మనీషికి పుష్కరస్నానం | Puskarasnanam to man | Sakshi
Sakshi News home page

మనీషికి పుష్కరస్నానం

Published Mon, Jul 13 2015 11:40 PM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM

మనీషికి పుష్కరస్నానం - Sakshi

మనీషికి పుష్కరస్నానం

కాశీకి వెళ్లి గంగానదిలో స్నానం చేసేవాళ్లు అక్కడ తమకు ఇష్టమైనదేదైనా వదిలేసి రావడం మన సంప్రదాయం. పుష్కరాల్లో ఇలాంటి సంప్రదాయం ఏదీ లేదు గానీ, పుష్కరాలు జరిగే ఈ పన్నెండు రోజుల్లోనూ మన దుర్గుణాల్లో ఒక పన్నెండింటిని వదులుకుందాం. మన పాపాలను పుష్కరస్నానాలు కడిగేస్తాయి. మన మనసులోని మాలిన్యాలను మనం కడిగేసుకుందాం. ఈ మనోస్నానం మనిషిని మనీషిగా మారుస్తుంది.
 
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు పన్నెండు రోజుల పాటు జరుగుతాయి. పుష్కరాల ముఖ్యోద్దేశాలు.. పాప ప్రక్షాళన, పితృదేవతల సంస్మరణ. అయితే, మన జీవితాలను మనం ఏమాత్రం తీర్చిదిద్దుకోకుండా, మన లోపాలను మనం ఏమాత్రం సవరించుకోకుండా, మన పాపాలను మనం ఏమాత్రం మానుకోకుండా ఎంతటి పవిత్రనదిలో మునకలేసినా ఫలితం ఏముంటుంది? మన జీవితాలను పవిత్రంగా తీర్చిదిద్దుకుందాం. మనలో సర్వ సాధారణంగా కనిపించే, పుష్కరాల్లో మనం కడిగేసుకోవలసిన కొన్ని అవలక్షణాలు ఇవి..
 
 
జీవహింస
వినోదం కోసమో, మానసిక సంతృప్తి కోసమో జీవహింసకు పాల్పడటం చాలామందికి అలవాటు. ఇదంత మంచి లక్షణం కాదు. అయినా, మనలో ఎంతోమంది మూగజీవాలను హింసించడాన్ని ఘనకార్యంగా భావిస్తుంటారు. మూగ జీవాలనే కాదు, మితిమీరిన అహంకారంతో, అదుపులేని ఆగ్రహంతో, అధికార బలగర్వంతో తమ కంటే బలహీనులైన సాటి మనుషులనూ హింసించేవారు లేకపోలేదు. భౌతికంగా, మానసికంగా బలహీనులను హింసించి ఆనందించే లక్షణాన్ని మానసిక రుగ్మతగా పరిగణిస్తారు. అందువల్ల హింసను విడనాడదాం. ‘అహింసో పరమో ధర్మః’ అనే ఆర్యోక్తిని త్రికరణ శుద్ధిగా పాటిద్దాం.
 
 వంచన
 ఆధునిక కాలంలో మనుషులు వంచనాశిల్పంలో ఆరితేరిపోతున్నారు. చిన్న చిన్న చిల్లర మోసాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే పెద్దపెద్ద కుంభకోణాల వరకు వంచన మన జీవనశైలిలో భాగంగా మారిపోయింది. మోసానికి గురైనప్పుడు మనం ఎంతగా బాధపడతామో, మనం మోసగిస్తే ఎదుటి వారూ అంతే బాధపడతారు. వంచనకు పాల్పడేవారికి తాత్కాలిక ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు గానీ, వంచనకు గురైన వారు మాత్రం జీవితాంతం కుమిలిపోతూనే ఉంటారు. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి, మన వంచనాశిల్ప
 నైపుణ్యాన్ని గోదారిలో విడిచేద్దాం.
 
అబద్ధం
అవసరం ఉన్నా, లేకున్నా అబద్ధాలాడనిదే పూటగడవదు చాలామందికి. విపత్కర పరిస్థితుల్లో అబద్ధం ఆడటం తప్పుకాదని ‘శుక్రనీతి’ చెబుతున్నా, అంతటి విపత్తులేవీ లేకుండానే, అనవసరంగా చెబుతున్న అబద్ధాలే ఎక్కువగా ఉంటున్నాయి. జనాభాలో అరవై శాతం మంది అబద్ధాలాడకుండా పట్టుమని పది నిమిషాలైనా ఉండలేరని మెసచుసెట్స్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. అబద్ధాలాడే వారు సాధించేది ఏమీ లేకపోగా, సమాజంలో తమ విలువనే కోల్పోతారు. అబద్ధాలను
 గోదావరిలో వదిలేద్దాం. ‘నిజం’గా నిఖార్సయిన జీవితాన్ని జీవిద్దాం.
 
తారతమ్యం
ఎదుటి వ్యక్తిని సాటి మనిషిగా గుర్తించి, సమాదరించే సంస్కారం చాలామందిలో కొరవడుతోంది. కుల మత ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఎదుటివాళ్ల పట్ల చూపే గౌరవ మర్యాదలలో తారతమ్యాలను పాటించడం తరతరాలుగా కొనసాగుతున్న సామాజిక రుగ్మత. ఈ రుగ్మత నయం కావాలంటే, ఒక సంస్థకు యజమాని అయినా, ఆ సంస్థలో అతి చిన్న ఉద్యోగి అయినా..ఏ స్థాయికి చెందిన వారైనా ఎదుటి వ్యక్తులను సాటి మనుషులుగా గౌరవించడాన్ని అలవాటుగా చేసుకుంటే చాలు. పవిత్ర గోదావరిలో మనుషుల మధ్య తారతమ్యాలను త్యజిద్దాం.
 
రుణభారం
మన జన్మలో మనకు తటస్థించే వాటన్నింటికీ రుణానుబంధాలే కారణమనేది మన సనాతన విశ్వాసం. అలాగని రుణభారంలో కూరుకుపోతే మాత్రం మన బతుకులు దా‘రుణం’గా తయారవుతాయి. మన సమాజంలో ఒప్పుల కుప్పలు అరుదుగా తప్ప కనిపించరు గానీ, అప్పుల కుప్పల్లాంటి అప్పారావులు అడుగడుగునా కనిపిస్తారు. చేతిలో క్రెడిట్‌కార్డులు ఉన్నాయి కదా అని, ఆర్థిక శక్తికి మించి ‘అప్పుచేసి పప్పుకూడు’ తినాలనే ధోరణి అంత క్షేమం కాదు. అలాంటి అప్పుల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. రుణభార విముక్తి కోసం పుష్కరాలలో సంకల్పం
 చెప్పుకుందాం.
 
అసూయ
మనశ్శాంతిని కరువు చేసే అవలక్షణాల్లో అసూయ ఒకటి. ఎదుటివారి ఉన్నతికి ఓర్వలేక అసూయతో రగిలిపోతూ ఉంటారు కొందరు. ఉన్నతిని కోరుకోవడం, అందుకు ప్రయత్నించడంలో ఎలాంటి తప్పులేదు గానీ, ఇతరుల ఉన్నతిని చూడలేకపోవడం అంత మంచిది కాదు. అసూయ ముదిరితే అదే అనారోగ్యానికి దారితీస్తుంది. అధిక రక్తపోటు, నిద్రలేమి వంటి జబ్బులు రావడానికి అసూయ కూడా ఒక కారణం. మానసిక ప్రశాంతతను పూర్తిగా హరించే అసూయను పుష్కర స్నానంతో
 కడిగేసుకుందాం.
 
వృథా
ప్రకృతి వనరులను వృథా చేయడం మనలో చాలామందికి ఉన్న పాడు అవలక్షణం. తిండిని, నీటిని ఇష్టానుసారం వృథా చేస్తాం. అవసరానికి మించి తినడం, భుక్తాయాసంతో తినలేని స్థితిలో తిండిని వృథా చేయడం రెండూ నైతిక నేరాలే! మనం తిరిగి సృష్టించలేని ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వృథా చేయడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. తిండిని వృథా చేస్తే కొన్ని దేశాలు జరిమానాలు విధిస్తున్నాయి. మన దేశంలో అలాంటి చట్టాలేవీ లేకపోయినా, భావి తరాల సంక్షేమం కోసం పుష్కరాలను పురస్కరించుకుని వనరుల వృథాను మానుకుందాం.
 
చులకన
చాలామందికి జనాలతో సామరస్యంగా మెలగడం తెలియదు. నోటికొచ్చిన మాటలతో తేలికగా ఎదుటి మనిషిని చులకన చేస్తారు. తమ కంటే బలహీనులను, స్త్రీలను మాటలతో గాయపరుస్తారు. భౌతిక గాయాల కంటే, పరుషమైన మాటల వల్ల కలిగే మానసిక గాయాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఎదుటివారు ఏం చేస్తే మనకు బాధ కలుగుతుందో, ఎదుటి వారి పట్ల మనం అలాంటి పని చేయకుండా ఉండటమే అసలు సిసలు ధర్మం అని పురాణాలు చెబుతున్నాయి. గోదారి సాక్షిగా ధర్మ
 వర్తనను అలవరచుకుందాం.
 
పరదూషణ
ఇతరుల గురించి చెడు మాట్లాడటం చాలామందికి అలవాటు. ముఖ్యంగా ఇతరుల పరోక్షంలో వారిని దుర్భాషలాడటం, వారి గురించి చెడు వ్యాఖ్యానాలు సాగించడం ఒకరకమైన మానసిక జాడ్యం. ఇలాంటి మాటలను ఆలకించడమూ మానసిక జాడ్యమే! ఇతరుల పరోక్షంలో మనం వారి గురించి చెడుగా మాట్లాడుతుంటే, మన పరోక్షంలో మన గురించి ఇతరులూ అలాంటి సంభాషణలే సాగిస్తుంటారనే స్పృహతో మెలగడం మంచిది. పరదూషణ వల్ల ఒరిగేదేమీ ఉండదు, పైగా మన సంస్కారరాహిత్యమే బయటపడుతుంది. పుష్కరాల సందర్భంగా మనం సంస్కారాన్ని పెంచుకుందాం.
 
నిరాదరణ

గతించిపోయిన పెద్దలను సంస్మరించుకునే సందర్భం పుష్కరాలు. అయితే, కొందరు ఇంకా జీవించే ఉన్న తమ పెద్దలను నిరాదరణకు గురి చేస్తుంటారు. ముదిమి మీదపడ్డ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలపాలు చేస్తుంటారు. గతించిపోయిన పెద్దలను సంస్మరించుకునే భక్తిశ్రద్ధలు ఉన్నవాళ్లు ఇంకా జీవించే ఉన్న తమ పెద్దలను ఆదరించకపోవడం సరైన పని కాదు. ‘మాతృదేవో భవః పితృదేవో భవః’ అనే ఆర్యోక్తిని చిన్నప్పటి నుంచి నూరిపోసే సమాజంలో పుట్టి పెరిగిన మనం పుష్కరాల సాక్షిగా మన పెద్దలను గౌరవాదరాలతో
 చూసుకుందాం.
 
స్వార్థం

 మనలో సర్వసాధారణంగా కనిపించే అతిపెద్ద అవలక్షణం స్వార్థం. స్వార్థంలో ఎలాంటి పరమార్థం లేకపోగా, అది అనర్థదాయకం అని తెలిసినా, స్వార్థచింతనను ఏమాత్రం మానుకోలేం. స్వార్థప్రయోజనాల కోసం కొందరు ఎంతటి నీచానికైనా దిగజారుతుంటారు. స్వార్థం మితిమీరిన వారు ఇతరులు ఎంతటి ఆపదలో ఉన్నా, ఆదుకోవడానికి ముందుకు రారు. పుణ్య పురుషార్థాలు కోరి చేసే పుష్కర స్నానాల్లో స్వార్థబుద్ధిని వదులుకుని, ఆర్తులను ఆదుకుందాం.
 
 ద్వేషం
 మన పట్ల మనలో మితిమీరి పేరుకుపోయిన అసహనం, కోపం, నిస్సహాయతలే ఎదుటి వారి పట్ల ద్వేషంగా పరిణమిస్తాయి. ప్రపంచంలోని అన్ని మతాలూ ప్రేమను ప్రబోధిస్తుంటే, మనం ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచుకోవడంలో అర్థం లేదు. ముందుగా మనల్ని మనం ప్రేమించుకుంటే, ఇతరులనూ అదేరీతిలో ప్రేమించగలం. ఇతరులను ద్వేషించడం వల్ల మనకే మనశ్శాంతి కరువవుతుంది. మనలోని అలజడిని, అశాంతిని తగ్గించుకుని, ద్వేషాన్ని గోదారిలో విడిచిపెడదాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement