రంగనాయకసాగర్‌లో ఇసుకాసురులు! | Sand smuggling in the Ranganayaka sagar | Sakshi
Sakshi News home page

రంగనాయకసాగర్‌లో ఇసుకాసురులు!

Published Mon, Apr 30 2018 3:30 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Sand smuggling in the Ranganayaka sagar - Sakshi

రంగనాయకసాగర్‌ ప్రాజెక్టుకు వస్తున్న టిప్పర్లు

చిన్నకోడూరు (సిద్దిపేట): శుక్రవారం ఉదయం.. మానేరువాగు నుంచి ఇసుక నింపుకొని ఓ లారీ బయలుదేరింది.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి ఆ ఇసుకను తరలించాలి. కానీ అది రిజర్వాయర్‌ వద్దకు కాకుండా సిద్దిపేట పట్టణంలోని ఓ బహుళ అంతస్తుల నిర్మాణాలకు చేరింది.. ఇలా ఒక్క లారీ కాదు.. వందలాది లారీల ఇసుక దారి మళ్లుతోంది. ఇసుక తరలింపునకు అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుపై ఉంటాయి.. వాస్తవానికి ఆ ఇసుక తరలివెళ్లేది హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని భారీ భవనాల నిర్మాణాల కోసం. ప్రాజెక్టు కాంట్రాక్టర్లు, లారీల యజమానులు కుమ్మక్కై ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. లారీ ఇసుకను రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నారు. ఇదంతా రెవెన్యూ, నీటిపారుదల, పోలీసు, మైనింగ్‌ అధికారుల దృష్టికి వచ్చినా ‘మామూలు’గానే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. 

చెక్‌పోస్టు దాటితే అంతే.. 
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ శివారులో రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనుల కోసం సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ శివార్లలోని చింతల్‌ఠాణా, కొడుముంజ గ్రామాల వద్ద మానేరు వాగు నుంచి ఇసుకను రవాణా చేస్తున్నారు. రోజుకు 150 టిప్పర్ల మేర ఇసుక రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పేరిట అక్కడి నుంచి బయలుదేరుతుంది. కానీ అందులో 50 ట్రిప్పుల వరకు ప్రైవేటు పనులకు తరలిపోతోంది. సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లోని జిల్లెల్ల వద్ద చెక్‌పోస్టు ఉంటుంది. ఆ చెక్‌పోస్టు దాటగానే ఇసుక దారి మళ్లుతోంది. ఇలా ఇసుక దారి మళ్లించి అమ్ముకొంటూ కాంట్రాక్టర్లు, ప్రాజెక్టు అధికారులు రోజూ లక్షల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. 

ప్రమాదాలకు హేతువుగా..! 
సిరిసిల్ల, సిద్దిపేట మార్గంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణా పరోక్షంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ఇసుక తరలిస్తున్న వాహనాల అతివేగంతో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా రెండు జిల్లాల పోలీసు, రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత ఇసుక అక్రమ రవాణాకు ఆజ్యం పోస్తోంది. 

అక్రమ రవాణా అరికట్టాలి 
‘‘రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు, ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కై అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి..’’ 
    – జంగిటి శ్రీనివాస్, చిన్నకోడూరు 

భయం మధ్య బతుకుతున్నం 
‘‘ఇసుక టిప్పర్లు నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్‌తో, వేగంగా దూసుకెళుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు మీదకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి..’’ 
    – అంకార్‌ మధు, అల్లీపూర్‌ 

  అక్రమాలపై చర్యలు చేపడతాం.. 
‘‘రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తే సహించేది లేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. చర్యలు తీసుకుంటాం. ఇసుక పక్కదారి పడుతున్నట్టు తెలిస్తే మాకు సమాచారం అందించాలని సూచించాం..’’ 
    – రాజిరెడ్డి, చిన్నకోడూరు తహసీల్దార్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement