డయానా న్యూ లెటర్
అందం, చదువు, ఆస్తి, అంతస్తు, అయినవారు.. అందరూ ఉన్న ఒంటరి యువరాణి.. లేడీ డయానా! ఈ సంగతి ఎవరో ఊహించి చెప్పిందీ, కనిపెట్టి చెప్పిందీ కాదు. స్వయంగా డయానానే తన ఆంతరంగికులకు రాసిన ఉత్తరాలలో తనకు ఎవరూ లేరన్న ఆవేదనను అనేకసార్లు పరోక్షంగా వ్యక్తం చేశారు. లేటెస్టుగా ఇప్పుడు మరో ఉత్తరం బయటపడింది. డడ్లీ పాప్లాక్ అనే ఆత్మీయుడికి 1991 డిసెంబర్ 3న డయానా రాసిన ఉత్తరం అది.
డడ్లీ పాప్లాక్ దక్షిణాఫ్రికా దేశపు ఇంటీరియన్ డిజైనర్. సృజనశీలి. లండన్‌లోని బ్రిటిష్ రాజప్రాసాదంలోని హంగులన్నీ డయానా అభిరుచికి తగ్గట్టు అమర్చింది డడ్లీనే. డడ్లీకి డయానా పుట్టింటితో కూడా అనుబంధం ఉంది. డడ్లీ దగ్గర డయానా ఎంతగా మనసు విప్పారో ఈ ఉత్తరం చదివితే తెలుస్తుంది.
డియరెస్ట్ డడ్లీ,
ఇవాళ లంచ్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా కారణాల వల్ల అది నాకు స్పెషల్ లంచ్. ప్రత్యేకంగా... ఆ రుచికరమై భోజనం ఆఖర్న మన మధ్య జరిగిన సంభాషణ.
ఎప్పుడూ లేనంతగా నేనిప్పుడు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాను. నా దేశంలో, నా కుటుంబంలో జరగబోయేదాన్ని నేను చూడగలుగుతున్నాను.
(ఇక్కడి నుంచి నాలుగు లైన్లు తను తీసుకున్న పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సు గురించి; అన్నార్తులకు, ఆపన్నులకు సహాయం చేయడం గురించి రాశారు డయానా).
తర్వాతి లైన్లు: డడ్లీ, మీకు నా మీద నమ్మకం ఉందని నేను విశ్వసిస్తున్నాను. నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను అపార్థం చేసుకుంటున్న ఈ తరుణంలో మీ నమ్మకం నాకెంత ముఖ్యమైనదో చెప్పలేను. ప్లీజ్.. మన సంభాషణను మళ్లీ మనం జనవరిలో కొనసాగించవచ్చా? నా లోలోపలి ఆలోచనలను మీతో పంచుకోవాలని ఉంది. జీవితం వేగాన్ని, చురుకుదనాన్ని కోల్పోయినప్పుడు నేను మీ సలహాలను అడిగి తీసుకుంటాను.
మీ ముగ్గురూ నాకు స్పెషల్ ఫ్రెండ్స్ డడ్లీ (ఆ ముగ్గురితోనే అంతకుముందు డయానా లంచ్ చేశారు). పీటర్, ఇయాన్‌ల సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. – లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్, డయానా