
రైతు ఎదుర్కొంటున్న అనేకానేక కష్టాల్లో నాణ్యమైన విత్తనం దొరకడం ఒకటన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పండిన పంట నుంచే మరుసటి పంటకు విత్తనాలను సేకరించేవారుగానీ.. దీనివల్ల దిగుబడులు క్రమేపీ తగ్గేవి. పైగా చీడపీడల బాధ కూడా ఎక్కుయ్యేది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. మాత పంటకు అచ్చమైన నకలుగా విత్తనం కూడా ఉండేలా చేసేందుకు వీరు ఒక పద్ధతిని కనుక్కున్నారు. ఫలితంగా ఏటా హైబ్రిడ్ విత్తనాల కోసం రైతులు శ్రమపడాల్సిన అవసరం ఉండదన్నమాట. అధిక దిగుబడులనిచ్చే.. చీడపీడలను, వాతావరణ మార్పులను కూడా తట్టుకోగల వంగడాలను వేగంగా ప్రపంచం నలుమూలలకు విస్తరించేందుకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త వెంకటేశన్ సుందరేశన్ తెలిపారు.
ప్రస్తుతం తాము వరి మొక్కలోని ప్రత్యేక జన్యువును గుర్తించామని.. దీంట్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా కణ విభజన ప్రక్రియలో భాగంగానే విత్తనాలు కూడా ఏర్పడేలా చేశామని వివరించారు. ఫలితంగా ఫలదీకరణ అన్నది లేకుండానే విత్తనాలు పుట్టుకొస్తాయని తెలిపారు. వరితోపాటు పప్పు ధాన్యాల మొక్కల్లోనూ ఈ జన్యువు ఉంటుంది కాబట్టి.. వాటిల్లోనూ తల్లి మొక్కను పోలిన విత్తనాలు వృద్ధి చేసేందుకు అవకాశముందని సుందరేశన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment