తెలుగులో రొమాంటిక్ కామెడీ జానర్‌కు ఒక కొత్త దారిని చూపించిన సినిమాలోని సన్నివేశాలివి. ఇందులో హీరోగా నటించిన నటుడు ఇప్పుడు పెద్ద స్టార్. ఈ సినిమాతోనే దర్శకురాలిగా పరిచయమైన వ్యక్తి మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? గౌతమ్ జీవితంలో ఎవ్వరూ లేరప్పుడు. అంతా శూన్యం. అమ్మ చనిపోయి రోజులు గడుస్తున్నాయి. అక్కా, బావా వాళ్లింటికి వాళ్లు వెళ్లిపోయారు. ఇంట్లో అతనొక్కడే. రోజులెలా గడిచిపోతున్నాయో అతడికే అర్థం కావట్లేదు. ఇంట్లో ఏ మూలన చూసినా అమ్మ ఉన్నట్లే ఉంది. అమ్మ మాటలే వినిపిస్తున్నాయి. ‘‘సోల్‌మేట్ అనేది ఎవరో ఒక్కరే! ఆ తర్వాత ఎవ్వరొచ్చినా అడ్జస్ట్‌మెంటే!’’ ‘‘నీకు కావాల్సింది ఇదేనా!?’’ అమ్మ మాటలే అవి. గౌతమ్‌కి మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. నిత్య గుర్తొచ్చింది. నిత్యతో ఉన్న రోజులు గుర్తొచ్చాయి. నిత్య.. గౌతమ్ ప్రేమించిన అమ్మాయి. ఒక్కసారిగా మళ్లీ ఒంటరైపోయాడు. ఎవ్వరూ లేనంత ఒంటరి అయిపోయాడు. పేపర్‌లో ఒక ప్రకటన చూడగానే అందులో ఉన్న ఫొటోను చూస్తూ ఆగిపోయింది నిత్య. గౌతమ్ వాళ్ల అమ్మ ఫొటో అది. ఆమె చనిపోయిన విషయం, దశదినకర్మ వివరాలు ఉన్నాయా ప్రకటనలో!లేచి బట్టలు సర్దుకుంది నిత్య. ‘‘ఎక్కడికి?’’ అని అడిగింది వాళ్లమ్మ.
అమ్మకు ఏం చెప్పకుండా బ్యాగ్ సర్దుకుంటోంది నిత్య. నాన్న ఏం అడగకుండా వచ్చి పక్కన్నే నిలబడ్డాడు. ‘‘ఎక్కడికి అని అడుగుతుంటే చెప్పవే!’’ అమ్మ కసురుకుంది. ‘‘పప్పా! నేను హైద్రాబాద్ వెళ్తున్నా’’ నాన్నను చూడకుండానే, ఈ మాట చెప్తూ బయల్దేరింది నిత్య. బెంగళూరు నుంచి హైద్రాబాద్‌కి వెళ్లాలి నిత్య. గౌతమ్ ఒక్కడే ఉండి ఉంటాడు అక్కడ. ∙∙ గౌతమ్ ఇల్లు. కాలింగ్ బెల్ మోగింది. గౌతమ్ వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా కావ్య. గౌతమ్.. తన జీవితం నుంచి నిత్య వెళ్లిపోయాక కావ్యను ప్రేమించాడు. కావ్యతోనూ అతడి ప్రేమ ఎక్కువ రోజులు నిలవలేదు. కావ్య పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. మళ్లీ ఇదే.. కావ్య గౌతమ్‌కు కనిపించడం. కావ్యను చూడ్డమే ఒకింత ఆశ్చర్యంతో నిలబడిపోయాడు గౌతమ్. కావ్య ఇంట్లోకి వచ్చి కూర్చుంది. కొద్దిసేపు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ‘‘నేను ఇవ్వాళే హైద్రాబాద్ వచ్చాను. ఆంటీ గురించి తెలిసింది.’’ కావ్య గొంతు చిన్నగా పలికింది. గౌతమ్ నీరసంగా నవ్వాడు. ‘‘నువ్వెలా ఉన్నావ్!?’’ అని అడిగాడు. ‘‘నేను బాగున్నాను. నువ్వు?’’ అడిగింది కావ్య. గౌతమ్ ఏం మాట్లాడకుండానే బాగున్నా అంటూ చెయ్యి ఆడిస్తూ సమాధానం చెప్పాడు. కావ్య గౌతమ్‌ను బాధగా చూసింది. ఇద్దరి మధ్యా మళ్లీ నిశ్శబ్దం.
‘‘నేను బయలుదేరతాను.’’ అంటూ లేచి నిలబడింది కావ్య. ‘సరే’ అన్నట్టు గౌతమ్ కూడా లేచి నిలబడ్డాడు. ‘‘గౌతమ్! చాలా రోజుల్నుంచి నీతో.. మాట్లాడుదామనే అనుకున్నా. నా పెళ్లయ్యాక చెన్నై వెళ్లిపోయాను. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో! సమ్ హౌ..’’ కావ్య మాట్లాడుతూ పోతోంది. గౌతమ్ ఆమె మాటలను మధ్యలోనే ఆపేస్తూ.. ‘‘ఇప్పుడదంతా ఎందుకు?’’ అన్నాడు.‘‘మమ్మీ, డాడీకి మన విషయం మొదట్నుంచీ నచ్చేది కాదు. ఆ రోజు జరిగిన గొడవలో వాళ్లకో వంక దొరికింది.’’ కావ్య ఇంకా బాధగానే ఉంది. గౌతమ్ ఆమెను శాంతపరచడానికి, ‘‘నువ్వు హ్యాపీయే కదా!’’ అన్నాడు.‘‘అది కాదు గౌతమ్..’’‘‘నువ్వు హ్యాపీయా కాదా?’’ అడిగాడు గౌతమ్.కావ్య నవ్వింది. గౌతమ్ నవ్వాడు. ‘‘ఫస్ట్ మనం ఫ్రెండ్స్‌గా ఉన్నాం. ఆ ఫ్రెండ్‌షిప్ ఎప్పటికీ మారకూడదు.’’ కావ్య ఆరోజు మొదటిసారి నవ్వింది. ‘‘మారదు.’’ గౌతమ్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ‘‘కాఫీ?’’ ఆఫర్ ఇచ్చాడు గౌతమ్.
‘‘నువ్వు కాఫీ పెడతావా? నేను పెడతాను నువ్ తాగు చాలు..’’ నవ్వుతూ అంది కావ్య. కిచెన్‌కు దారి చూపించాడు గౌతమ్. గౌతమ్ స్నానానికి వెళ్లిపోయాడు. కాలింగ్ బెల్ మోగింది. కావ్య కిచెన్ నుంచి వచ్చి తలుపు తీసి, ‘‘యస్!’’ అంది. ఇవతల ఉన్న వ్యక్తి నిత్య. గౌతమ్‌ని కలవడానికి వచ్చింది. కానీ, కావ్యను చూసి కాసేపు అలాగే నిలబడిపోయింది. ‘‘సారీ! రాంగ్ అడ్రస్..’’ అని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయింది నిత్య. గౌతమ్‌కి పెళ్లి అయిపోయి ఉండొచ్చు అనుకుంది. ‘‘ఇట్స్ ఓకే!’’ అని చెప్పి తలుపు వేసేసింది కావ్య.నిత్యకు తెలీదు.. తాను ఊహించింది అబద్ధం అని. ఆ అబద్ధాన్నే నమ్మి హైద్రాబాద్ వదిలి వెళ్లిపోయింది. గౌతమ్‌కీ తెలీదు.. నిత్య తన కోసం హైద్రాబాద్ వచ్చిందని.
Comments
Please login to add a commentAdd a comment