బై..బై నాన్నా! | Remained a rift between father and son | Sakshi
Sakshi News home page

బై..బై నాన్నా!

Published Mon, Oct 24 2016 10:40 PM | Last Updated on Thu, Aug 16 2018 4:21 PM

బై..బై నాన్నా! - Sakshi

బై..బై నాన్నా!

అది తప్పు కాదు...
కానీ, దాని వల్ల గొప్ప నష్టం వచ్చింది.
తండ్రీ కొడుకుల మధ్య పెద్ద అగాధమే మిగిలింది.
మళ్లీ వీళ్లిద్దరూ ఎలా కలవాలి?!
ప్రేమలో తప్పు ఒప్పులుండవని ఎలా చెప్పుకోవాలి?
ప్రేమగా ఎలా కౌగిలించుకోవాలి?
సంతోషంగా ఎలా ‘బై’ చెప్పుకోవాలి?

 

ఏదో చప్పుడవడంతో మెలకువ వచ్చింది బాలకు.  కరెంట్ పోయినట్టుగా ఉంది అంతా చీకటి. పక్కన చేత్తో తడిమి చూసింది భర్త లేడు. గాబరాగా అనిపించి పిలిచింది. పలుకు లేదు. ‘బాత్రూమ్‌కి వెళ్లుంటాడా..’ అనుకుంది. ‘ఇంత చీకట్లో బాత్రూమ్‌లో పడిపోతే.. ఇంకేమైనా ఉందా!’ ఆమె గాబరా ఇంకా పెరిగింది. టార్చ్ వేసి కనిపించినమేర చూసింది. బాత్రూమ్ డోర్ వేసే ఉంది. ఎక్కడా భర్త జాడలేదు! ‘ముసలాయన ఈ టైమ్‌లో ఎక్కడకెళ్లినట్టు..’ గొణుక్కుంటూనే బాల్కనీ వైపు చూసింది. చైర్‌లో కూర్చొని కనిపించాడు. ‘హమ్మయ్య..’ అనుకుంది.

 
పిలిచింది.. పలకలేదు.

అతని దగ్గరగా వెళ్లి భుజం మీద చేయి వేసి..‘‘పడుకోక ఇక్కడెందుక్కూర్చున్నారు అర్ధరాత్రప్పుడు?’’ అంది. ‘‘మనబ్బాయి కల్లోకి వచ్చాడే. నా దగ్గరకు వస్తూ వస్తూనే అంతలోనే  కనపడకుండాపోయాడు...’’ అతని గొంతులో దుఃఖం తాలూకు వణుకు వినిపిస్తోంది. ‘‘ఎన్నేళ్లని ఇలా బాధపడుతూనే ఉంటారు? రండి వచ్చి పడుకోండి...’’ ‘‘ఎందుకెళ్లిపోయాడే..! తండ్రిని ఒక్కమాట అనకూడదా?! వాడు నన్ను క్షమిస్తాడంటావా!’’ ... భార్య భుజం ఆసరా చేసుకొని లేచి, రెండడుగులు వేశాడు. గుండెలో కలుక్కుమన్నట్టుంది. పట్టు తప్పింది. భర్త పడిపోవడంతో బాలకు గుండాగినంతపనైంది.

 
పండగ కళ దూరమైన వేళ

‘‘చూడమ్మా! ఈ వయసులో గుండెపోటు రావడం ఇది రెండవసారి. జాగ్రత్త...’’ బాలతో చెప్పాడు డాక్టర్. తలూపింది బాల. రాత్రి ఈ డాక్టర్‌కే ఫోన్ చేస్తే, అంబులెన్స్ పంపించారు. ఇప్పటికి గండం గట్టెక్కినట్టే. కానీ,   భర్త ముఖంవైపే చూస్తూ ఆలోచనల్లో పడిపోయింది.       ‘ఎంత అందమైన జీవితం తమది.. కూతురు, కొడుకుతో ఇల్లు పండగలా ఉండేది. ఆయుర్వేద డాక్టర్ గా అనిరుధ్‌కి మంచి పేరు. కూతురుకు అనువైన సంబంధం చూసి పెళ్లి చేశారు. కొడుకు ఆదిత్యకు సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. అక్కడే హాస్టల్‌లో ఉండేవాడు. ఆ రోజు పుట్టిన రోజు అవడంతో హాస్టల్ నుంచి ముందే వచ్చాడు. ఉదయాన్నే ముగ్గురం గుడికి వెళ్లొచ్చాం. వాడికిష్టమైన వంటకాలన్నీ చేశాను. ఫ్రెండ్స్‌ను కలవడానికి బైక్ తీసుకెళతానన్నాడు. వద్దని వారించాడు తండ్రి. మొండికేశాడు వీడు. కొడుకుని తిట్టి, బండి కీస్ తీసుకొని క్లినిక్‌కి వెళ్లిపోయాడు అనిరుధ్. దీంతో వీడు కోపంగా ‘ఈయన ఎప్పుడూ ఇంతే, నేనీ ఇంట్లోనే ఉండను’ అంటూ హాస్టల్‌కి వెళ్లిపోయాడు.

 
ఆరని చిచ్చు!

సాయంకాలానికి ఆదిత్య హాస్టల్ నుంచి ఫోన్. రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగిందనీ, ఆదిత్యను ఆసుపత్రిలో చేర్పించామని. గుండెలు బాదుకొని ఆసుపత్రికెళ్లాం. పుట్టినరోజునాడే శవమై కనిపించాడు ఆదిత్య. కంటికిమింటికీ ఏడ్చాం. ‘అడిగినప్పుడు బండి ఇచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో..’ అని కుమిలిపోయాడు అనిరుధ్. ఈ సంఘటన జరిగి నిన్నటికి పదేళ్లు. ఈ వయసులో మాకు అండగా ఉండాల్సినవాడు..’ భర్త పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకుంది బాల.  

 
సోల్ ఆస్ట్రల్ ట్రావెల్

‘‘మీరు మీ కొడుకును కలుసుకోవచ్చు. మాట్లాడవచ్చు. మాట్లాడతారా?’’ చిరునవ్వుతో అడిగిన కౌన్సెలర్ మాటలకు అవునన్నట్టు తలూపాడు అనిరుధ్. తనలో ఏళ్లుగా గూడుకట్టుకున్న విషాదాన్ని తొలగించుకోవడానికి థెరపిస్ట్‌ను కలిశాడు. మరణించినవారి జ్ఞాపకాలతో వేదనాపూరితమైన జీవితం గడిపేవారు ఎలా ఆ బాధ నుంచి విముక్తి పొందాలో, దానికి తగిన చికిత్స ఎక్కడ ఉందో ఈ మధ్యే తెలిసింది అనిరుధ్‌కి. ధ్యానప్రక్రియలో దీన్ని ‘ఛానలింగ్ స్పిరిట్స్’ అంటారని, ఇది వేల ఏళ్లుగా లోకంలో ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు చూపించిన వేదిక మీద విశ్రాంతిగా పడుకున్నాడు.

అందని తీరాలు అందిన వేళ
ఐదు.. పది.. నిమిషాలు గడుస్తున్నాయి. మెల్లగా తానేదో కొత్త ప్రపంచంలోకి వెళుతున్నట్టు అనిపిస్తోంది అనిరుధ్‌కి. తను చేసే ఆ ప్రయాణం.. ఎప్పుడూ చూడనంత అందంగా ఉంది. కాసేపటికి.. ‘‘ఓ అద్భుతమైన కాంతిగోళం కనిపిస్తోంది’’ చెప్పడం మొదలుపెట్టాడు అనిరుధ్. ‘‘వెండిలా మెరిసే లోకమేదో వింతగా ఉంది. మధురంగా నీటి గలల శబ్దాలు వినిపిస్తున్నాయి. అదో అందమైన సరస్సు. ఆ సెలయేటిలో పడవను నడుపుకుంటూ వస్తున్నాడో యువకుడు. సన్నని రాగమేదో తీస్తున్నాడు. అతడిని తేరిపార చూశాను. వాడు.. వాడు... నా కొడుకు ఆదిత్య. అవును వాడే.. ! అయ్యో, నన్ను చూసి కూడా వెళ్లిపోతున్నాడు. పలకరించడమే లేదు. నన్ను వాడెప్పటికీ క్షమించడు...’ ఆదిత్య పలవరిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు.

 
వీడ్కోలుతో విశ్రాంతి...
‘‘ఆందోళన వద్దు.. అతనితో మాట్లాడండి..’’ కౌన్సెలర్ ఇచ్చే సూచనలు అందుతున్నాయి అతనికి. కాసేపటికి..  ‘‘ఆ.. ఆదిత్య నాకు దగ్గరిగా వస్తున్నాడు. బాగా దగ్గరగా వచ్చాడు..‘బాగున్నావా?!’ అడుగుతూ వాడినే చూస్తున్నాను. వాడి మొహంలో ఎంతో ప్రశాంతత. ఆ కళ్లలో ఎంతో ప్రేమ.. ‘‘నన్ను ఎందుకు వదిలేసిపోయావు?’’ దిగులుగా అన్నాను. చల్లగా నవ్వుతున్నాడు. రెండు చేతులూ సాచాడు దగ్గరగా రమ్మని. మాటలే లేవన్నంత ఆనందం నాలో. అంతే ఆర్తిగా వెళ్లాను. ఆదిత్య ను హత్తుకుపోయాను. అప్పటివరకూ ఉన్న నా బాధ కరిగి నీరవుతుంది. అలా ఎంత సేపు గడిచిందో...
 

మెల్లగా అతని తెల్లని చెయ్యి వీడ్కోలు చెబుతున్నట్టు పైకి లేచింది. ఆ క్షణంలో నాకు అర్థమైంది. అతను ఇక్కడ నా కొడుకు కాదు. నేను అతని తండ్రిని కాదు. నా కారణంగా అతని మరణం సంభవించలేదు. అసలు చేతనత్వానికి మరణమే లేదు.  ఆ దివ్యరూపం వెళ్లిపోతున్నందుకు నాకేవిధమైన బాధా కలగడంలేదు. బదులుగా నేనూ చెయ్యి ఊపుతూ ‘ైబె  ఫ్రెండ్..’ అన్నాను. అతని రూపం మెల్లగా కనుమరుగయ్యింది.’ అనిరుధ్ మెల్లగా కళ్లు తెరిచాడు. అప్పటి వరకు ఉన్న బరువేదో దిగిపోయినట్టు మనసంతా దూదిపింజలా తేలికైనట్టు అనిపించింది.

ప్రేమను పంచు
ఉదయపు నీరెండలో కుర్చీలో ఒదిగి కూర్చున్న బాల వద్దకు కాఫీ కప్పు పట్టుకొని వెళ్లాడు అనిరుధ్. తననే ఆశ్చర్యంగా చూస్తున్న బాలను చూస్తూ. ‘‘బాలా..  ఎవరి పనిని వారు పూర్తి చేసుకొని బంధాల నుంచి దూరమవుతారని ఈ ప్రక్రియలో  తెలుసుకున్నాను. మన అబ్బాయి అనుకున్నవాడు మనకు ఈ జన్మ వరకే. మనసుకు మనసుకు మధ్య ప్రేమ ఉండాలే తప్ప వేదన ఉండకూడదు. నాకూ ఈ జీవితం పట్ల ఒక అవగాహన కలిగింది. మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకున్నాను. ఇక నా ఆరోగ్యం గురించి దిగులు పడకు..’’ అంటూ కాఫీ కప్పు అందించి ఆమె కళ్లనీళ్లను తుడిచాడు అనిరుధ్. ఆ మాటలు బాలకు ఎంతో భరోసాని కలిగించాయి.  - నిర్మల చిల్కమర్రి

 

ఒక్క క్షణం...
శరీరం మరణించాక ‘చేతన’ ఎక్కడకు చేరుకుంటుందో ధ్యానప్రక్రియ ద్వారా బతికున్నవారు ‘చేతన’గానే అక్కడకు చేరుకుంటారు. దీనిని ‘రిగ్రెషన్ ఆస్ట్రల్ ట్రావెల్’ అంటారు. చేతనతో సంభాషించడాన్ని ‘ఛానలింగ్’ చేయడం అంటారు. ఒకసారి చేతనను కలుసుకున్నాక తమకు తాముగా జన్మప్రయాణాన్ని అర్థం చేసుకుంటారు. రాగ ద్వేషాలన్నింటినీ ఒకే ఒక్క క్షణంలో వదులుకుంటారు.  - డా. న్యూటన్ కొండవీటి, లైఫ్ రీసెర్చి అకాడమీ, హైదరాబాద్

 

ఇతిహాసంలో ఛానెలింగ్ ప్రక్రియ
అభిమన్యుడి మరణంతో అర్జునుడు విపరీతమైన వేదనకు లోనయ్యాడు. ఎంతమంది ఓదార్చినా ఉపశమనం పొందలేదు. అతని వేదనను పోగొట్టడానికి ధ్యానప్రక్రియ ద్వారా అర్జునుడిని ఊర్థ్వలోకాలకు తీసుకెళ్తాడు కృష్ణుడు. అక్కడ అభిమన్యుడిని కలుసుకున్న అర్జునుడు ‘నువ్వు నా కొడుకువి’ అంటే... ‘ఇక్కడకు వచ్చాక కొడుకెవరు, తండ్రెవరు? అంతా ఒక్కటే కదా!’ అన్నాడట నవ్వుతూ. దీంతో బాధ నుంచి విముక్తిపొంది, తన కర్తవ్య సాధనపై దృష్టి నిలిపాడు అర్జునుడు.


అంతర్జాతీయంగా  చేతన సంభాషణలు
‘మరణించిన తర్వాత ‘చేతన’ ఎక్కడకు వెళుతుంది, ఆ చేతన తన వాళ్లతో ఎలా సంభాషిస్తుంది?’ అనే విషయాలతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనాత్మక గ్రంథాలు వచ్చాయి. వాటిలో ఖర్షోద్ భావ్‌నగరి ‘లాస్ ఆఫ్ ది స్పిరిట్ వరల్డ్’ పుస్తకం ప్రముఖమైనది. ముంబయ్‌కి చెందిన భావ్‌నగరి భర్త, కొడుకు కారు ప్రమాదంలో మరణించారు. ‘సోల్ ఛానలింగ్’ ద్వారా తన కొడుకుతో సంభాిషించింది. 1980లో రాసిన ఈ పుస్తకం కొన్ని మిలియన్ల మందిని అబ్బురపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement