అన్నారం బ్యారేజీ ప్రాంతంలోని రహదారిపై పోలీసుల పహారా
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు గోదావరి తీర ప్రాంతమైన మహదేవపూర్ మండలంలో మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైందని ప్రచారం జరుగుతోంది. సోమవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ముగ్గురు మావోయిస్టులు సంచరించారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు కరపత్రాలు వదలడం, ఇన్‌ఫార్మర్లను హతమార్చడం ద్వారా మావోయిస్టులు గోదావరి తీరప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నారు.
కాళేశ్వరంలో ముగ్గురి సంచారం ?
తాజాగా ఈ నెల 5న మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అదే రోజు కాళేశ్వరంలో ముగ్గురు అనుమానితులు సంచరించినట్లు సమాచారం. వారి మాటల ప్రకారం మావోయిస్టులుగా అనుమానించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. అసలు వారు నకిలీలా ? నిజంగా మావోయిస్టులా అనే విషయం కూడా తేల్చేందుకు పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం.
మకాం మార్చిన నాయకులు..
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భూసేకరణలో కీలకపాత్ర పోషించిన వారిపై మావోయిస్టులు గురిపెట్టినట్లు స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అధికార పార్టీ నాయకులను పిలిచి పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అధికారపార్టీ నాయకులంతా హైదరాబాద్, వరంగల్ నగరాలకు మకాం మార్చారు.
భారీ బందోబస్తు..
సరిహద్దులో మావోయిస్టుల సంచారం నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎస్పీ ఆర్.భాస్కరన్ ప్రత్యేక పోలీసు బలగాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాళేశ్వరం బ్యారేజీల వద్ద భద్రతను పటిష్టం చేస్తున్నారు.
మావోయిస్టులు రాలేదు..
సోమవారం సాయంత్రం కాళేశ్వరంలో మావోయిస్టులెవరూ రాలేదు. అనుమానితులు మద్యం తాగినట్లు ఉన్నట్లు తెలిసింది. వారిని మహారాష్ట్రకు చెందినవారిగా స్థానికులు గర్తించారు. మావోయిస్టులు మాత్రం కాదు. బంద్ నేసథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా బ్యారేజీల వద్ద కూంబింగ్ చేస్తున్నాం.
– సీహెచ్.శ్రీనివాస్, ఎస్సై, కాళేశ్వరం
Comments
Please login to add a commentAdd a comment