పురుషుల హక్కులకు భరోసాగా...
రిపోర్ట్
రాజ్యాంగం సాక్షిగా మనది గణతంత్ర రాజ్యం. సర్వసమాన రాజ్యం. స్వేచ్ఛా వాయువులు నలుచెరగులా విస్తారంగా వీచే సర్వస్వతంత్ర రాజ్యం. ఇంకనూ... దయగల ఏలినవారి చలవ వల్ల మనది సంక్షేమ రాజ్యం. ఇన్ని విశేషణాలు గల కర్మభూమిలో పురుషాధములకు కష్టములేమి యుండును? ఏలినవారు బహుశ అటులనే భావించి ఉందురు. ఎక్కడపడితే అక్కడ వేలాడే ముఖాలతో కనిపించే మగాళ్లను సుఖజీవులుగానే వారు తలపోసి ఉందురు. మగజాతిపై విశ్వవిద్యాలయాలదీ, ప్రసారసాధనాలదీ కూడా ఇదే దృక్పథం. ఆ యొక్క మహత్తర దృక్పథంతోనే మన విశ్వవిద్యాలయాలు ఎక్కువ సమానులైన మహిళల గురించి, వారి సాధక బాధకాల గురించి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసుకుని, ఆ విధంగా ముందుకు పోతున్నాయి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలవుతోంది. ఇన్నాళ్లలో మన ప్రభుత్వాలు గానీ, విశ్వవిద్యాలయాలు గానీ ఎక్కడా మగాళ్ల కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనే చేయలేదు. రాష్ట్రపతి, ప్రధాని ఇత్యాది ఘనత వహించిన పదవులను అలంకరించిన వారిలో అత్యధికులు పుణ్యపురుషులే. అయినా, వారెవరూ సాటి ‘మగా’నుభావుల ఈతిబాధలను పట్టించుకున్న పాపాన పోలేదు. పత్రికలు, ప్రసార సాధనాలు సైతం ఇతోధికంగా స్త్రీవాదుల గొంతును మార్మోగించడంలోనే తలమునకలుగా ఉంటూ, పురుషాధముల గొంతును కడు వ్యూహాత్మకంగా విస్మరిస్తున్నాయి. పురుష హక్కుల సంఘాలు ఎంత గగ్గోలు పెడితే మాత్రం... అదంతా మీడియాకు ఎక్కకపోయాక ఇక ఏం లాభం? మన దేశంలో మాత్రమే కాదు, చాలా దేశాల్లో మగాళ్లది ఇదే పరిస్థితి.
ప్రపంచంలో మగాళ్ల బతుకులు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దశలో ఫిన్లాండ్ అనే అప్రాచ్య దేశంలో ఒక ఆశాజనకమైన పరిణామం చోటు చేసుకుంది. పురుషాధములలో మెజారిటీ జనాభా తమను తాము తక్కువ సమానులుగా తలపోస్తూ, కుంగిపోతుండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఫిన్లాండ్ సర్కారు నడుం బిగించింది. పురుషుల హక్కులకు భరోసా కల్పించేందుకు తగిన విధానాన్ని రూపొందించే బాధ్యతను లింగ సమానత్వ (జెండర్ ఈక్వాలిటీ) మంత్రిత్వ శాఖకు అప్పగించింది.