సైనా నెహ్వాల్, పీవీ సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్....అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ జాబితా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ఎక్కడ బ్యాడ్మింటన్ టోర్నీ జరిగినా మన ఆటగాళ్లదే హవా. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున సాధించే పతకాలన్నీ మన రాష్ట్ర క్రీడాకారులు అందించినవే. సీనియర్ స్థాయిలో ఒలింపిక్ మెడల్ వరకు మన ప్రభ వెలిగితే...జూనియర్ స్థాయిలోనైతే అనేకానేక విజయాలు దక్కాయి. ఒక వైపు స్టార్ ప్లేయర్లు తమ జోరును కొనసాగిస్తుంటే...మరో వైపు వర్ధమాన, యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. గత కొన్నేళ్లుగా మన వద్ద బ్యాడ్మింటన్ ఒక్కసారిగా పాపులర్ క్రీడగా మారిపోయింది. ఆట నేర్చుకునేందుకు, మెరుగుపర్చుకునేందుకు అవకాశాలు పెరగడం కూడా అందుకు కారణం. మన రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ అకాడమీలు, కేంద్రాల్లో బ్యాడ్మింటన్‌లో చక్కటి శిక్షణ లభిస్తోంది. మన రాష్ట్రంలో ఈ ఆటలో అందుబాటులో ఉన్న శిక్షణా సౌకర్యాలపై ఒక దృష్టి...
- మొహమ్మద్ అబ్దుల్ హాది
పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ...
దేశవ్యాప్తంగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ నంబర్‌వన్‌గా ఉన్న అకాడమీ ఇది. వివిధ అంతర్జాతీయ టోర్నీలలో సంచలన విజయాలు సాధిస్తూ రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెస్తున్న ఆటగాళ్లంతా ఇక్కడ శిక్షణ పొందుతున్నవారే. భారత జట్టు చీఫ్ కోచ్ గోపీచంద్ నేతృత్వంలో సైనా, సింధు, కశ్యప్‌లాంటి ఎందరో ఆటగాళ్లు వరుస విజయాలు సాధించారు. అనేక మంది వర్ధమాన షట్లర్లు ఇక్కడినుంచే వెలుగులోకి వస్తున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, కోర్టులు, శిక్షణతో ఈ అకాడమీ తిరుగులేని ఫలితాలు కనబరుస్తోంది.
ప్రవేశం
గోపీచంద్ అకాడమీలో ప్రధానంగా అగ్రశ్రేణి ఆటగాళ్లే శిక్షణ పొందుతున్నారు. ప్రాథమిక లేదా జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచినవారు ఇక్కడ చేరితే మరింత మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. వారి పూర్వ ప్రదర్శనను బట్టి ఇక్కడ ప్రవేశానికి అవకాశం ఉంటుంది. మరోవైపు పూర్తిగా కొత్తవారికి కూడా పరిమిత సంఖ్యలో శిక్షణ లభిస్తుంది. అయితే అందుకోసం ఇక్కడి నిపుణులైన కోచ్‌లు నిర్దేశించిన ప్రమాణాలు అందుకోవాల్సి ఉంటుంది. వారి ప్రాథమిక పరిజ్ఞానం, చురుకుదనాన్ని బట్టి ఎంపిక చేస్తారు. వివరాలకు గచ్చిబౌలిలోని అకాడమీ కేంద్రంలో సంప్రదించవచ్చు.
నంద్యాల అకాడమీ...
జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో ఈ ప్రైవేట్ అకాడమీ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఈ అకాడమీకి చెందిన ఆటగాళ్లు నిలకడగా విజయాలు సాధిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో నంది పైప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రైవేట్ అకాడమీలో ప్రస్తుతం 60 మంది ఆటగాళ్లకు ఇద్దరు కోచ్‌లు శిక్షణనిస్తున్నారు. ఇతర వివరాలకు నంది స్పోర్ట్స్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఇతరత్రా...
మే నెలలో కొత్తగా మరో 3 ప్రైవేట్ బ్యాడ్మింటన్ అకాడమీలు అందుబాటులోకి రానున్నాయి. పుల్లెల గోపీచంద్ సహకారంతోనే, చిట్టూరి సుబ్బారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కొత్తగా అకాడమీ ప్రారంభం కానుంది. గతంలో శాప్‌లో కోచ్‌గా పని చేసిన గోవర్ధన్ హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాల్లో (షేక్‌పేట్, ఏఎస్‌రావునగర్)లలో కొత్తగా అకాడమీలను ప్రారంభిస్తున్నారు. మరో వైపు దిగ్గజ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఎస్‌ఎం ఆరిఫ్ కూడా అకాడమీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఏడాది తర్వాత ఇది నగరంలోని బండ్లగూడలో పూర్తి స్థాయిలో ఏర్పాటు కావచ్చు.
ప్రభుత్వం తరఫున...
ఖమ్మం శాప్ అకాడమీ
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ పూర్తి స్థాయిలో హాస్టల్ సదుపాయంతో నిర్వహిస్తున్న ఒకే ఒక బ్యాడ్మింటన్ అకాడమీ ఖమ్మంలో ఉంది. ఇక్కడినుంచి కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో షట్లర్లు వెలుగులోకి వచ్చారు. 12-18 ఏళ్ల మధ్య వయసువారికి అవకాశం కల్పిస్తారు. గరిష్టంగా 20 మందిని తీసుకుంటారు. ఒక కోచ్ అందుబాటులో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ఎంపిక చేయడంతో పాటు అప్పటికే జూనియర్ స్థాయిలో రాణిస్తున్న చిన్నారులను అకాడమీలోకి తీసుకుంటారు. అయితే గత కొన్నాళ్లుగా టాలెంట్ సెర్చ్ కార్యక్రమం నిలిచిపోయింది. సాధారణంగా జూన్‌లో ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలకు ఖమ్మంలోని జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో గానీ హైదరాబాద్‌లోని శాప్ ప్రధాన కార్యాలయంలో గానీ సంప్రదించవచ్చు.
స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ (సరూర్‌నగర్)
రాజధాని నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో ఒక బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 50 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే హాస్టల్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ అకాడమీలో 12-18 ఏళ్ల మధ్య వయసు ఆటగాళ్లను కోచింగ్ కోసం ఎంపిక చేస్తారు. ముగ్గురు కోచ్‌లు పని చేస్తున్నారు. కనీసం జిల్లా స్థాయిలో ఆడిన షట్లర్లను వివిధ దశల్లో వడపోతల అనంతరం ఎంపిక చేస్తారు. అయితే పూర్తిగా కొత్తగా ఉండే లెర్నర్స్‌ను కూడా 6-8 ఏళ్ల మధ్య వయసు వారిని ఎంపిక చేసి శిక్షణనిస్తారు. వివరాలకు సరూర్‌నగర్ స్టేడియంలో సంప్రదించవచ్చు.
ఎల్బీ స్టేడియం...
శాప్ ప్రధాన కార్యాలయం ఉన్న లాల్‌బహదూర్ స్టేడియంలో కూడా బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి ఇండోర్ స్టేడియంలో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. బేసిక్స్ నేర్చుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో ఆడుతున్న ప్రొఫెషనల్స్ కూడా ఇక్కడ సాధన చేస్తారు. ఎల్బీ స్టేడియంలో పే అండ్ ప్లే పద్ధతిలో ప్రవేశం పొందవచ్చు. ఈ చిన్నారులకు శాప్ నియమించిన కోచ్ శిక్షణ ఇస్తారు. శాప్ పరిధిలోని యూసుఫ్ గూడ ఇండోర్ స్టేడియంలో కూడా పే అండ్ ప్లే పథకం కొనసాగుతోంది. అయితే ఎల్బీ స్టేడియంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో కోచ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి గలవారు స్టేడియం అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించవచ్చు.
విజయవాడలో....
ఒకప్పుడు అత్యుత్తమ క్రీడాకారులను అందించిన విజయవాడలో ఇప్పుడు బ్యాడ్మింటన్ కళ తప్పింది. కొన్నాళ్ల క్రితం చేతన్ ఆనంద్ అకాడమీని ప్రారంభించినా... వివిధ కారణాలతో అందులో శిక్షణ ఆగిపోయింది. ప్రస్తుతం మున్సిపల్ స్టేడియంలో చిన్నారులకు కోచింగ్ కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున ఇక్కడ ఒక కోచ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్నారులకు ఆటలో బేసిక్స్ నేర్పించేందుకు అవకాశం ఉంది.
‘షటిల్’ స్పీడ్‌తో....
Published Fri, May 9 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement
Advertisement