
బిహార్‌లో పిల్లలకు వస్తున్న జబ్బేమిటి? ఆ పిల్లలను చూస్తుంటే బాధగానూ ఉంది. అలాంటి జబ్బు మన పిల్లలకూ వచ్చే అవకాశాలున్నాయేమోననే ఆందోళన కూడా ఉంది. ఆ జబ్బుకు కారణాలేమిటి? ఆ జబ్బు మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశముందా? దానిపై అవగాహన కల్పిస్తూ, దాని నివారణ మార్గం ఏదైనా ఉంటే చెప్పండి.– ఎమ్. కృష్ణచైతన్య, విజయనగరం
బిహార్‌లోని పిల్లల్లో కనిపిస్తున్న జబ్బు ప్రధానంగా ఒక రకం మెదడు వాపు. దీన్ని అక్యూట్ ఎన్‌సెఫలైటిక్ సిండ్రోమ్‌గా చెబుతున్నారు. అయితే అక్కడి స్థానికులు హిందీలో దీన్ని ‘చమ్కీ ఫీవర్’ అని కూడా అంటున్నారు. బిహార్‌లోని ముజఫుర్‌పూర్, చంపారన్... ఆ చుట్టుపక్కల అనేక జిల్లాల్లో ఇది విస్తృతంగా వ్యాపిస్తూ వందలాది చిన్నారుల ఉసురు తీస్తోంది.
సాధారణంగా ఈ అక్యూట్ ఎన్‌సెఫైలైటిస్ సిండ్రోమ్‌లో పిల్లలకు మొదట తీవ్రమైన జ్వరం (హైఫీవర్) కనిపిస్తుంది. అలాగే పిల్లలు చాలా మబ్బుగా, మందకొడిగా, నీరసంగా ఉంటారు. అయోమయంగా కనిపిస్తుంటారు. ఒక్కోసారి తల్లిదండ్రులను సైతం గుర్తుపట్టలేరు. వెలుతురును భరించలేకపోవడం, రకరకాల భ్రాంతులకు గురికావడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇక జ్వరం తీవ్రమైనప్పుడు ఫిట్స్ రావడం కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది.
కారణాలు: సాధారణంగా ఇన్ఫెక్షన్‌లు వచ్చి అవి మెదడును ప్రభావితం చేయడం వల్ల ‘అక్యూట్ ఎన్‌సెఫలైటిక్ సిండ్రోమ్’ కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లకు అటు వైరల్, ఇటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ప్రధానంగా కారణమవుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్లలో జాపనీస్ ఎన్‌సెఫలైటిస్, ఎంటరో వైరస్, హెర్పిస్ సింప్లెక్స్, ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వంటి అనేక వైరస్‌లు ప్రధాన కారణం. ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ప్రధానంగా స్ట్రెప్టోకోకస్, స్టెఫాలోకోకస్ వంటి బ్యాక్టీరియాలు కారణం కావచ్చు. నిమోనియాకు దారితీసే ఇన్ఫెక్షన్లు బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్‌కు కారణం కావచ్చు. బ్రెయిన్ టీబీ వల్ల కూడా మెదడు ప్రభావితమై ఇలాంటి సమస్యలు రావచ్చు.
