రాజేశ్ పాండే, సోనియా పాండే
పురుషుడు లింగమార్పిడితో మహిళగా మారడం ఇప్పుడు అంత కష్టం కాదు. కానీ సమాజం ఆమోదించడమే అరుదైన విషయం. జెండర్ మారిన విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించుకోవడం అంత సులభం కాదు. కావాలంటే సోనియా పాండే అనే ఈ యువతిని అడగండి.
కొద్ది రోజుల క్రితం వరకు రాజేశ్ అనే యువకుడిగా ఉండేవాడు. ఇప్పుడు సోనియాగా మారిపోయాడు. ఎందుకిలా మారిపోయావని అడిగితే ఆత్మ తనదికాని శరీరంలో ప్రవేశపెట్టినంత ఇబ్బందిగా ఉండటంతో ‘చేంజ్’ కోరుకున్నానని జవాబిస్తాడు. మనది కాని శరీరంలో ఆత్మ ఉండటం ఎంత కష్టమో అనుభవించానని ఇకనైనా సోనియా పాండేగా తనను గుర్తించమని అడుగుతోంది. కాదు పోరాడుతోంది. ఎందుకంటే ఆమె పనిచేస్తున్న ఇండియన్ రైల్వే సోనియాను అతడిగానే కొనసాగి(చూ)స్తోంది. ఆమెగా మార్చమన్న అభ్యర్థనను ఆమోదించకుండా నిబంధనల పేరుతో మోకాలడ్డుతోంది.
అధికారిక పత్రాల్లో తనపేరు, జెండర్ మార్చాలని గోరఖ్‌పూర్‌లోని నార్త్ ఈస్ట్రన్ రైల్వే(ఎన్‌ఈఆర్) జీఎం కార్యాలయం చుట్టూ సోనియా తిరుగుతోంది. రైల్వే చరిత్రలో ఇలాంటి అభ్యర్థన ఎప్పుడూ రాకపోవడంతో ఏం చేయాలో తోచక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలకు చెందిన 35 ఏళ్ల సోనియా పాండే ముందుగా ఇజ్జత్‌నగర్ రైల్వే వర్క్‌షాప్ జనరల్ మేనేజర్‌కు తన అభ్యర్థనను విన్నవించుకుంది. తన సమస్యకు అక్కడ పరిష్కారం దొరక్కపోవడంతో ఎన్‌ఈఆర్ జీఎం వరకు వెళ్లాల్సివచ్చింది. గోరఖ్‌పూర్‌లో కూడా ఆమెకు నిరుత్సాహపూరితమైన సమాధానమే వచ్చింది. అధికారులు దాటవేట ధోరణి ప్రదర్శించారు. ఇది చాలా సంక్లిష్టమైన అంశమని, చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుని దీన్ని పరిష్కరించాల్సి ఉందంటూ ఎన్‌ఈఆర్ ప్రజాసంబంధాల అధికారి సీపీ చౌహాన్ లౌక్యం చూపారు తప్పా సోనియాకు స్పష్టమైన హామీయివ్వలేదు.
సోనియా పాండే
వీడిన చిక్కు‘ముడి’
నలుగురు అక్కాచెల్లెళ్ల నడుమ అల్లారుముద్దుగా పెరిగిన రాజేశ్ పాండే 2003లో తండ్రి చనిపోవడంతో డిపెండెంట్ ఉద్యోగం దక్కడంతో ఇజ్జత్‌నగర్ రైల్వే వర్క్‌షాప్‌లో గ్రేడ్–1 టెక్నీషియన్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. చిన్నతనం నుంచే అమ్మాయిగా మారాలన్న కోరికతో పెరిగిన రాజేశ్ 2017లో లింగమార్పిడి చేయించుకుని సోనియా పాండేగా రూపాంతరం చెందాడు. ఆపరేషన్ చేయించుకోవడానికి ముందే స్థానిక యువతితో అతడికి వివాహం జరిగింది. ‘అసలు సంగతి’ బయట పడటంతో వీరి వివాహ బంధం అట్టే కాలం నిలవలేదు. మగాడి దేహంలో ఇమడలేక సతమతం అవుతున్నానని, మగడిగా ఉండటం తనకు ఇష్టం లేదని భార్య దగ్గర రాజేశ్ ఓపెన్ అయ్యాడు. భర్త బాధను అర్థం చేసుకున్న ఆమె విడాకులు తీసుకుని మౌనంగా అతడి జీవితం నుంచి నిష్క్రమించింది. చిక్కు‘ముడి’ విడిపోవడంతో లింగమార్పిడి చేయించుకుని ఆమెగా అవతరించాడు. మహిళగా మారిన తర్వాత తనకు నచ్చిన జీవితం గడుపుతూ ‘గుర్తింపు’ కోరుకుంటున్నాడు.
