జీవితం ఓ యుద్ధం! | puri jagannadh top 5 serket | Sakshi
Sakshi News home page

జీవితం ఓ యుద్ధం!

Published Sun, Jan 26 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

జీవితం ఓ యుద్ధం!

జీవితం ఓ యుద్ధం!

పూరి... చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ మాట్లాడిన ప్రతి మాటలోనూ కంటెంట్ ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. పూరి... విజయాల కంటే పరాజయాల నుంచే ఎక్కువ నేర్చుకున్నాడు. ఒకప్పుడు చిన్న చెరువులాగా... నదిలాగే ఉండేవాడు. ఇప్పుడు తనో సముద్రం. ఆ కెరటాల గుండె చప్పుడుని డీకోడ్ చేస్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. పూరి థాట్ ప్రాసెస్‌ని మలుపు తిప్పిన ‘5’ అంశాలు ఓసారి క్లోజప్‌లో...
 
 నా దృష్టిలో వేరే వాళ్ల కోణంలో ఆలోచించడమే జ్ఞానం!
 పుస్తకం: చందమామ
 చిన్నప్పుడు చందమామ బాగా చదివేవాణ్ణి. అందులో ఇష్టమైన కథలు చాలా ఉన్నాయి కానీ, ఐదవ తరగతిలో చదివిన ఒక కథ నన్ను బాగా ప్రభావితం చేసింది...
 ఓ పల్లెటూరు. అక్కడో వ్యక్తి. బుర్ర నిండా జ్ఞానాన్ని నింపుకోవాలన్నది అతని కల. అందుకే హిమాలయాల దారి పట్టాడు. ఒకటీ రెండూ కాదు... 40 ఏళ్లు అక్కడే ఉండి  బోలెడంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ఊళ్లోవాళ్లతో పంచుకోవాలనుకుని, సొంత ఊరికి బయలుదేరతాడు. ఊరి మొదట్లోనే అతనికి ఓ కసాయివాడు మేకను నరుకుతూ కనిపిస్తాడు. ఆ జ్ఞానికి మనసు ఊరుకోలేదు. ‘‘నాయనా.. జీవహింస మంచిది కాదు. నువ్వు వచ్చే జన్మలో మేకవై పుడతావు. అది మనిషై పుట్టి, నిన్నూ ఇలాగే హింస పెడుతుంది. అందుకే ఇలాంటి పనులు మానేసేయ్’’ అని హితబోధ చేస్తాడు. అప్పుడా కసాయివాడు ‘‘మీరు చెప్పిన లెక్క ప్రకారం గతజన్మలో వీడు నన్నిలాగే నరికేసుంటాడు. అందుకే రుణం తీర్చుకుంటున్నాను... ఇదో సైకిల్. డోన్ట్ వర్రీ’’ అని  చెప్తాడు. ఆ మాటలకు జ్ఞాని అవాక్కవుతాడు! ఓ మామూలు కసాయి వాడికున్న ఇంగితజ్ఞానం కూడా ఇంత సాధన చేసిన తనకు లేనందుకు సిగ్గుపడతాడు ఆ జ్ఞాని.  ఎందుకో ఈ కథ ఆ వయసులో నాకు బాగా ఆనింది! ఓ రకంగా చెప్పాలంటే... నా దృక్పథాన్ని మార్చింది! మనమెప్పుడూ మన పాయింటాఫ్ వ్యూలోనే ఆలోచిస్తాం. వేరే వాళ్ల కోణంలో ఆలోచించడమే జ్ఞానం!
 
 ప్రశాంతంగా ఉన్న నా చెరువులో బండరాళ్లు వేసింది వీళ్లే!
 వ్యక్తి: ఒకరు కాదు ఐదుగురు!
 నా థాట్ ప్రాసెస్ మారడానికి కారణమైన వ్యక్తులు ఇద్దరు. ఒకరు రజనీష్, ఇంకొకరు రామ్‌గోపాల్‌వర్మ. వీళ్లిద్దరూ మంచి చెబుతారో, చెడు చెబుతారో నాకైతే తెలీదు కానీ... అవతలి వాళ్లని డిస్ట్రబ్ చేయగలరు. మనం డిస్ట్రబ్ అయితే కానీ, ఎప్పుడూ బుర్రపెట్టి ఆలోచించం. అదర్ యాంగిల్ నుంచి ఆలోచించడం ఎలానో వీరిద్దరి దగ్గరనుంచీ నేర్చుకున్నాను. ఎందుకంటే ఇద్దరూ రెబల్సే. ప్రశాంతంగా ఉన్న నా చెరువులో పెద్ద పెద్ద బండరాళ్లు వేసి డిస్ట్రబ్ చేసింది వీళ్లిద్దరే. అలా వీళ్లుగాక నన్ను డిస్ట్రబ్ చేసినవాళ్లు ఇంకో ముగ్గురు ఉన్నారు.   శ్రీశ్రీ- ఆయన పొయిట్రీ చదువుతుంటేనే మనమో అగ్నిపర్వతంలా మారిపోతాం. ముఖ్యంగా ‘మహాప్రస్థానం’. ఎన్నిసార్లు చదివినా అదే ఫీలింగ్!  
  చలంగారు- ‘మైదానం’ అయితే ఓ విప్లవమే!   ముప్పాళ్ల రంగనాయకమ్మగారు- ‘రామాయణ కల్పవృక్షం’ 40 ఏళ్ల క్రితమే చాలా డేరింగ్‌గా రాశారు. నాకు తెలిసి ఇండియాలో అంతటి రెబల్ లేడీ రైటర్ ఎవ్వరూ లేరు! వీళ్లందరి ప్రభావం నాపై చాలా ఉంది.
 
 ప్రేక్షకుణ్ణి అసహనానికి గురిచేయకూడదని తెలుసుకుంది ఆరోజే!
 సంఘటన: ‘బద్రి’ రిలీజ్ రోజు
నా తొలి సినిమా ‘బద్రి’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. సెకండాఫ్‌లో కొంత ఫుటేజ్ ఎక్కువ అనిపించింది. అయినా పర్లేదనుకుని ఎడిటింగ్ చేయకుండానే రిలీజ్ చేసేశాం. థియేటర్‌లో పబ్లిక్‌తో కూర్చుని చూస్తుంటే, నేను ఎక్కడైతే లెంగ్త్ ఎక్కువైందనుకున్నానో సరిగ్గా అక్కడే ప్రేక్షకులు గొల్లుమని  అసహనంతో అరిచారు. ఒకరిద్దరు సిగరెట్ తాగడానికి బయటకు వెళ్లిపోయారు. నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత ఫీలింగ్ వచ్చింది. అప్పటివరకూ అంత మంచిగా సినిమా తీశాడు కదా అని ప్రేక్షకులు ఏమాత్రం ఎక్స్‌క్యూజ్ చేయరు. అసలే బయట లక్షాతొంభై టెన్షన్లతో వేగుతూ ఉండే ప్రేక్షకుడు థియేటర్‌కు రావడమే ఎక్కువ. అలాంటి ప్రేక్షకుణ్ణి అసహనానికి గురి చేయకూడదన్నది ఆ రోజు తెలుసుకున్నాను! అందుకే నా సినిమాలెప్పుడూ ప్యాక్డ్‌గా ఉంటాయి. ఇంతటి చిన్న ఇన్సిడెంట్ కూడా వృత్తిపరంగా నాకంతటి గొప్ప పాఠం నేర్పింది!
 
 ఇక్కడ మంచితనమూ ఆయుధమే, దుర్మార్గమూ ఆయుధమే!
 కోట్: 'All is fair in war'
 యుద్ధంలో ఏదైనా సమంజసమే- అన్న ఈ కోట్‌ని నా హార్ట్‌లో, మైండ్‌లో పర్మినెంట్‌గా స్టోర్ చేసుకున్నా! జీవితంలో ఏం జరిగినా యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నా! జీవితం ఓ యుద్ధం. దేవుడు మనల్ని వార్‌జోన్‌లో పడేశాడు. ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. నా దృష్టిలో...
 ఇతర జంతువులనుంచి రక్షించుకోవడానికి ఆయుధం పుట్టింది.
 ఎండా వానల నుంచి రక్షించుకోవడానికి ఇల్లు పుట్టింది.
 ప్రకృతి నుంచి తప్పించుకోవడానికి వైద్యం పుట్టింది.
 మనిషి నుంచి మనిషిని కాపాడుకోవడానికి మానవత్వం పుట్టింది.
 నిస్సహాయత నుంచి దైవం పుట్టింది.
 
 ఇక్కడ మంచితనమూ ఆయుధమే. దుర్మార్గమూ ఆయుధమే! ఏదో ఒక పేరు చెప్పుకుని మనల్ని మనం కాపాడుకోవాలి... లేకపోతే మనల్ని చంపేస్తారు!
 
 నా హీరోల క్యారెక్టర్లు స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం ఆ నాయకుడే!
 సినిమా: నాయకుడు
 డిగ్రీలో ఉండగా అనకాపల్లిలో చూశాను ఈ  సినిమా. చూసింది రెండుసార్లే కానీ, ఇప్పటికీ ప్రతి సీనూ గుర్తుంది. ఈ సినిమాలో కమల్‌హాసన్ చేసిన వీరినాయుడు క్యారెక్టర్ నన్ను బాగా ప్రభావితం చేసింది.  ఇందులో వీరినాయుడు చేసేవన్నీ సంఘవ్యతిరేక కార్యకలాపాలే! చిత్రమేంటంటే అవన్నీ మనకు పాజిటివ్‌గా అనిపిస్తాయి. ‘పదిమందికి మేలు చేసే పని ఎప్పుడూ తప్పు కాదు’ అని వీరినాయుడు తండ్రి ఓ డైలాగ్ చెబుతాడు. దాంతో మనం కన్విన్స్ అయిపోయి, వీరినాయుడి పాత్రలో లీనమైపోతాం. స్ట్రగుల్స్, రకరకాల ఫేజ్‌లతో ఆ పాత్రకో స్ట్రాంగ్ మెంటాల్టీ ఏర్పడింది. అదే నన్ను ఇన్‌స్పయిర్ చేసింది. నా సినిమాల్లో హీరో క్యారెక్టర్లు స్ట్రాంగ్‌గా ఉండటానికి కారణం ఈ సినిమానే!
 
 - సంభాషణ: పులగం చిన్నారాయణ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement