వార్ధక్యంలోని మతిమరుపుపై పీహెచ్‌డీ చేసి, ఔషధ పరిశోధన జరిపిన ప్రియాంక ఇప్పుడు పెద్దవాళ్లందరి ముద్దుల మనవరాలు అయ్యారు.
ప్రియాంకా జోషి (29) పుణె అమ్మాయి. బయోకెమిస్ట్. సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీ నుంచి బయో ఇన్‌ఫర్మాటిక్స్ అండ్ బయో టెక్నాలజీలో మాస్టర్స్ చేసింది. ఇంగ్లండ్‌కు వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసింది. వార్ధక్యంతో వచ్చే మతిమరుపునకు విరుగుడు కనిపెట్టడం ఆమె పరిశోధనాంశం. ఇంగ్లండ్, వేల్స్‌లలో మహిళలు ఎక్కువ మంది డిమెన్షియా కారణంగానే మరణిస్తున్నారు. ఆ పరిస్థితిని గమనించి, చలించిన ప్రియాంక.. మతిమరుపును దూరం చేసే మందుల కోసం సూక్ష్మ అధ్యయనం. అంతటి విస్తృతమైన అంశంలో పరిశోధన చేయడం, అది కూడా అంత చిన్న వయసులోనే పూర్తి చేయడంతో ఆమెకు గుర్తింపు లభించింది. ‘వోగ్’ మ్యాగజీన్ ఈ ఏడాది పాతికమంది ప్రభావవంతమైన మహిళల జాబితాలో ప్రియాంకను చేర్చింది.
ప్రియాంకే చిన్న
వోగ్ పత్రిక అమెరికా కేంద్రంగా నూట పాతికేళ్ల కిందట మొదలైంది. వార పత్రికగా ఆవిర్భవించి మాస పత్రికగా కొనసాగుతోంది. 23 అంతర్జాతీయ ఎడిషన్‌లతో నిరంతరాయంగా వస్తోంది. అటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రచురణ సంస్థ ‘25 ఇన్‌ఫ్లుయెన్షియల్ ఉమెన్ ఇన్ బ్రిటన్ షేపింగ్ 2018’ విభాగంలో గుర్తించిన పాతిక మంది మహిళల వరుసలో ప్రియాంకకు స్థానం లభించింది. ఇంతటి గుర్తింపును, గౌరవాన్ని మానవహక్కుల ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, కళాకారులు, రచయితల వంటి వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలందించిన మహిళలను ఎంపిక చేస్తుంటుంది వోగ్. ఈ ఏడాది జాబితాలో ఇరవై ఏళ్లుగా రచనారంగంలో ఉండి హ్యారీ పోటర్ రచనతో ప్రపంచంలో నేటికీ అత్యధిక పారితోషికం అందుకుంటున్న 52 ఏళ్ల జెకె రోలింగ్, మానవహక్కుల న్యాయవాది 40 ఏళ్ల అమల్ క్లూనీ కూడా ఉన్నారు. వీరితోపాటు వేదికను పంచుకుంటున్న మరో మహిళ మేఘన్ మార్కల్. అవును, బ్రిటిష్ యువరాజు హ్యారీని పెళ్లి చేసుకున్న మార్కల్ స్త్రీవాద పరిరక్షణ, సమానత్వ సాధన కోసం పని చేస్తున్న యువతి. ఈ పాతికమందిలోనూ ప్రియాంకే అందరికన్నా చిన్నమ్మాయి.
ఇదే ప్రథమం కాదు
ప్రియాంక వోగ్ గౌరవానికి ఎంపిక కావడానికి ముందే అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 2011 నుంచి 14 వరకు మేరీ స్లో్కడోస్కా– క్యూరీ ఫెలోషిప్, 2015లో బెస్ట్ పీహెచ్‌డీకి సాల్జే మెడల్, అల్జీమర్స్ డ్రగ్ డిస్కవరీ ఫౌండేషన్ నుంచి ‘యంగ్ ఇన్వెస్టిగేటర్ 2013’ అవార్డు గెలుచుకున్నారు. ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ సమ్మర్ రీసెర్చ్ ఫెలో, ‘బయోకెమికల్ సొసైటీ సెంటిఫిక్ అవుట్‌రీచ్’లు ప్రియాంకకు ఉపకారవేతనంతో సహకారం అందించాయి. ఫోర్బ్స్ మ్యాగజీన్ కూడా గతంలో శాస్త్రరంగంలో విశిష్టమైన సేవలందిస్తున్న వారి జాబితాలో ప్రియాంకను చేర్చింది. మెదడు పనితీరు, మెదడు కణాలను చైతన్యవంతంగా ఉంచడం కోసం ఆమె శ్రమిస్తున్న వైనం, ఆమె అంకితభావమే ఆమెను ఇన్ని గౌరవాలకు దగ్గర చేశాయి. అభినందనలు వెల్లువలా ప్రవహించడానికి ప్రధాన కారణం... ఆమె ఎంచుకున్న అంశం సమస్త మానవాళికి శ్రేయస్సునిచ్చేది కావడమే.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment