలిసి పాటలు పాడుకుంటాడు. ఆమెను ఆటపట్టిస్తాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. అది ప్రేమా, కాదా అని కూడా ఆలోచించడం మానేశారు. అదేంటో తెలియకున్నా ఇద్దరికీ బాగుంది. కానీ భానుమతి జీవితం వేరు. వరుణ్‌లాగా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్‌ అయిపోవాలని ఆమెకు లేదు. ఒక్క కారణం.. అతణ్ని తన మైండ్‌లోంచి తప్పించేసి, తన జీవితం తాను బతకడానికి ఒక్క కారణం కోసం ఎదురుచూస్తోంది.
 
అయితే వరుణ్‌ విషయంలో ఆమెకు అలాంటి కారణాలేవీ కనబడలేదు. వరుణ్, రాజు, రేణుక అమెరికా వెళ్లిపోయేందుకు రెడీ అయిపోయారు. భానుమతి వరుణ్‌ను ఒక మాట అడగాలనుకుంది. అతను ఎక్కడైనా కనిపిస్తే ఆ మాట చెప్పడానికే తిరుగుతోంది. వరుణ్‌ తన బ్యాగ్‌ సర్దుకుంటున్నాడు. అతణ్ని వెతుక్కుంటూ వచ్చి భానుమతి అతనికి ఎదురుగా వచ్చి నిలబడింది. ‘‘మనం ట్రైన్‌ల కలిసి కూసుందాం. ఏడికీ పోకు. నేను సెకండ్‌ క్లాస్‌లో ఉంటా. నిన్నొకటి అడగాలె. చానా ఇంపార్టెంట్‌.’’ చెప్పేసింది భాను. చెప్పాల్సిన మాటైతే ఒకటి ఇంకా అలాగే దాచిపెట్టుకుంది. ‘‘హే భాను.. ఏమైంది?’’ అడిగాడు వరుణ్‌. ‘ఏం లేదు ఏం లేదు’ అంటూ తల అడ్డంగా ఊపింది భాను. ‘ఏంటో చెప్పు!’ అన్నట్టు చూశాడు వరుణ్‌. ‘‘మర్చిపోకు. ట్రైన్‌ల. ఎస్‌ ఎయిట్‌.’’ వెళ్లిపోయింది భానుమతి. సాయంత్రమయింది. రైలు హైదరాబాద్‌ బయలుదేరింది. భానుమతి వరుణ్‌ కోసం ఆ రాత్రంతా ఎదురుచూస్తూనే కూర్చుంది. ఆమె అతనికి ఒక మాట చెప్పాలి. వారం రోజులుగా తనలో దాచుకున్న మాట. కానీ వరుణ్‌ రాలేదు. తన మరదలితో వేరే కోచ్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. రాత్రంతా ఎదురుచూసింది భానుమతి. ‘నా ప్రేమ పుట్టకుంటనే సచ్చిపోయింది. ఇంక సాకులెతికె అవసరం లేదు నాకు.’ రైల్లో అందరూ పడుకున్న ఆ రాత్రి ఆమె గట్టిగా ఏడుస్తూ తనకు తాను చెప్పుకుందీ మాట. తెల్లారింది. హైద్రాబాద్‌ వచ్చేసింది రైలు. వరుణ్‌ ఆ రోజు భానుతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా ఆమె అతణ్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఫ్లైట్‌ అమెరికా బయల్దేరింది. భానుమతికి ఎంతో ఇష్టమైన అక్క ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోతోంది. ఆమె ప్రేమించిన వరుణ్‌ ఆ మాటను ఆమె నోటినుంచి వినకుండా వెళ్లిపోతున్నాడు.అతడికీభాను అంటే పిచ్చి ఇష్టం. ఆ మాట చెప్పాలనుకుంటున్నాడు కానీ, భానుమతి వినిపించుకోవడం లేదు. ఇద్దరూ ఒకరికి ఒకరు చెప్పుకోకుండా దాచుకున్న మాట ఉంది. ఇద్దరిదీ ఒక్కటే మాట! 

వరుణ్‌ అమెరికా అయితే వెళ్లిపోయాడు కానీ, అతని ఆలోచనలన్నీ భానుమతి దగ్గరే ఆగిపోయాయి. భానుమతి పరిస్థితి కూడా అంతే ఉంది. భానుమతికైనా వరుణ్‌ను తానెందుకు దూరం పెడుతోందో తెలుసు. వరుణ్‌కు ఆ కారణం తెలీదు. ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా మెసేజ్‌లు పెడుతూనే ఉన్నాడు. అతను ఇంక తనలో దాచుకున్న మాటను చెప్పకుండా ఉండలేకపోయాడు. చాలా ఆలోచించి మెసేజ్‌ చేశాడు – ‘‘ఐ లవ్‌ యూ’’. భానుమతి చాలాసేపు ఆ మెసేజ్‌ను మౌనంగా చూస్తూ కూర్చుంది. ఆమెకు వరుణ్‌పైన పిచ్చి కోపం అలాగే ఉంది. ఇష్టం కూడా అంతే ఉంది. కోపాన్నే అప్పటి ఎమోషన్‌గా మార్చేసుకొని వరుణ్‌కు ఒక ఫొటో తీసి పంపింది సమాధానంగా. వరుణ్‌ ఆ ఫొటోను చూసి బాధగా ముఖం పెట్టాడు. తన జీవితంలో మొదటిసారి అతను ఒక అమ్మాయినిఇలా ప్రేమించి, ఆ విషయాన్ని వ్యక్తపరచడం. దానికి భానుమతి తన చెప్పుని ఫొటో తీసి సమాధానంగా పంపిస్తుందని అతను ఊహించను కూడా లేడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ చాలాకాలం పాటు ఒకరినొకరు పలకరించుకోలేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement