పుల్కాలను వద్దనుకుంటే.. ప్రగతి పథంలో...
చాలా మంది అభ్యుదయ వాదులు కూడా సంప్రదాయం ముసుగులో ఆడవాళ్లపై ఆంక్షలు విధించడానికే ఇష్టపడతారు. ఇది చాలా కుటుంబాల్లోని సమస్యే. భార్య ఉద్యోగం చేయడం, చేయకపోవడం అనే విషయం నవతరం రచయిత చేతన్ భగత్ కుటుంబంలోనూ ఒక దశలో సమస్యగా మారిందట. అయితే దేశంలోనే ప్రముఖ రచయిత హోదాలో ఉన్న చేతన్ భగత్ వర్కింగ్ ఉమెన్‌కు అండగా నిలబడతాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఆడవాళ్లు ఉద్యోగం చేయడం ఎంత గొప్ప విషయమో తెలియజెబుతాడు. ఈ విషయంలో అభ్యంతరాలు ఉన్న వాళ్లెవరైనా చేతన్ భగత్ వాదన విని తీరాలి. ఎందుకంటే చేతన్ నేటి తరాన్ని బాగా ఆకట్టుకొంటున్న రచయిత. ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఆలోచనాపరుడు.
‘‘మా అమ్మ 40 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసింది. నా భార్య ఒక అంతర్జాతీయ బ్యాంక్‌లో సీవోవో గా ఉంది. ఈ రెండు విషయాలూ నాకు గర్వకారణం. ఏ ఒక్కసాయంత్రమూ కూడా నా భార్య నాకు పుల్కాలు చేసి పెట్టడం లేదు. ఎందుకంటే తను బిజీ. అందుకే బయట నుంచి తెప్పించుకొంటాం. ఇది నాకు ఏమీ బాధ కలిగించదు. ఒకవేళ నా భార్య వంటగదికే పరిమితం అయ్యుంటే... అది కచ్చితంగా బాధాకరమైన పరిణామం అయ్యేది. ఉద్యోగం చేసే భార్య దొరకడం నిజంగా అదృష్టమే. ఒక రకంగా కాదు, అనేక రకాలుగా. ఒక వృత్తిలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొన్న యువకుడు తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు కూడా ఆమెతో చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం అయిన మహిళతో పోలిస్తే వర్కింగ్ ఉమన్ భర్తకు మంచి సలహాదారుగా ఉండే అవకాశం ఉంది. ఆఫీస్ రాజకీయాలను చవిచూసిన ఆమె కచ్చితంగా మంచి జీవిత భాగస్వామి కాగలదు. ఆర్థికంగా కూడా ఆమె అందించే సహకారం అంతా ఇంతా కాదు. ప్రస్తుత నగర జీవితంలో భార్య కూడా ఉద్యోగం చేయడం సదుపాయవంతమైన జీవితాన్ని గడపడానికి బాటలు వేస్తుంది. ఆమె కూడా సంపాదన పరురాలు అయితే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం లభిస్తుంది. పనిచేస్తున్న ఆమె ప్రపంచాన్ని తెలుసుకోగలదు.
ఏ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి... హాలీడే ట్రిప్‌కు ఎక్కడకు వెళ్లవచ్చు... లాంటి విషయాలను ఆమె ఎంతో ఆసక్తితో తెలుసుకొంటుంది. ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ పెంపొందడానికి ఆమెకున్న అవగాహన కూడా ఒక సాధనం అవుతుంది. ఉద్యోగం చేసే అమ్మ పెంపకంలో పెరిగిన పిల్లలలో కొన్ని స్వతంత్ర భావాలు పెరుగుతాయి. అమ్మాయిలకు తల్లి రోల్‌మోడల్ అవుతుంది. ప్రతి విషయంలోనూ భార్య తన మీద ఆధారపడటం కూడా ఒక్కోసారి భర్తకు కొత్త తలనొప్పి కావచ్చు. అయితే ఉద్యోగం చేసే భార్య చాలా వరకూ ఈ విషయంలో రిలీఫ్‌ను ఇస్తుంది.
ఇన్ని లాభాలున్నాయి చూశారా! వీటిని స్వార్థంగా తీసుకొని అయినా మనం వర్కింగ్ ఉమెన్‌కు మద్దతుగా నిలవాలి. ఆమె సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవాలి. భార్య ఉద్యోగం చేయడం వల్ల వేడి వేడి ఫుల్కాలు తినలేకపోవచ్చు. అయితే ఆమె ఉద్యోగం చేయడం వల్ల ఆర్థికంగా ముందంజలో నిలస్తుంది. తద్వారా దేశం అభ్యున్నతిని సాధిస్తుంది...’’ అంటూ చేతన్ విశ్లేషిస్తాడు. చేతన్ నవలల్లో హీరోయిన్లు తెలివైన వాళ్లు. నిజజీవితంలో అలాంటి తెలివైన వాళ్లతో ఇన్ని సౌలభ్యాలున్నాయని స్త్రీ సాధికారతకు జై కొడుతున్నాడు.