ఇక మన తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాకాలం వచ్చే ముందర, వేసవి నుంచి వర్షాకాలంలోకి ప్రవేశించే సమయాల్లో పడే చినుకులు, జల్లులతో దోమలు బాగా పెరిగి, డెంగ్యూ వస్తుంది. గతంలో అంతగా కనిపించకపోయినా ఇటీవల గత ఆర్నెల్లుగా డెంగ్యూ ఇన్ఫెక్షన్ కారణంగా బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యలు వచ్చి బ్రెయిన్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్న కేసులూ పెరిగాయి. ఇక మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాందేడ్, దాని పరిసర ప్రాంతాల్లో ఇటీవల రికెట్షియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపించింది. అది కూడా ఇలాగే మెదడును ప్రభావితం చేసింది. ఈ అన్ని కేసుల్లోనూ బిహార్‌లో కనిపించినట్లుగా పిల్లల్లో మెదడు ప్రభావితమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్లలో ఏది సోకినా రెండు మూడు రోజులు జ్వరం వస్తుంది. అయితే మన దేశంలోని పిల్లల్లో పోషకాహార లోపాల వంటి కారణంగా వారు బలహీనంగా ఉండటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో వెంటనే ఈ తరహా వైరస్‌లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. పైగా బిహార్‌లో కనిపిస్తున్న ఈ ‘అక్యూట్ ఎన్‌సెఫలైటిక్ సిండ్రోమ్’ తక్కువ వ్యవధిలో అంటే రెండుమూడు రోజుల్లోనే తీవ్రజ్వరంతో వారి మెదడుపై ప్రభావం చూపి, ఆ పిల్లల ప్రాణాలను తీస్తోంది.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
అక్యూట్ ఎన్‌సెఫలైటిక్ సిండ్రోమ్‌కు ముందర రెండు మూడు రోజుల పాటు జ్వరం వస్తుంది. నిద్రమబ్బుతో, మందకొడిగా, ఫిట్స్‌తో వస్తుంటారు. వాళ్లు చక్కగా తినలేరు. బ్లడ్‌షుగర్ తగ్గి కాంప్లికేషన్స్ వస్తుంటాయి. మరికొన్ని ఇన్ఫెక్షన్లలో అవి నేరుగా మెదడుపై ప్రభావం చూపకపోయినా ఒంట్లోని ఇతరత్రా శారీరక వ్యవస్థలు అంటే శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపి ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపోటు సమస్యలు, గుండెవేగం తగ్గడం, మూత్రవిసర్జన వ్యవస్థలో (యూరినరీ) ఇన్ఫెక్షన్లు, జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్లు వంటివి కనిపించినప్పుడు వెంటనే చికిత్స అందకపోతే వారిలో ‘బ్రెయిన్‌ప్రెషర్’ పెరిగిపోతుంది. ఇలా బ్రెయిన్ ప్రెషర్ పెరిగినప్పుడు తక్షణం చికిత్స అందించడం చాలా చాలా అవసరం. లేకపోతే మెదడు దెబ్బతిని ఆ పిల్లల్లో (మోటార్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల) శరీరక కదలికలు సరిగా లేకపోవడం, సరిగా నడవలేకపోవడం, చేతులు సరిగా పనిచేయకపోవడంతోపాటు వారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, నేర్చుకునే శక్తి మందగించడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే ఈ దశలో రెండు రోజులకంటే జ్వరం తగ్గకుండా ఉండటం, అది చాలా తీవ్రమైన జ్వరం (హైఫీవర్)గా కనిపించనప్పుడు తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.
చికిత్స: ఈ తరహా జ్వరాల్లో పిల్లలకు రెండు దశల చికిత్స అవసరమవుతుంది. వీరిలో ఇన్ఫెక్షన్ తగ్గడానికి అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్ ఇవ్వాలి. అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. కానీ వైరల్ ఇన్ఫెక్షన్లలో హెర్పిస్ వంటి వాటికి తప్ప చాలా వైరస్‌లకు మందులు ఉండవు. వ్యాధి లక్షణాలను అదుపు చేయడానికి మాత్రమే ఉపయోగించే సింప్టమాటిక్ చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ పిల్లలకు మొదటి దశ చికిత్సగా తక్షణం ఐసీయూలో ఉంచడం, అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ లేదా వైరస్‌ను బట్టి కొన్ని యాంటీరిట్రోవైరల్ మందులు ఇవ్వడం, వారి టెంపరేచర్‌ను నార్మల్‌కు తీసుకురావడం, బ్లడ్ గ్లూకోజ్ నార్మల్‌గా ఉండేలా చూడటం, బ్రెయిన్ ప్రెషర్‌ను తగ్గించడం, శ్వాస సరిగా అందేలా చూడటం వంటి తొలిదశ చికిత్స అందించాలి.
ఆ తర్వాత ఆ లక్షణాల కారణంగా పరిస్థితి బాగా దిగజారిపోకుండా చూసే సెకండరీ చికిత్సలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫిట్స్ వంటివి రాకుండానూ ఒకవేళ వచ్చినా అవి భవిష్యత్తులో దీర్ఘకాలం ప్రభావం చూపకుండా చేసే రెండోదశ చికిత్స అందించాలి. ఈ రెండో దశ చికిత్స (సెంకండరీ ట్రీట్‌మెంట్)లో మరింత విషమించకుండా చూస్తారు. వెంటిలేటర్ మీద ఉంచి, మానిటాల్ లేదా హైపర్‌టోనిక్ సెలైన్ ఇస్తారు. బ్రెయిన్ ప్రెషర్ తగ్గిస్తారు. అవసరాన్ని బట్టి ఫిట్స్ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఫిట్స్ వచ్చిన వారికి ఈఈజీ పరీక్ష చేసి ఫిట్స్ ఇవి ఏ కారణంగా వచ్చాయి, ఇక్కడికి పరిమితమయ్యాయి వంటి అంశాలను గుర్తిస్తారు. ఇలాంటి లక్షణాలు గల పిల్లలకు కొన్ని మందులు ఇచ్చి వారిని ప్రశాంతంగా ఉంచాల్సి ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ: ఇందుకోసం తొలుత క్లినికల్ ఫీచర్స్ పరిశీలించాలి. అంటే రోగిలో బయటకు కనిపించే అంశాలైన జ్వరం, నీరసం, అయోమయం, బయటి వాతావరణానికీ... దాంతోపాటు మనం ఇచ్చే ఆదేశాలకు స్పందించక పోవడం, గిచ్చడం వంటివి చేసినప్పుడు కదలికలు లేకపోవడం, కనుపాపలు పూర్తిగా స్పందించకపోవడంతోపాటు ఒకవైపు కనుపాప పెద్దగానూ, మరోవైపుది చిన్నగానూ ఉండటం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం వంటి వాటితోపాటు సీటీ స్కాన్ వంటి పరీక్షలతో అక్యూట్ ఎన్‌సెఫలైటిస్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఇలాంటి పిల్లలను మొదట ఆసుపత్రికి తీసుకురాగానే వారిని మరింత ఆందోళనకు గురికాకుండా కామ్‌గా ఉండేలా చేసి తక్షణం చికిత్స ప్రారంభించాలి.
నివారణ
ఇతరలకు సోకకుండా ఉండేందుకు... దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతుల్ని, చేతి రుమాలు అడ్డుపెట్టుకునేలా పిల్లలకు నేర్పాలి. ఈ నియమాన్ని విధిగా అందరూ పాటించాలి ∙దగ్గు, తుమ్ము తర్వాత అలా అడ్డుపెట్టుకున్న చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి ∙దగ్గు, తుమ్ము సమయంలో ఉపయోగించిన రుమాలు/టిష్యూను వేరొకరు ఉపయోగించకూడదు. దాన్ని సరిగ్గా డిస్పోజ్ చేయాలి ∙పరిసరాలను, కిచెన్లను, బాత్‌రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ∙చాలాసార్లు ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీని నివారణ కోసం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. హ్యాండ్ శానిటేషన్ వాడటం చాలా అవసరం ∙ఇక ఇటీవల డెంగ్యూతో సైతం ఇలాగే మెదడును ప్రభావితం చేసే సమస్యలు వస్తున్నాయి కాబట్టి నీటిగుంటలు లేకుండా చూసుకోవడం, దోమ కాటుకు గురికాకుండా జాగ్రత్త పడటం కూడా అవసరం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... చికిత్సకంటే నివారణ మేలు. అసలు పిల్లలకు ఎలాంటి వ్యాధులేమీ రాకుండా నివారణ ప్రక్రియలు పాటించడం, వారిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందేలా మంచి పోషకాహారం ఇస్తూ ఉండటం అవసరం.
డాక్టర్ పరాగ్ శంకర్‌రావు డెకాటే, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్, రెయిన్‌బో చిల్డ్రెన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment