రాగులతో మైగ్రేన్ దూరం
గుడ్‌ఫుడ్
రాగులు మైగ్రేన్ తలనొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి. రాగులలో క్యాల్షియమ్ పాళ్లు పుష్కలం. 100 గ్రాముల రాగులలో 344 మిల్లీగ్రాముల క్యాల్షియమ్ ఉంటుంది. రాగుల పై పొట్టులో పాలీఫీనాల్స్ అనే పోషకాలు, డయటరీ ఫైబర్ (పీచు) ఎక్కువ. అవి మనం తీసుకున్న ఆహారాన్ని మెల్లగా జీర్ణమయ్యేలా చేస్తాయి. దాంతో మన ఆహారం ద్వారా వెలువడే చక్కెర చాలా నెమ్మదిగా విడుదల అవుతుంది. దాంతో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి రాగులు మంచి ఆహారం. ఇక పీచుపదార్థాల వల్ల మన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేయడంతో పాటు మలబద్దకం ముప్పు ఉండదు.
రాగులు తీసుకునే వారిలో చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. అంతేగాక వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలను నివారిస్తుంది. దాంతో దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యమవుతుంది.రాగులలో స్వాభావికమైన ఐరన్ ఎక్కువ. అందుకే రక్తహీనత (అనీమియా)తో బాధపడే రోగులకు రాగులతో చేసే ఆహారాలను సిఫార్సు చేస్తారు. ఇక రాగులను మొలకెత్తేలా (స్ప్రౌట్స్‌గా) చేస్తే వాటిలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు రాగులలోని ఐరన్‌ను ఒంటికి పట్టేలా చేస్తుంది.రాగులు తినేవారిలో యాంగై్జటీ, డిప్రెషన్, నిద్రలేమి (ఇన్‌సామ్నియా) వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. రాగులలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది ఊబకాయంతో బాధపడేవారికి మంచి ఆహారం.