
మొక్కల ద్వారా అధిక మోతాదులో నూనెలను ఉత్పత్తి చేసేందుకు బ్రూక్‌హేవన్ నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు మార్గం సుగమం చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేలా జీవ ఇంధనాల ఉత్పత్తికి ఈ పరిశోధన సాయపడుతుందని అంచనా. మొక్కల బయోకెమిస్ట్రీపై పరిశోధనల సందర్భంగా శాస్త్రవేత్తలకు నూనె ఉత్పత్తికి విఘాతం కలిగిస్తున్న కొన్ని రసాయనాల వివరాలు తెలిశాయి. ఈ రసాయనాలను నిర్వీర్యం చేస్తే మొక్కల ద్వారా నూనె ఉత్పత్తి ఎక్కువవుతుందని వీరు అంచనా వేస్తున్నారు.
ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువైనప్పుడు మొక్కలు నూనెల ఉత్పత్తిని తగ్గిస్తాయని ఇప్పటికే తెలుసునని.. అయితే ఇదెలా జరుగుతుందో తాము గుర్తించామని అంటున్నారు జాన్ శాంక్లిన్ అనే శాస్త్రవేత్త. అయితే సాధారణ పరిస్థితుల్లోనూ ఈ నియంత్రణ ఉండటం తమను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. ఒక ఎంజైమ్ కారణంగా ఇలా జరుగుతోందని తాము గుర్తించామని, సహజసిద్ధంగా ఈ ఎంజైమ్‌లో లోపాలున్న మొక్కలతో కలిపి కొత్త వంగడాలను సృష్టించినప్పుడు నూనె ఉత్పత్తి ఎక్కువైనట్లు తెలిసిందని శాంక్లిన్ వివరించారు.