ఖురాన్ చెప్పిన జీవనం!
రమజాన్ కాంతులు
పవిత్రమైన ఈ రమజాన్ నెలలో ముఖ్యంగా ఖురాన్‌తో సంబంధాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే, మానవ మనుగడకోసం దైవం ఈ ప్రపంచంలో చేసిన ఏర్పాట్లన్నీ ఒక ఎత్తయితే, పవిత్రఖురాన్ అవతరణ మరో ఎత్తు. మానవులకు జీవితంలోని అన్నిరంగాల్లో మార్గదర్శకంచేసింది ఖురాన్. సామాజిక, సాంస్కృతిక, కౌటుంబిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ తదితర సమస్త రంగాల్లో మానవుడు ఎలాంటì జీవన విధానాన్ని అవలంబించాలి, ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలో వివరంగా తెలియజేసింది. మానవుడు పుట్టింది మొదలు మరణించే వరకు సంభవించే వివిధ దశల్లో మార్గం చూపింది.
మానవజీవితం ఎలా ఉండాలి? ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చుపెట్టాలి? కుటుంబం, సమాజం, బంధుమిత్రులతో ఎలా మసలుకోవాలి? సమాజంలో ఒక మనిషికి మరోమనిషిపై తారసిల్లే బాధ్యతలేమిటి? వ్యాపార లావాదేవీలు, ఉద్యోగబాధ్యతలు ఎలా నిర్వహించాలి? పాలన సూత్రాలేమిటి? ఆచరించాల్సిన విలువలేమిటి? పరస్పర మానవసంబంధాలు పటిష్టంగా, అర్థవంతంగా, సామరస్యపూర్వకంగా మనగలగాలంటే ఏంచేయాలి? ఇత్యాదివిషయాలన్నీ పవిత్రఖురాన్ చర్చించింది.
అందుకని ఈ పవిత్రనెలలో దీన్ని అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోడానికి, ఆచరించడానికి, సర్వసామాన్యం చెయ్యడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి.చివరి బేసిరాత్రుల్లో’షబెఖద్ర్’ను అన్వేషించాలి. వీలున్నవారు ‘ఏతికాఫ్’పాటించాలి. ఫిత్రాలు చివరిరోజుల్లోనే చెల్లించడం శుభప్రదం. ప్రవక మహనీయులు ’షబెఖద్ర్ ’కోసం ఉపదేశించిన దు ఆ ‘అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ ఆఫ్ వఫుఆఫ్ అన్ని’ పఠిస్తుండాలి.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్