ఆదిలాబాద్: పెళ్లంటే ఒకప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల చరిత్రను చూసి సంబంధాలు కుదుర్చుకునే వారు. క్రమంగా ఆ సంప్రదాయానికి కాలం చెల్లుతోంది. ఉన్నత చదువుల కోసం, వృత్తిరీత్యా స్థిరపడేందుకు విదేశాల బాట పడుతున్న యువత అక్కడే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రేమించి.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొస్తున్నారు. ఇక్కడి అబ్బాయిలను ఇష్టపడుతున్న విదేశీ యువతులు భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొని మెట్టినింట్లో అడుగు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలుగింటి కోడళ్లుగా అడుగు పెట్టిన విదేశీ అమ్మాయిలపై ప్రత్యేక కథనం.
►అమెరికా అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి..
(టేలర్ డయానా – అభినయ్‌రెడ్డి)
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాకు చెందిన యువతిని ప్రేమించి గత అక్టోబర్‌లో పెద్దల అంగీకారంతో మనువాడాడు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా బంధుమిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఏడడుగులు కలిసి నడిచారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దేవీదాస్– కళావతి దంపతుల పెద్ద కుమారుడు అభినయ్‌రెడ్డి, అమెరికాకు చెందిన టేలర్ డయానా ప్రేమించుకున్నారు.
తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు. వారి అంగీకారంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఆదిలాబాద్ అబ్బాయి, అమెరికా అమ్మాయికి చెందిన ఇరుకుటుంబాల పెద్దలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు కూడా హాజరై ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతితో పాటు భారతీయ వంటకాలు చాలా ఇష్టమని వారు చెప్పడం గమనార్హం. వధూవరులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
►ఆస్ట్రేలియా అమ్మాయి.. నిర్మల్ అబ్బాయి..
(హనా,ఆస్ట్రేలియా – నామని కార్తీక్)
ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి నిర్మల్ అబ్బాయితో ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్‌లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది. నిర్మల్ శాస్త్రినగర్ కాలనీకి చెందిన నామని పద్మ– సదానందం దంపతుల కుమారుడు కార్తీక్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ హనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.
కార్తీక్ సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తుండగా, అమ్మాయి హనా అక్కడే మెడ్‌ల్యాబ్‌లో సైంటిస్టుగా పనిచేస్తోంది. వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించారు. ఆగస్టు 22న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ మహోత్సవానికి వధువు తల్లిదండ్రులు వెరోనికా–డార్రెన్ దంపతులు సైతం హాజరై హిందూ సంప్రదాయరీతిలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని టౌన్స్ ప్రిన్సిల్యాండ్స్‌లోకొత్తకాపురం మొదలుపెట్టారు.
►మయన్మార్ అమ్మాయి.. గుడిహత్నూర్ అబ్బాయి..
(కేథరీన్ – గొల్లపల్లి రవికుమార్)
మయన్మార్ అమ్మాయి, గుడిహత్నూర్ అబ్బాయి ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు. గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన గొల్లపల్లి రవికుమార్‌కు, మయన్మార్‌కు చెందిన కేథరీన్ ప్రేమించుకున్నారు. రవికుమార్ ఆరేళ్ల క్రితం ఖాతర్ దేశానికి వెళ్లాడు.. మయన్మార్‌లోని జిన్‌న్వేథేన్ నగరంలో ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది.
వీరి ప్రేమకు పెద్దలు కూడా ఆమోదం తెలిపారు. చింతగూడలో సెయింట్ థామస్ చర్చిలో గత ఫిబ్రవరి 6న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి అమ్మాయి సోదరుడు క్యాహు థియేన్ హాజరుకాగా, వరుడి తరఫున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరై ఆశీస్సులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment