Restrictions on women
-
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్‌జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్‌జాదా హెచ్చరించారు. -
ఇరాన్లో మతోన్మాదుల రాక్షసకాండ.. విషవాయువుల ప్రయోగం
నాగరిక ప్రపంచంలో వివక్షకు తావులేదు. ఆడ, మగ అనే తేడా చూపడం నైతిక సూత్రాల ప్రకారమే కాదు, చట్ట ప్రకారమూ ముమ్మాటికీ నేరమే. బాలికలకు విద్యను నిరాకరించడం, వారికి చదువుకొనే అవకాశాలు దూరం చేయడం రాక్షసత్వమే అనిపించుకుంటుంది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో ఇప్పుడు అచ్చంగా అలాంటిదే జరుగుతోంది. కేవలం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని విష వాయువుల ప్రయోగానికి పాల్పడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు దుండగుల దుశ్చర్యపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతోందో తెలియక వణికిపోతున్నారు. సమాజంలో అశాంతి నెలకొంటోంది. విష వాయువుల ప్రయోగాల గుట్టును రట్టు చేస్తామని, దోషులను కచ్చితంగా శిక్షిస్తామని ఇరాన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం కొంత ఊరట కలిగిస్తోంది. రగిలిన ఉద్యమం.. ఇరాన్లో 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. బాలికలు, యువతులపై ఆంక్షలన్నీ దాదాపుగా తొలగిపోయాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి నిర్భయంగా చదువుకుంటున్నారు. పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్ తరహా పరిస్థితులు ఇరాన్లో లేవు. బాలికల విద్యాభ్యాసాన్ని, మహిళలు ఉద్యోగాలకు వెళ్లడాన్ని తాలిబన్ ప్రభు త్వం నిషేధించడం పట్ల ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్ధతి మార్చుకోవాలని, మహిళలపై ఆంక్షలు ఎత్తివేయాలని తాలిబన్ పాలకులను హెచ్చరించింది కూడా. అలాంటిది ఇరా న్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తలపై బురఖా సక్రమంగా ధరించనందుకు 22 ఏళ్ల మహసా అమీనీ అనే యువతిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధించారు. చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. మూడు రోజులపాటు కోమాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అమీనీ సెప్టెంబర్ 16న మృతి చెందింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు, యువతులు, బాలికలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. నైతిక నియమావళి పేరిట తమను అణగ దొక్కుతున్నారని, గొంతు నొక్కు తున్నారని, హక్కులు హరిస్తున్నారని ఆరోపిస్తూ నెలల తరబడి ఆందోళన కొనసాగించారు. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని నినదించారు. వారి ఆందోళన మహోగ్ర ఉద్యమంగా మారింది. మహిళల ఉద్యమం పట్ల ప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మహిళలంతా శాంతించాలని కోరింది. ముష్కరుల ఉద్దేశం అదేనా! మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, దిగి వచ్చేలా చేయడం మతోన్మాదులకు, పిడివాదులకు కంటగింపుగా మారింది. బాలికలను విద్యాసంస్థ లకు వెళ్లకుండా, చదువుకోకుండా చేయడమే లక్ష్యంగా కుతంత్రానికి తెరలేపారు. భయభ్రాంతులకు గురిచేసి, ఇళ్లకే పరిమితం చేయడానికి విష వాయువుల ప్రయోగం అనే దొంగదారిని ఎంచుకున్నారు. విద్యార్థినులెవరూ రాకపోతే పాఠశాలలు మూతపడతాయన్నది వారి ఉద్దేశం. ముసుగులు ధరించి, తరగతి గదుల్లోకి హఠాత్తుగా ప్రవేశించడం, విష వాయువులు వదిలి, క్షణాల్లో మాయం కావడం.. కుట్ర మొత్తం ఇలా సాగింది. జరిగింది ఇదీ.. ► ఇరాన్లో 30 ప్రావిన్స్‌లు ఉండగా, 21 ప్రావిన్స్‌ల్లో 50కి పైగా పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు జరిగాయి. ► గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా 50కి పైగా పాఠశాలల్లో 700 మంది విద్యార్థినులు ఈ ప్రయోగాల బారినపడినట్లు ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. అయితే, ఇప్పటివరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ► బాధితుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ► తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. బాధితులు కాళ్లు, కడుపులో నొప్పితో విలవిల్లాడారు. ► కొందరిలో అవయవాలు తాత్కాలికంగా మొద్దుబారిపోయినట్లు వెల్లడయ్యింది. ► దుండుగులు ప్రయో గించిన వాయువులు ► కుళ్లిన నారింజ పండ్ల వాసన, క్లోరిన్ వాసన, టాయ్లెట్లు శుభ్రం చేసుకొనే రసాయనాల వాసన వచ్చినట్లు బాధితులు చెప్పారు. ► ఫాతిమా రెజై అనే 11 బాలిక విష ప్రయోగం కారణంగా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇన్ఫెక్షన్ వల్లే మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు, చికిత్స అందించిన డాక్టర్ చెప్పారు. క్షమించరాని నేరం ఇరాన్ పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు అంతర్జాతీయంగా సంచలనాత్మకంగా మారాయి. బాలికలపై విష వాయువులు ప్రయోగించడం క్షమించరాని నేరమని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ చెప్పారు. గుర్తుతెలియని ముష్కరులు ఉద్దేశపూర్వ కంగానే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని, వారిని బంధించి, చట్టం ముందు నిలబెడతామని, కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. బాలికలపై ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏకంగా మానవత్వంపై జరిగిన నేరమేనని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తేల్చిచెప్పారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తే శిక్షించాల్సిందే ఇరాన్ న్యాయ వ్యవస్థ అధినేత ఘోలామ్హుస్సేన్ మొహసెనీ ఏజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన మహిళలను కఠినంగా శిక్షించాలని అన్నారు. మహిళలు హిజాబ్ తొలగించడం ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల, దాని విలువల పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించడంతో సమానం అవుతుందని చెప్పారు. అలాంటి అసాధారణ చర్యలకు పాల్పడేవారు శిక్షకు గురికాక తప్పదని స్పష్టం చేశారు. -
World Voice Day 2021: మీ గళం మీ మార్గం
స్త్రీల గళాల వల్లే ఈ ప్రపంచం సంగీతమయం అయ్యిందంటే ఎవరూ కాదనకపోవచ్చు. భారతీయ మహిళ తన గొంతు వినిపించడం, తన మాటకు విలువ తెచ్చుకోవడం, తన గళంతో ఉపాధి పొందడం ఇంకా సంపూర్ణంగా సులువు కాలేదు. యాంకర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, అనౌన్సర్లు, గాయనులు, రిసెప్షనిస్టులు, కాల్ సెంటర్ ఉద్యోగినులు... మంచి గొంతు వల్లే ఉపాధి పొందుతున్నారు. నిత్య జీవితంలో గొంతు పెగల్చకుండా జీవనం సాగదు. ‘ప్రపంచ గళ దినోత్సవం’ మన గొంతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. అంగీకారానికైనా అభ్యంతరానికైనా గొంతును సవరించమని కోరుతుంది. గొంతు నొప్పి వస్తే తప్ప గొంతును పట్టించుకోని మనం మన గళానికి ఏం ఇస్తున్నాం? మన గళంతో ఏం పొందుతున్నాం? సీనియర్ నటి లక్ష్మితో నటుడు కమల హాసన్ ఒకసారి ‘మీరు రోజూ గుడ్ మార్నింగ్ చెప్తే చాలు... మీ గొంతు విని ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేయగలను’ అన్నాడట. ఇది ప్రేమ ప్రకటన కాదు. ఒక మంచి గొంతు వింటే వచ్చే ఉత్సాహం గురించి. మంచి గొంతు కలిగి, అందులో ఉత్సాహం నిండి ఉంటే మనకు మనం పొందే వెలుగు సరే. జగానికి కూడా వెలుగు ఇవ్వవచ్చు. గొంతు పై ఆంక్ష భారతీయ సమాజంలో ‘ఆడది గడప దాటకూడదు. ఇంట్లో నోరు మెదపకూడదు’ అనే భావన అనేక శతాబ్దాలు రాజ్యమేలింది. ‘ఇంట్లో ఆడపిల్లా ఉందా లేదా అన్నట్టు ఆమె గొంతు వినిపించాలి’ అని అనేవారు. ఆడపిల్ల తనకో నోరు ఉన్నట్టు, ఆ నోటి నుంచి మాట రాగలదు అన్నట్టు ఉండటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అబ్బాయిలకు. ఆ అబ్బాయి పెద్దయ్యి పురుషుడు అయితే అతని గొంతు అన్ని విధాలా అనుమతి ఉంటుంది. కాని స్త్రీకి మాత్రం కాదు. గొంతు ‘వాడిన’ స్త్రీని ‘గయ్యాళి’ అనడానికి సమాజం రెడీగా ఉండేది. అది కాదు ఆ గొంతును ప్రదర్శనకు పెట్టడం నామోషీగా దిగువ రకం స్త్రీలు చేసే పనిగా ప్రచారం చేశారు. పాటలు పాడేవాళ్లను, నలుగురూ వినేలా కవిత్వం పలికే వారిని, వేదిక ఎక్కి ఏదైనా అభిప్రాయం చెప్పేవారిని సమాజం న్యూనత పరిచేలా చూసింది. సరిగా చెప్పాలంటే న్యూనతతో చూసింది. ఆడేపాడే స్త్రీలకు ఒక కులాన్ని, ఒక సమూహ స్వభావాన్ని ఏర్పాటు చేసింది. స్త్రీలు మెదడు ఉపయోగించరాదు. శారీరక బలాన్ని ఉపయోగించరాదు. మాటను కూడా ఉపయోగించరాదు. భర్తకు, కుటుంబానికి తప్ప తమ గొంతు ఎలా ఉంటుందో తెలుపకనే... వినిపించకనే గతించిపోయిన స్త్రీలు కోట్లాది మంది. పేరంటం పాటలు పాడటాన్ని కూడా చాలా బిడియంతో నిండిన విషయంగా సగటు స్త్రీలు భావించేవారంటే గొంతు విప్పడం గురించి ఎన్ని ఆంక్షలు ఉండేవో అర్థం చేసుకోవచ్చు. మీ గొంతు మీ హక్కు మనిషి మనుగడకు, ఉపాధికి గొంతు ఒక ప్రధాన సాధనం. అయితే ఆ గొంతుతో అవకాశం పొందే హక్కుదారు మొదట మగవాడే అయ్యాడు. స్త్రీల గొంతు ఇంటికే పరిమితమైంది. పెళ్లికి ముందు ఎంతో అద్భుతమైన గాయనులుగా గుర్తింపు పొందినవారు పెళ్లి తర్వాత ‘భర్తకు ఇష్టం లేదని చెప్పి’ తమ కెరీర్లను వదులుకున్నారు. మొదటి రేడియో అనౌన్సర్‌గా పని చేసే మహిళలు, మొదటి టీవీ అనౌన్సర్‌గా పని చేసే మహిళలు, ఆ తర్వాత టెలిఫోన్ ఆపరేటర్లు, రైల్వే అనౌన్సర్లు, డబ్బింగ్ ఆర్టిస్టులు, యాంకర్లు, ఇప్పుడు కాల్‌సెంటర్ ఉద్యోగినులు తమ గొంతు ను ఒక ఉపాధి చేసుకోవడానికి సుదీర్ఘ పయనం చేయాల్సి వచ్చింది. ఇవాళ రాజకీయ పార్టీలకు స్పోక్స్‌పర్సన్స్ దగ్గరి నుంచి విదేశాంగ వ్యవహారాలను తెలియచేసే ప్రతినిధుల వరకు స్త్రీలు తమ గొంతును, మాటను సమర్థంగా ఉపయోగించే స్థాయికి ఎదిగారు. హేళనా బుద్ధి స్త్రీలు చాడీలు చెప్పుకుంటారని, గోడకు ఈ పక్క ఆ పక్క నిలబడి గంటల కొద్దీ ఊసుపోని కబుర్లు చెప్పుకుంటారని హేళన చేసే కార్టూన్లతో జోకులతో వారిని పలుచన చేసే భావజాలం కొనసాగుతూనే ఉంది. బయట మాట్లాడే వీలు లేనప్పుడు, ఆఫీసుల్లో మాట్లాడే వీలులేనప్పుడు, చాయ్ హోటళ్లలో మాట్లాడే వీలు లేనప్పుడు, స్నేహబృందాలుగా కూచుని మాట్లాడుకునే వీలు లేనప్పుడు, ఇంట్లోనే ఉండక తప్పనప్పుడు స్త్రీలు గోడకు ఈ పక్క ఆ పక్క మాట్లాడక ఎక్కడ మాట్లాడతారు? మాటకు ముఖం వాచిపోయేలా చేసి ఆ తర్వాత వారు గంటల తరబడి మాట్లాడతారనడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. గొంతు ఆరోగ్యం స్త్రీలు వయసు పెరిగే కొద్ది గొంతులో వచ్చే మార్పులను గమనించుకోవాలని ‘ప్రపంచ గళ దినోత్సవం’ సూచిస్తోంది. వినోద రంగంలో ఉండే స్త్రీలు, గొంతు ఆధారంగా ఉపాధి పొందే స్త్రీలు తమ గొంతు గురించి చైతన్యం కలిగించుకోవాల్సిన రోజే ‘ప్రపంచ గళ దినోత్సవం. పిల్లల గొంతు సమస్యలు గాని, స్త్రీల గొంతు సమస్యలు కాని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం పొందాలని కోరుతుంది. 1999లో బ్రెజిల్ దేశంలో మొదలైన ప్రపంచ గళ దినోత్సవం నేడు ప్రపంచమంతా జరుపుకుంటోంది. ఇంట్లో ఆడపిల్ల అల్లరి చేస్తుంటే ‘ఏంటా గొంతు’ అని గద్దించే భావధారకు ఇవాళైనా స్వస్తి పలకాల్సిన అవసరాన్ని ఈ దినం ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
అమ్మాయిల దుస్తులపై ఆంక్షల్లేవు: బీహెచ్‌యూ
సాక్షి, న్యూఢిల్లీ: బెనారస్ హిందూ యూనివర్సిటీలో తొలి మహిళా చీఫ్ ప్రొక్టార్‌గా నియమితులైన రోయనా సింగ్ విద్యార్థినుల స్వేచ్ఛను హరించే నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. దుస్తులు, ఆల్కహాల్‌పై అమ్మాయిలకు ఎలాంటి నియంత్రణలు ఉండవని తేల్చిచెప్పారు. క్యాంపస్ మెస్‌ల్లో మాంసాహారంపై నిషేధాన్ని తోసిపుచ్చారు. ‘నేను యూరప్‌లో పుట్టా... తరచూ యూరప్, కెనడాలను సందర్శిస్తా విద్యార్థినుల వేషధారణపై నియంత్రణలు విధిస్తే నాపై నేను విధించుకున్నట్టే’ అని రోయనా సింగ్ అన్నారు. తమకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను వేసుకోలేకపోతే అంతకన్నా సిగ్గుచేటు ఇంకేముందని ఆమె ప్రశ్నించారు. అమ్మాయిల దుస్తులపై అబ్బాయిల కామెంట్లను నిరసిస్తూ.. అమ్మాయిలు వారికి సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే వారికి అభ్యంతరం ఎందుకని నిలదీశారు. బెనారస్ యూనివర్సిటీ ఎన్నడూ అమ్మాయిలపై నియంత్రణలు విధించలేదని, భవిష్యత్‌లోనూ విధించబోదని ఆమె పేర్కొన్నారు. ఇక మద్యం విషయానికి వస్తే ఇక్కడున్న అమ్మాయిలంతా 18 ఏళ్లు పైబడిన వారేనని, వారిలో అసలు ఈ ఆలోచనలను ఎందుకు రేకెత్తించాలని అన్నారు. వర్సిటీలో ఈవ్‌టీజింగ్, రౌడీయిజం వంటి అవలక్షణాలను పారదోలేందుకు కఠిన చర్యలు చేపడతామన్నారు. క్యాంపస్ అంతటా సీసీ టీవీ కెమెరాలను అమరుస్తామని చెప్పారు. -
సౌదీలో ఇంతే...
యూఏఈ: మహిళలపై ఎన్నో ఆంక్షలు, పరిమితులున్న సౌదీ అరేబియాలో ఎట్టకేలకు మహిళల డ్రైవింగ్‌కు రాచరిక ప్రభుత్వం అనుమతించింది. వచ్చే ఏడాది జూన్ నుంచి అమలయ్యే ఈ నిర్ణయానికి సంబంధించి విధివిధానాలను నూతనంగా ఏర్పాటైన కమిటీ 30 రోజుల్లో నిర్ధేశిస్తుంది.తాజా నిర్ణయంతో సౌదీ మహిళలు ఇక తమ భర్తలు లేదా సంరక్షకుల అనుమతి లేకుండానే తాము సొంతంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏళ్ల తరబడి పోరాటాలతో సౌదీ మహిళలు ఈ సౌలభ్యాన్ని సాధించుకున్నా ఇంకా పలు మౌలిక అంశాల్లో వారు భర్తలు, తండ్రులు, సంరక్షకుల అనుమతిపై ఆధారపడే దుస్థితి కొనసాగుతోంది.సౌదీలో దశాబ్ధాల తరబడి సమాజంలో మహిళల పాత్ర పరిమితంగానే ఉంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెలువరించిన 2016 ప్రపంచ లింగ అసమానతల నివేదికలో 144 దేశాల జాబితాలో సౌదీ అరేబియా చిట్టచివరన 141వ స్థానంలో నిలిచింది. సౌదీ తర్వాత కేవలం సిరియా, పాకిస్తాన, యెమెన్ దేశాలున్నాయి. పురుషుల కనుసన్నల్లోనే... వివాహం, విడాకులు, ప్రయాణం, బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఉద్యోగం..ఇలాంటి అంశాలేవైనా పురుష సంరక్షకుల అనుమతి లేకుండా సౌదీ మహిళలు చేసేదేమీ లేదు. మహిళలు తమ జీవితంలోని ప్రతి అంకంలోనూ, అడుగడుగునా పురుషుల కనుసన్నల్లోనే కదలాలని అక్కడి గార్డియన్షిప్ చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.మహిళల తండ్రులు మరణించిన సందర్భాల్లో వారి భర్త, పురుష బంధువు, సోదరులు, చివరికి కుమారుడో వారికి చిన్న చిన్న విషయాల్లోనూ అనుమతి ఇవ్వాల్సిందే. భర్తతో విడాకులు పొందితే మగపిల్లలకు ఏడు, ఆడపిల్లలకు తొమ్మిదేళ్లు వస్తేనే మహిళలు తమ పిల్లలను తమ వద్ద ఉంచుకోగలుగుతారు. మగవారి అనుమతితోనే జాతీయ గుర్తింపు కార్డు లేదా పాస్‌పోర్ట్ పొందాలి. ఫ్యామిలీ సెక్షన్లేని రెస్టారెంట్లో మహిళలు తినడానికి వీల్లేదు. మగవారితో దూరం..దూరం సమాజంలో స్ర్తీ,పురుషులు భాగమే అయినా సౌదీలో మాత్రం మగువలు మగవారి కంటపడటం అరుదు. కేవలం ఆస్పత్రులు, బ్యాంకులు, వైద్య కళాశాలల్లో మాత్రం దీనికి కొంత మినహాయింపు ఉంటుంది. స్ర్తీ, పురుషులు కలిసి పనిచేయడాన్ని నివారించేందుకు 2013లో సౌదీ అధికారులు పలు నిబంధనలు విధించారు. వారు పనిచేసే షాపులు, సంస్థల్లో అడ్డుగోడలు నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు.బహిరంగ ప్రదేశాల్లో శరీరాన్ని పూర్తిగా కప్పే వస్ర్తాలు ధరించాల్సిందే. అనుమతిస్తేనే వ్యాపారం సౌదీలో మహిళలు వ్యాపారం చేయాలంటే సాహసమే. వారు సొంతం వ్యాపారానికి మొగ్గుచూపితే వారి వ్యక్తిత్వం పట్ల కనీసం ఇద్దరు మగాళ్లు సంతృప్తి వ్యక్తం చేయాలి.అప్పుడు మాత్రమే వారికి వ్యాపారం చేసేందుకు లైసెన్స్ కానీ, రుణం కానీ మంజూరు చేస్తారు. న్యాయస్ధానాల్లోనూ అన్యాయమే సౌదీ చట్టాల ప్రకారం ఒక పురుషుడు ఇద్దరు మహిళలతో సమానం. మహిళ మైనర్‌తో సమానం.సౌదీ నిబంధనల మేరకు మహిళకు తన సొంత జీవితంపై తనకుండేది కేవలం పరిమిత అధికారాలే. ఆస్తిపాస్తుల్లోనూ అక్కడి మహిళలకు దక్కేది అరకొరే. సోదరుడు పొందే వాటాలో సగ భాగం మాత్రమే మహిళకు దక్కుతుంది.మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల అరాచకంతో మహిళలు పేదరికంలోకి నెట్టబడే దుస్థితి నెలకొంది. -
పుల్కాలను వద్దనుకుంటే.. ప్రగతి పథంలో...
చాలా మంది అభ్యుదయ వాదులు కూడా సంప్రదాయం ముసుగులో ఆడవాళ్లపై ఆంక్షలు విధించడానికే ఇష్టపడతారు. ఇది చాలా కుటుంబాల్లోని సమస్యే. భార్య ఉద్యోగం చేయడం, చేయకపోవడం అనే విషయం నవతరం రచయిత చేతన్ భగత్ కుటుంబంలోనూ ఒక దశలో సమస్యగా మారిందట. అయితే దేశంలోనే ప్రముఖ రచయిత హోదాలో ఉన్న చేతన్ భగత్ వర్కింగ్ ఉమెన్‌కు అండగా నిలబడతాడు. పెళ్లి అయిన తర్వాత కూడా ఆడవాళ్లు ఉద్యోగం చేయడం ఎంత గొప్ప విషయమో తెలియజెబుతాడు. ఈ విషయంలో అభ్యంతరాలు ఉన్న వాళ్లెవరైనా చేతన్ భగత్ వాదన విని తీరాలి. ఎందుకంటే చేతన్ నేటి తరాన్ని బాగా ఆకట్టుకొంటున్న రచయిత. ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఆలోచనాపరుడు. ‘‘మా అమ్మ 40 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసింది. నా భార్య ఒక అంతర్జాతీయ బ్యాంక్‌లో సీవోవో గా ఉంది. ఈ రెండు విషయాలూ నాకు గర్వకారణం. ఏ ఒక్కసాయంత్రమూ కూడా నా భార్య నాకు పుల్కాలు చేసి పెట్టడం లేదు. ఎందుకంటే తను బిజీ. అందుకే బయట నుంచి తెప్పించుకొంటాం. ఇది నాకు ఏమీ బాధ కలిగించదు. ఒకవేళ నా భార్య వంటగదికే పరిమితం అయ్యుంటే... అది కచ్చితంగా బాధాకరమైన పరిణామం అయ్యేది. ఉద్యోగం చేసే భార్య దొరకడం నిజంగా అదృష్టమే. ఒక రకంగా కాదు, అనేక రకాలుగా. ఒక వృత్తిలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొన్న యువకుడు తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు కూడా ఆమెతో చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఇంటికే పరిమితం అయిన మహిళతో పోలిస్తే వర్కింగ్ ఉమన్ భర్తకు మంచి సలహాదారుగా ఉండే అవకాశం ఉంది. ఆఫీస్ రాజకీయాలను చవిచూసిన ఆమె కచ్చితంగా మంచి జీవిత భాగస్వామి కాగలదు. ఆర్థికంగా కూడా ఆమె అందించే సహకారం అంతా ఇంతా కాదు. ప్రస్తుత నగర జీవితంలో భార్య కూడా ఉద్యోగం చేయడం సదుపాయవంతమైన జీవితాన్ని గడపడానికి బాటలు వేస్తుంది. ఆమె కూడా సంపాదన పరురాలు అయితే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం లభిస్తుంది. పనిచేస్తున్న ఆమె ప్రపంచాన్ని తెలుసుకోగలదు. ఏ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి... హాలీడే ట్రిప్‌కు ఎక్కడకు వెళ్లవచ్చు... లాంటి విషయాలను ఆమె ఎంతో ఆసక్తితో తెలుసుకొంటుంది. ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ పెంపొందడానికి ఆమెకున్న అవగాహన కూడా ఒక సాధనం అవుతుంది. ఉద్యోగం చేసే అమ్మ పెంపకంలో పెరిగిన పిల్లలలో కొన్ని స్వతంత్ర భావాలు పెరుగుతాయి. అమ్మాయిలకు తల్లి రోల్‌మోడల్ అవుతుంది. ప్రతి విషయంలోనూ భార్య తన మీద ఆధారపడటం కూడా ఒక్కోసారి భర్తకు కొత్త తలనొప్పి కావచ్చు. అయితే ఉద్యోగం చేసే భార్య చాలా వరకూ ఈ విషయంలో రిలీఫ్‌ను ఇస్తుంది. ఇన్ని లాభాలున్నాయి చూశారా! వీటిని స్వార్థంగా తీసుకొని అయినా మనం వర్కింగ్ ఉమెన్‌కు మద్దతుగా నిలవాలి. ఆమె సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవాలి. భార్య ఉద్యోగం చేయడం వల్ల వేడి వేడి ఫుల్కాలు తినలేకపోవచ్చు. అయితే ఆమె ఉద్యోగం చేయడం వల్ల ఆర్థికంగా ముందంజలో నిలస్తుంది. తద్వారా దేశం అభ్యున్నతిని సాధిస్తుంది...’’ అంటూ చేతన్ విశ్లేషిస్తాడు. చేతన్ నవలల్లో హీరోయిన్లు తెలివైన వాళ్లు. నిజజీవితంలో అలాంటి తెలివైన వాళ్లతో ఇన్ని సౌలభ్యాలున్నాయని స్త్రీ సాధికారతకు జై కొడుతున్నాడు.