పెళ్లి పెటాకులు పబ్లిసిటి | publicity of marriage divorce | Sakshi
Sakshi News home page

పెళ్లి పెటాకులు పబ్లిసిటి

Published Thu, May 21 2015 11:19 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM

పెళ్లి పెటాకులు పబ్లిసిటి

పెళ్లి పెటాకులు పబ్లిసిటి

అబద్ధం చెబితే ఆడపిల్లలు పుడతారని అంటారు. రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్ అబద్ధం చెప్పారా? వాళ్లకీ ఆడపిల్లలు పుట్టారా? అబ్బే, వాళ్లకింకా పెళ్లి కాందే! మరి పెళ్లి కానివాళ్లు అబద్ధం చెబితే ఏం జరుగుతుంది? సినిమా ఫట్ అంటుంది. నిదర్శనం... ‘బాంబే వెల్వెట్’. ఈ సినిమా పోయిన శుక్రవారం విడుదలైంది. జనాల్లేరని రివ్వూలు వచ్చాయి. హిందీ సినిమా ఎట్లాపోతే మనకెందుక్కానీ... బాలీవుడ్‌లోనైనా, టాలీవుడ్‌లోనైనా సినిమా విడుదలకు ముందు ఎందుకని రూమర్లు వస్తాయి? రణబీర్, కత్రీనా పైన కూడా బాంబే వెల్వెట్ విడుద లకంటే ముందు, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న అబద్ధం రూమర్‌గా ఎందుకు విడుదలైంది?
ఎందుకంటే... పబ్లిసిటీ స్టంట్!!

కాసుల కోసమే... ఈ మోసం
ఈ మధ్య సినిమాలోని స్టంట్‌లకన్నా, పబ్లిసిటీ స్టంట్‌లు ఎక్కువైపోయాయి. బాంబే వెల్వెట్‌నే చూడండి. పాపం కత్రీనాకు ఏ పాపమూ తెలీదు. మార్కెటింగ్ ఒకటి ఉంటుంది కదా, అది ఆడింది నాటకమంతా! ఎంత అన్యాయం? సినిమాను హిట్ చేయడం కోసం వీళ్లు ఏదైనా చేసేస్తారా? ప్రేక్షకులను మోసం చేసి కాసులు చేసుకోవడం అనైతికం కాదా?!
 రణబీర్‌కు ఈ సంగతి ముందే తెలుసన్నది ఓ వాదన. పబ్లిసిటీ వాళ్లే ఆయన్ని కోరారట, మీ ఫ్రెండ్స్‌తో ఒకరిద్దరి దగ్గర మీరు, కత్రీనా పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పండీ అని! వాళ్లు చెప్పినట్లు అతడు చేశాడు. ఎంత తప్పు!

రహస్య వివాహం
ఇంకో ‘వెడ్డింగ్’.. నయనతార, విఘ్నేష్ శివన్‌లది. ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనా? మూడ్రోజుల నుంచీ ఈ రూమర్ వినిపిస్తోంది. నయన, విఘ్నేష్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని తమిళనాడంతా గుసగుసలు. ఆ రూమర్‌లని ‘బేస్‌లెస్' అని ఇద్దరూ ఖండించారు. అసలు సంగతేమంటే, సినిమా క్లిక్ అవడం కోసం మార్కెటింగ్ టీమ్ వీళ్ల పెళ్లిని ‘జరిపించిందని.
‘‘నటుడితోనో, డెరైక్టర్‌తోనో నయనతారను అంటగట్టిన ప్రతిసారీ ఆ సినిమా హిట్ అవుతోంది. అందుకనే కొందరు పనిగట్టుకుని ఈ రూమర్లను స్ప్రెడ్ చేస్తున్నారు’’ అని నయనతార స్నేహితురాలు ఒకరు అంటున్నారు.

బాహుబలి కూడా అంతేనా?
ఇవన్నీ చూస్తుంటే ఇటీవల జరిగిన ‘బాహుబలి', అంతకుముందు జరిగిన ‘అత్తారింటికి దారేది’ సినిమాల లీకేజీ వ్యవహారం కూడా పబ్లిసిటీ స్టంట్ అనే అనుకోవలసి వస్తోంది. అయితే బాలీవుడ్‌తో పోల్చిచూస్తే మాత్రం మనవాళ్లు అమాయకులే అనుకోవాలి.

బాలీవుడ్ లో పబ్లిసిటీ స్టంట్ మరీ విడ్డూరంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదా: ఆమిర్‌ఖాన్ ‘ఫనా' (2006) చిత్రం పబ్లిసిటీ కోసం ‘నర్మదా బచావో ఆందోళన్’కు బహిరంగంగా మద్దుతు తెలిపారు. పూనమ్ పాండే అయితే ఐపీఎల్‌లో షారుఖ్ ఖాన్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిస్తే కనుక ఒంటిమీది బట్టలన్నీ తీసేస్తాని ప్రకటించింది. కానీ ఆ ప్రకటన ఆమె సినిమాలను హిట్ చేయలేకపోయింది. ఇక మల్లికా షెరావత్. ఒక దుకాణంలో ఆమె జిలేబీని అమ్మడం, తను నటించిన ‘జిలేబీ బాయ్’ పబ్లిసిటీ కోసమే! వివేక్ ఒబేరాయ్ అయితే ఐశ్వర్యారాయ్‌తో తనకు రిలేషన్ ఉన్నట్లు నమ్మించి స్టార్‌గా వెలిగిపోదామని అనుకున్నాడు. సరిగ్గా ‘ఏజెంట్ వినోద్’ సినిమా విడుదలకు ముందు సైఫ్ అలీఖాన్ తాజ్ హోటల్ లో ఎవరితోనో గొడవపెట్టుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే బీ టౌన్ కపుల్ అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా సైతం తాము విడిపోతున్నట్లు ప్రకటించడం సినిమా పబ్లిసిటీ కోసమే. ‘ఏక్ చోటీ సీ లవ్ స్టోరీ’లో నటించిన మనీషా కొయిరాల.. వాటిల్లో కొన్ని సీన్లు తనవి కావని గగ్గోలు పెట్టడం ప్రేక్షకుల్లో ఆ సినిమా పై ఆసక్తి కలిగేలా చేసింది.

ఏమైనా ఈ మధ్య ఇలాంటి ప్రమోషన్ వర్క్ ఎక్కువైపోయింది. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తారు నిజమే. కానీ వాటిని హిట్ చేయించుకోవడం కోసం అబద్దాలను, అనౌచిత్యాలను ఆశ్రయించడం మంచిదేనా అని ఈ ప్రొడ్యూజర్లు, స్టార్లు, మార్కెటింగ్ వ్యూహమిస్టులు ఆలోచించాలి. ఈ ధోరణి ఇలాగే సాగుతుంటే, పబ్లిసిటీనే కాదు, సినిమానూ ఎవరూ పట్టిచుకోకుండాపోయే ప్రమాదం ఉంది.
 
మోస్ట్ ‘హట్కే' డెరైక్టర్
రామ్‌గోపాల్ వర్మ కూడా ప్రతి సినిమాకీ ఏదో ఒకటి వదులుతూనే ఉంటారు. లేటెస్టుగా ఆయన తన కొత్త సినిమా ‘365 డేస్ గురించి ఓ ఆసక్తికరమైన సంగతిని బయటపెట్టారు. లేదా బయట పెట్టడం ద్వారా ఆసక్తిని రేపారు. అదేమిటంటే... ఇలాంటి ఒక సినిమా తియ్యాలని తను విడాకులు తీసుకున్నప్పటి నుంచీ అనుకుంటున్నారట. కొత్తగా పెళ్లయిన ఓ కోడెవయసు జంట రొమాంటిక్ డ్రామా ఇది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘మోస్ట్ హట్కే ఫిల్మ్’ అట! అంటే తను తీసిన మిగతా సినిమాలకంటే భిన్నమైనదని.  ‘‘నిజాయితీగా చెప్పాలంటే, ఈ సినిమా తీస్తున్నప్పుడు నాకంతా కొత్తగా అనిపించింది. నేను వేరెవరి సెట్‌లోనో ఉండి పనిచేస్తున్నట్లు ఫీలయ్యా. నేను ఫ్యామిలీ మనిషిని కాదు. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఎవ రితోనూ కలవను. మాట్లాడలేను. అది నా స్వభావం. దాన్నలా ఉంచితే విడాకులు తీసుకున్న నాటి నుంచి, ఇంకా చెప్పాలంటే పెళ్లయి నాటి నుంచీ కూడా 365 డేస్ నా మైండ్‌లో ఉంది. గ్యాంగ్‌స్టర్, హారర్, థ్రిల్లర్, కేపర్ (జంప్ అండ్ రన్) సినిమాలు చాలా తీశాను. ఇప్పుడీ 365 డేస్‌ని తీస్తున్నానంటే దానికి టైమ్ వచ్చిందని. ఇకనుంచీ ఇలాంటివే తీస్తా. ఇది నా జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది మీరు ఊహించలేరు. అన్ యూజువల్ అండ్ అనెక్స్‌పెక్టెడ్’’ అని సుదీర్ఘంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌ని వదిలారు రామ్‌గోపాల్ వర్మ. ఈ మాత్రం చాలదా సినిమాకు పబ్లిసిటీ వచ్చేందుకు. ఏమో... ఈ ఐటమ్ కూడా వర్మ సినిమాకు పబ్లిసిటీగా ఉపయోగపడినా పడొచ్చు.
 
వెరైటీ పబ్లిసిటీ
‘పీకె' సినిమా ప్రమోషన్‌లో భాగంగా వారణాసికి తన చిత్రబృందంతో వచ్చిన ఆమిర్‌ఖాన్ వీధి వీధి తిరుగూతూ కిళ్లీ కొట్టు దగ్గర పాన్ నమలడం... నేషనల్ న్యూస్‌గా మారి సినిమా ప్రమోషన్‌కు కలిసివచ్చింది.

షారుఖ్‌ఖాన్ ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా ప్రమోషన్ కోసం అరునబ్ దర్శకత్వంతో  ఒక ‘సెటైర్ వీడియో’లో నటించి అందరినీ నవ్వించి తన సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడేలా చేశాడు.

సల్మాన్‌ఖాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ దాన్ పాయో’ సినిమా వచ్చే ఆగస్ట్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్  కోసం చిత్రబృందం ఒక కొత్త పద్ధతిని ఎంచుకుంది. సినిమా విడుదల కావడానికి మూడు నెలల ముందే ‘అడ్వాన్స్ బుకింగ్’ ప్రారంభించనుంది. ఈ తరహా ప్రయోగం. బాలీవుడ్‌లో ఇదే మొదటిసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement