సాక్షి, న్యూఢిల్లీ: బెనారస్ హిందూ యూనివర్సిటీలో తొలి మహిళా చీఫ్ ప్రొక్టార్‌గా నియమితులైన రోయనా సింగ్ విద్యార్థినుల స్వేచ్ఛను హరించే నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. దుస్తులు, ఆల్కహాల్‌పై అమ్మాయిలకు ఎలాంటి నియంత్రణలు ఉండవని తేల్చిచెప్పారు. క్యాంపస్ మెస్‌ల్లో మాంసాహారంపై నిషేధాన్ని తోసిపుచ్చారు. ‘నేను యూరప్‌లో పుట్టా... తరచూ యూరప్, కెనడాలను సందర్శిస్తా విద్యార్థినుల వేషధారణపై నియంత్రణలు విధిస్తే నాపై నేను విధించుకున్నట్టే’ అని రోయనా సింగ్ అన్నారు. తమకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులను వేసుకోలేకపోతే అంతకన్నా సిగ్గుచేటు ఇంకేముందని ఆమె ప్రశ్నించారు. అమ్మాయిల దుస్తులపై అబ్బాయిల కామెంట్లను నిరసిస్తూ.. అమ్మాయిలు వారికి సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే వారికి అభ్యంతరం ఎందుకని నిలదీశారు.
బెనారస్ యూనివర్సిటీ ఎన్నడూ అమ్మాయిలపై నియంత్రణలు విధించలేదని, భవిష్యత్‌లోనూ విధించబోదని ఆమె పేర్కొన్నారు. ఇక మద్యం విషయానికి వస్తే ఇక్కడున్న అమ్మాయిలంతా 18 ఏళ్లు పైబడిన వారేనని, వారిలో అసలు ఈ ఆలోచనలను ఎందుకు రేకెత్తించాలని అన్నారు. వర్సిటీలో ఈవ్‌టీజింగ్, రౌడీయిజం వంటి అవలక్షణాలను పారదోలేందుకు కఠిన చర్యలు చేపడతామన్నారు. క్యాంపస్ అంతటా సీసీ టీవీ కెమెరాలను అమరుస్తామని చెప్పారు.