చీకటిలో కాంతి కిరణం
అందరి మహిళల్లానే సోనియా పాండే బాగా ముస్తాబవుతుంది. చక్కగా చీర కట్టుకుని, ఫుల్ మేకప్‌తో ఆఫీసుకు వెళ్లే సోనియాను చూసి, అంతకుముందు ఆమె కాదు అతడంటే నమ్మడం ఎవరికైనా కష్టమే. అయితే అతడు ఆమెగా మారడం అంత సులువుగా ఏం జరగలేదు. ‘‘వయసు పెరుగుతున్న కొద్ది నాకు ఏం కావాలో తెలిసొచ్చింది. నా ఆత్మను పొరపాటున మగాడి శరీరంలో ప్రవేశపెట్టినట్టుగా అనిపించింది. అమ్మాయిలా ఆలోచించేవాడిని. అద్దం ముందు నిలబడి అమ్మాయిలా ప్రవర్తించేవాడిని. ఆడవాళ్లలా ముస్తాబు కావడానికి ఇష్టపడేవాడిని. కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసి బలవంతంగా పెళ్లి చేశారు. కానీ నా భార్యకు నిజం చెప్పడంతో ఎవరి దారి వారు చూసుకోవడానికి అంగీకరించింది. మగాడిగా ఉండటం ఇష్టం లేక కుంగుబాటుకు గురయ్యాను. ఆత్మహత్య చేసుకోవాలని చేసుకోవాలని కూడా అనుకున్నాను. ఇంత నరకం అనుభవించే కంటే లింగమార్పిడి చేయించుకోవచ్చు కదా అని ఎవరో ఇచ్చిన సలహా చీకటిలో కాంతి కిరణంలా నాకు కనబడింది. మా అమ్మ, అక్కాచెల్లెళ్లు నా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నేను సంతోషంగా ఉండాలంటే అమ్మాయిగా మారడమే మంచిదని నా నిర్ణయానికే కట్టుబడ్డాను. లింగమార్పిడి చేయించుకుని రెండేళ్లయింది. ఇప్పుడంతా నార్మల్‌గా ఉంది’’ అని సోనియా వివరించింది.
పోరాటానికి సిద్ధం
సోని(న)యా రూపాన్ని కుటుంబ సభ్యులే కాదు ఆమె ఉద్యోగం చేస్తున్న రైల్వే బోర్డు కూడా గుర్తించ నిరాకరిస్తోంది. ఆమెగా గుర్తించాలని సోనియా అభ్యర్థనను అలకించడం లేదు. ‘‘న్యూ జెండర్ ఐడెంటిటీని గుర్తించకపోవడం చాలా బాధగా ఉంది. ఐడీ కార్డు, ఇతర పత్రాల్లో ఇంకా రాజేశ్‌గా కొనసాగించడాన్ని జీర్ణించుకోలేపోతున్నాను. లింగ మార్పిడి, పేరు మార్పిడితో నన్ను గుర్తించాలని రైల్వే అధికారులను వేడుకుంటున్నాను. అధికారిక పత్రాల్లో ఆమెగా నమోదు చేయాలని కోరుకుంటున్నాను. కొత్త రూపంతో నన్ను గుర్తించేందుకు అవసరమైతే రైల్వే బోర్డుతో పోరాటానికి వెనుకాడబోను’’ అని సోనియా స్పష్టం చేసింది. లింగమార్పిడి చేయించుకున్న కొత్తలో చుట్టుపక్కల వారు, సహోద్యోగులు వింతగా చూశారని సోనియా గుర్తు చేసుకుంది. ఇప్పడు అందరూ తనతో బాగానే మాట్లాడుతున్నారని, మామూలుగానే ఉంటున్నారని వెల్లడించింది. తనలాగే చాలా మంది లింగమార్పిడి చేయించుకుని మనసుకు నచ్చినట్టుగా బతుకుతున్నారన్న ధైర్యమే తనకు కొండంత విశ్వాసాన్ని ఇస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య నగరం ముంబై, ఇతర మహానగరాలతో పాటు ప్రపంచంలోని చాలా చోట్ల తనలాంటి వారు ఉన్నారని సంతృప్తి చెందుతోంది. తమది కాని దేహంలో ఇమడలేక తన లాగే ఎంతో మంది లింగమార్పిడి చేయించుకుంటున్నారని సోనియా చెప్పింది. అవును ఇంతకీ ‘ఆమె’గా సోనియాను అధికారులు ఎప్పుడు గుర్తిస్తారు?
– పోడూరి నాగ శ్రీనివాసరావు
సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment