నాగరిక ప్రపంచంలో వివక్షకు తావులేదు. ఆడ, మగ అనే తేడా చూపడం నైతిక సూత్రాల ప్రకారమే కాదు, చట్ట ప్రకారమూ ముమ్మాటికీ నేరమే. బాలికలకు విద్యను నిరాకరించడం, వారికి చదువుకొనే అవకాశాలు దూరం చేయడం రాక్షసత్వమే అనిపించుకుంటుంది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్‌లో ఇప్పుడు అచ్చంగా అలాంటిదే జరుగుతోంది. కేవలం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని విష వాయువుల ప్రయోగానికి పాల్పడుతున్నారు.
ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు దుండగుల దుశ్చర్యపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతోందో తెలియక వణికిపోతున్నారు. సమాజంలో అశాంతి నెలకొంటోంది. విష వాయువుల ప్రయోగాల గుట్టును రట్టు చేస్తామని, దోషులను కచ్చితంగా శిక్షిస్తామని ఇరాన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం కొంత ఊరట కలిగిస్తోంది.
రగిలిన ఉద్యమం..
ఇరాన్‌లో 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. బాలికలు, యువతులపై ఆంక్షలన్నీ దాదాపుగా తొలగిపోయాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి నిర్భయంగా చదువుకుంటున్నారు. పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్ తరహా పరిస్థితులు ఇరాన్‌లో లేవు. బాలికల విద్యాభ్యాసాన్ని, మహిళలు ఉద్యోగాలకు వెళ్లడాన్ని తాలిబన్ ప్రభు త్వం నిషేధించడం పట్ల ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పద్ధతి మార్చుకోవాలని, మహిళలపై ఆంక్షలు ఎత్తివేయాలని తాలిబన్ పాలకులను హెచ్చరించింది కూడా. అలాంటిది ఇరా న్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తలపై బురఖా సక్రమంగా ధరించనందుకు 22 ఏళ్ల మహసా అమీనీ అనే యువతిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధించారు. చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. మూడు రోజులపాటు కోమాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అమీనీ సెప్టెంబర్ 16న మృతి చెందింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు, యువతులు, బాలికలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. నైతిక నియమావళి పేరిట తమను అణగ దొక్కుతున్నారని, గొంతు నొక్కు తున్నారని, హక్కులు హరిస్తున్నారని ఆరోపిస్తూ నెలల తరబడి ఆందోళన కొనసాగించారు. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని నినదించారు. వారి ఆందోళన మహోగ్ర ఉద్యమంగా మారింది. మహిళల ఉద్యమం పట్ల ప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మహిళలంతా శాంతించాలని కోరింది.
ముష్కరుల ఉద్దేశం అదేనా!
మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, దిగి వచ్చేలా చేయడం మతోన్మాదులకు, పిడివాదులకు కంటగింపుగా మారింది. బాలికలను విద్యాసంస్థ లకు వెళ్లకుండా, చదువుకోకుండా చేయడమే లక్ష్యంగా కుతంత్రానికి తెరలేపారు. భయభ్రాంతులకు గురిచేసి, ఇళ్లకే పరిమితం చేయడానికి విష వాయువుల ప్రయోగం అనే దొంగదారిని ఎంచుకున్నారు. విద్యార్థినులెవరూ రాకపోతే పాఠశాలలు మూతపడతాయన్నది వారి ఉద్దేశం. ముసుగులు ధరించి, తరగతి గదుల్లోకి హఠాత్తుగా ప్రవేశించడం, విష వాయువులు వదిలి, క్షణాల్లో మాయం కావడం.. కుట్ర మొత్తం ఇలా సాగింది.
జరిగింది ఇదీ..
► ఇరాన్‌లో 30 ప్రావిన్స్‌లు ఉండగా, 21 ప్రావిన్స్‌ల్లో 50కి పైగా పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు జరిగాయి.
► గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా 50కి పైగా పాఠశాలల్లో 700 మంది విద్యార్థినులు ఈ ప్రయోగాల బారినపడినట్లు ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. అయితే, ఇప్పటివరకూ ఎవరూ
ప్రాణాలు కోల్పోలేదు.
► బాధితుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
► తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. బాధితులు కాళ్లు, కడుపులో నొప్పితో విలవిల్లాడారు.
► కొందరిలో అవయవాలు తాత్కాలికంగా మొద్దుబారిపోయినట్లు వెల్లడయ్యింది.
► దుండుగులు ప్రయో గించిన వాయువులు
► కుళ్లిన నారింజ పండ్ల వాసన, క్లోరిన్ వాసన, టాయ్‌లెట్లు శుభ్రం చేసుకొనే రసాయనాల వాసన వచ్చినట్లు బాధితులు చెప్పారు.
► ఫాతిమా రెజై అనే 11 బాలిక విష ప్రయోగం కారణంగా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇన్ఫెక్షన్ వల్లే మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు, చికిత్స అందించిన డాక్టర్ చెప్పారు.
క్షమించరాని నేరం
ఇరాన్ పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు అంతర్జాతీయంగా సంచలనాత్మకంగా మారాయి. బాలికలపై విష వాయువులు ప్రయోగించడం క్షమించరాని నేరమని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ చెప్పారు. గుర్తుతెలియని ముష్కరులు ఉద్దేశపూర్వ కంగానే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని, వారిని బంధించి, చట్టం ముందు నిలబెడతామని, కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. బాలికలపై ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏకంగా మానవత్వంపై జరిగిన నేరమేనని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తేల్చిచెప్పారు.
డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తే శిక్షించాల్సిందే
ఇరాన్ న్యాయ వ్యవస్థ అధినేత ఘోలామ్‌హుస్సేన్ మొహసెనీ ఏజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన మహిళలను కఠినంగా శిక్షించాలని అన్నారు. మహిళలు హిజాబ్ తొలగించడం ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల, దాని విలువల పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించడంతో సమానం అవుతుందని చెప్పారు. అలాంటి అసాధారణ చర్యలకు పాల్పడేవారు శిక్షకు గురికాక తప్పదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment