
లోకానికి నాలుగు దిక్కులు ఉన్నట్లే, పిల్లలకు నలువైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఆ నలువైపులా పిల్లలకు కాపలాగా నిలబడవలసింది తల్లిదండ్రులే.
బిడ్డకు ఏదైనా అయితే, బిడ్డ ఏమైనా అయితే తల్లి దుఃఖం ఏ దేవుడూ తీర్చలేనిది! చేతుల్లోని బిడ్డను జారవిడుచుకున్నప్పుడైతే ఇక ఆ తల్లి దేవుణ్ని చేతులు జోడించి వేడుకునే అర్హతను కూడా కోల్పోయినట్లుగా కుమిలిపోతోంది. ఫెమిదీ షేక్‌కు 23 ఏళ్లు. బిడ్డను ఒడుపుగా ఎత్తుకోవడం కూడా రాని వయసు. ఉల్హాస్‌నగర్ (మహారాష్ట్ర)లోని ధోభీఘాట్‌లో ఉంటారు వాళ్లు. అక్కడికి దగ్గర్లోని కల్యాణ్ ప్రాంతంలో పెళ్లికని ఆదివారం నాడు బిడ్డను ఎత్తుకుని, భర్తతో కలిసి వెళ్లింది. బిడ్డ నడిచేవాడైతే నడిపించేది. ఆర్నెల్లు వాడికి. చంకన వేసుకుని పెళ్లి పందిరి అంతా సందడిగా తిరిగింది. పెళ్లయ్యాక తిరిగి వచ్చేటప్పుడు ఊహించని విధంగా ఆమె హైహీల్స్ బ్యాలెన్స్ తప్పి, చేతిలోని బిడ్డ జారి, నేలపై పడిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. దురదృష్టం! బిడ్డ బతకలేదు. ఫెమిదీ దుఃఖం కట్టలు తెగింది. భర్త ఆమెను ఆపలేకపోయాడు. ఆమె గృహిణి. ఆమె భర్త ఉల్హాస్‌నగర్‌లోని ఒక దుకాణంలో హెల్పర్‌గా చేస్తాడు. ఇద్దరూ ఇప్పుడు బిడ్డలేని అనాథలయ్యారు. ఘజియాబాద్ (యు.పి.) లోని ఇందిరాపురంలో గత ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో తల్లి లేదు. ఇంట్లోనే ఉండే పిన్నమ్మ లేదు. తండ్రి ఇంట్లో ఉండడు. నాలుగేళ్ల చిన్నారి ఒక్కటే ఉంది. బేబీ చెయిర్‌లో తనను తను లాక్కుంటూ బాల్కనీలోకి వెళ్లింది. చెయిర్‌లో లేచి నిలబడింది. చెయిర్ చక్రాలు స్లిప్ అయ్యాయి. అంతే! పదో అంతస్థులోని ఆ బాల్కనీలోంచి నేలపై పడిపోయి, చనిపోయింది! ఆ కుటుంబం విలవిల్లాడిపోయింది. పోలీసులను బతిమాలుకుని పోస్ట్‌మార్టం చేయనివ్వకుండా, యమునా ఉపనది హిండన్‌లో ఆ పాప అస్థికలు కలిపారు. వాళ్లు కలిపింది అస్థికల్ని కాదు. పాపపై పెట్టుకున్న తమ పంచ ప్రాణాలను!
బిడ్డల్ని ఇంత ప్రాణపదంగా ప్రేమించేవారు.. తమ వల్ల వారికి జరగబోయే ప్రమాదాన్ని ముందే ఎందుకు ఆలోచించలేరు అనిపిస్తుంది! ప్రేమ.. ప్రమాదాన్ని శంకించనివ్వదా?! హైహీల్స్ స్లిప్ అవుతాయేమోనని ఫెమిదీ ముందే శంకించి ఉంటే, ఇంట్లో ఎవరూ లేకుండాపోతే పాప ఎలా అని ఇందిరాపురంలోని ఆ కుటుంబం ముందే శంకించి ఉంటే ఇంత విషాదం మిగిలి ఉండేదా! లోకానికి నాలుగు దిక్కులు ఉన్నట్లే, పిల్లలకు నలువైపులా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఆ నాలుగు దిక్కులలోనూ పిల్లలకు కాపలాగా నిలబడవలసింది తల్లిదండ్రులే. కంటిపాపలా చూసుకుంటే సరిపోతుందనుకుంటాం. కంటి రెప్పల్నుంచి కూడా కాపలా కాయాలేమోనన్న ఆలోచన రాకపోతే ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఏదో ఒక అజాగ్రత్త వల్ల నెత్తి మీద పిడుగు పడుతుంది. పిడుగులు ఆకాశం నుంచే పడతాయనేం లేదు. మన అలక్ష్యం నుంచీ పడతాయి.
– మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment