పుష్కరస్నానానికి పుట్టెడు కష్టాలు | Devotees problems at kaleshwaram | Sakshi
Sakshi News home page

పుష్కరస్నానానికి పుట్టెడు కష్టాలు

Published Wed, Jul 15 2015 4:04 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

పుష్కరస్నానానికి పుట్టెడు కష్టాలు - Sakshi

పుష్కరస్నానానికి పుట్టెడు కష్టాలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కిలోమీటర్ల కొద్దీ కాలినడక... తాగడానికి గుక్కెడు నీళ్లు కరువు... నిలుచునేందుకు నీడ లేదు.. ఘాట్లు ఎటు చూసినా బురదమయం... ఆ నీటిలోనే స్నానాలు... బట్టలు మార్చుకునేందుకు కనీసం వసతుల్లేవు.. దైవదైర్శనానికి గంటల తరబడి క్యూ... అడుగడుగునా పోలీసు తనిఖీలు... కాళేశ్వరం, ధర్మపురి ప్రాంతాల్లో పుష్కరస్నానాలకు భక్తులు పడుతున్న పాట్లకు నిదర్శనాలివి. గోదావరిలోకి పుష్కరుడి రాకతో పవిత్ర స్నానమాచరించాలని గంపెడాశతో వేకువజామునే బయలుదేరిన లక్షలాది మంది భక్తులకు బందోబస్తు పేరుతో పోలీసులు, నామమాత్రపు ఏర్పాట్లతో అధికారులు చుక్కలు చూపించారు. పిల్లాపాపలతో, బంధుమిత్రులతో ఎంతో ఉల్లాసంగా పుష్కరాలకు వెళ్లిన భక్తులు నానాపాట్లు పడుతూ స్నానమాచరించి దైవదర్శనం చేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది.

 కాళేశ్వరంలో భక్తుల తిప్పలు
 త్రివేణి సంగమమైన కాళేశ్వరానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని భావించిన పోలీసులు దేవాలయం, పుష్కరఘాట్లకు రెండు కిలోమీటర్ల దూరంలో తాత్కాలిక బస్టాండ్, వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ సహా ప్రైవేటు వాహనాలన్నింటినీ అక్కడే నిలిపివేశారు. వృద్ధులు, మహిళలు, బాలింతలు, వికలాంగులు సహా ప్రతి ఒక్కరూ కాళేశ్వరం వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి రావడంతో చాలా ఇబ్బంది పడ్డారు. తీవ్ర ఎండ, ఉక్కపోత ఉండగా, టెంట్లు, చలువ పందిళ్లు లేక నానాపాట్లు పడ్డారు. చెట్లనీడన సేదదీరారు. ట్యాంకర్లు ఉన్నా నీరు అందించేవారే లేకపోవడంతో తాగునీటికి అల్లాడారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి దండుకున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దర్శనం కూడా కష్టాల నడుమే సాగింది. క్యూలైన్ల వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేక ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయారు.

 5 కిలోమీటర్లు నడిస్తేనే పుష్కర స్నానం
 ధర్మపురి వైపు వచ్చే వాహనాలను పుష్కర ఘా ట్లకు 5కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు నిలి పేశారు. అక్కడి నుంచి ఘాట్ల సమీపానికి ఉచి తంగా వాహనాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా అందుబాటులోకి రాకపోవడం తో వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడ్డారు. పుష్కరాలతో సంబంధం లేకుండా ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలను సైతం కరీం నగర్-జగిత్యాల రహదారిపైనే నిలిపివేయడం తో వారి బాధ వర్ణణాతీతం. అష్టకష్టాలు పడి ఘాట్ల వద్దకు వెళ్తే మురికినీటి స్నానమే దిక్కయింది. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మొబైల్ వాటర్ క్యాన్లతో నీటిని సరఫరా చేశారు.

పురోహితులు సరిపడా లేక భక్తులు వారికోసం వెతుక్కోవాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ ధర్మపురిలోనే ఉండడంతో పోలీసులు అన్నివైపులా బందోబస్తు చేపట్టడంతో భక్తులు ఎటునుంచి వెళ్లాలో తెలియక అవస్థలు పడ్డారు. లక్ష్మీనృసింహస్వామివారి దర్శనానికి నాలుగు గంటలకుపైగా క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. దీంతో చాలా మంది స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు.

 బురదలోనే పుష్కర స్నానం
 గోదావరిఖనిలోని పుష్కరఘాట్ వద్ద నీటి ప్రవాహం లేకపోవడంతో నది మధ్య నుంచి కాలువను తవ్వారు. పుష్కరఘాట్ ఎత్తుప్రాంతంలో ఉండడంతో నీరు రాలేదు. దీంతో మంగళవారం పుష్కరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖలంతా బురదమయంగా మారిన నీటిలోనే పుష్కర స్నానాలు చేయాల్సి వచ్చింది. షవర్లలోనూ బురదనీరే వచ్చింది. భక్తులు నది మధ్యలోకి వచ్చి నీటి ప్రవాహం వద్ద స్నానాలాచరించారు. ఇక్కడ దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయలేదు.

 కోటిలింగాల, మంథనిలోనూ ఇక్కట్లే
 కోటిలింగాలకు తొలిరోజు 15 వేల మందికిపైగా భక్తులు వచ్చినట్లు అధికారుల అంచనా. కొత్తగా కట్టిన స్నానఘట్టాల దగ్గర నీరు లేకపోవడంతో ఇరుకుగా ఉన్న పాత ఘాట్లలోనే భక్తులు పుష్కర స్నానాలు కానిచ్చేశారు. చాలామంది షవర్ల కిందే స్నానాలు చేశారు. పుష్కరఘాట్ల వద్ద ఇనుపజాలీలతో పలువురు గాయపడ్డారు. పిండ ప్రదానానికి వేదిక ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. పాత రేవు పిండ ప్రదానానికి అనుకూలంగా ఉండ గా భక్తులు అక్కడికే వెళ్లగా... అక్కడ స్నానాలు చేయొద్దని పోలీసులు అడ్డుకున్నారు. మంథనిలో తొలిరోజు 30 వేల మంది భక్తులు పుష్కర స్నానమాచరించినట్లు అధికారుల అంచనా. పార్కింగ్ నుంచి ఘాట్ల దాకా రెండు కిలోమీటర్ల మేర  నడవాల్సి వచ్చింది. అరకొర ఏర్పాట్లతో ఇక్కడా భక్తులకు ఇబ్బందులు తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement