
పరుగు పోరాటం!
అభివృద్ధిలో వెనుక ఉన్నా... ఆదాయం అంతంత మాత్రమైనా... ఆకలితో అలమటిస్తున్నా... ఆహార్యం ఆకట్టుకునేలా లేకపోయినా... ఇవేమీ వారు పట్టించుకోరు. బరిలో దిగితే విజయమే లక్ష్యంగా గమ్యంవైపు సాగిపోతారు. పతకాలు, పైసలు అందించే తొలి మూడు స్థానాలు సొంతం చేసుకోవాలని ఆరాటపడతారు. అమెరికాలో అయితేనేం... యూరోప్‌లో అయితేనేం... భారత్‌లో అయితేనేం... ప్రపంచంలో వేదిక ఏదైనా మధ్య, సుదూరపు లక్ష్యం (మిడిల్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్) పరుగు రేసులు జరుగుతున్నాయంటే ఆఫ్రికా దేశాలు కెన్యా, ఇథియోపియా అథ్లెట్స్ లేకుండా విజేతల జాబితా కనిపించదు.
- కరణం నారాయణ
ప్రపంచ జనాభాలో ఒక శాతం కూడా లేని కెన్యా, ఇథియోపియా తదితర జాతీయులు ప్రపంచ అథ్లెటిక్స్‌ను శాసించడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. మధ్య, సుదూరపు రేసుల్లో పశ్చిమ, తూర్పు ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ ఆధిపత్యం వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసుకునేందుకు పలు పరిశోధనలు గతంలో జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి. అయితే కచ్చితంగా ఫలానా కారణంతోనే వారు విజేతలుగా నిలుస్తున్నారనే విషయం తేలడంలేదు. సహజసిద్ధ జన్యుపరమైన శరీర నిర్మాణం అని ఒకరంటే... వారి జీవనశైలి నేపథ్యమని మరికొందరంటారు. ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లేటపుడు... మళ్లీ ఇంటికి వచ్చేటపుడు పరుగెడుతూ వెళ్తారని... ఈ విధంగా వారికి పరుగు జీవనంలో భాగమైపోతుందని... ఈ తరహా జీవనం అలవాటుపడిన వారికి పరుగు పందెం సమయాల్లో అనుకూలిస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
గణాంకాలు కూడా ఆఫ్రికా అథ్లెట్స్ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పర్వతప్రాంతాల నుంచి వచ్చే అథ్లెట్స్ మాత్రమే గొప్ప విజయాలు సాధిస్తున్నారని మరికొందరి వాదన. శ్రేష్టమైన వాతావరణానికితోడు భీకరమైన సాధన, లక్ష్యంపై పట్టుసడలని ఏకాగ్రత తదితర అంశాలే వారిని విజయవంతం చేస్తున్నాయని కెన్యా అథ్లెట్స్‌పై పరిశోధన చేసిన మాల్కమ్ గ్లాడ్‌వెల్ వివరిస్తున్నారు. ‘ఈ ప్రపంచంలో కష్టపడనిదే ఏదీ లభించదు. పరుగు కూడా మానసిక ప్రవృత్తితో కూడుకున్నది’ అని 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో 1500 మీటర్ల విభాగంలో... 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన కెన్యా విఖ్యాత అథ్లెట్ కిప్‌చోజ్ కీనో అభిప్రాయం.
ఇతర క్రీడల మాదిరిగానే రన్నింగ్‌లోనూ శారీరక శ్రమ ఉంటుంది. లారీ బర్డ్, మైకేల్ జోర్డాన్ పొడుగ్గా ఉన్నందుకే బాస్కెట్‌బాల్‌లో దిగ్గజ హోదా సంపాదించలేదు. అలాగే అనుకూల వాతావరణం ఉన్నందుకే కెన్యా అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారనడం భావ్యం కాదు. శరీరంలోని జన్యువులు మనలో మేటి అథ్లెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో లేవో నిర్ణయిస్తాయి. ఆ తర్వాత విజ్ఞత, అంకితభావం, ప్రణాళికతో కూడిన సాధన తదితర అంశాలే గెలుపోటములను శాసిస్తాయి. కెన్యా, ఇథియోపియాలతో పాటు ఇతర ఆఫ్రికా దేశాల అథ్లెట్స్‌లో ఈ లక్షణాలన్నీ మెండుగా ఉన్నాయి.
కెన్యా టాప్ - ఇథియోఫియా రన్నరప్
1983లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మొదలయ్యాక ఇప్పటివరకూ ఓవరాల్‌గా కెన్యా 43 స్వర్ణాలు, 37 రజతాలు, 32 కాంస్యాలతో కలిపి 112 పతకాలు సాధించింది. ఓవరాల్‌గా పతకాల జాబితాలో కెన్యాది మూడో స్థానం.
అలాగే ఇథియోపియా 22 స్వర్ణాలు, 19 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 64 పతకాలతో ఏడో స్థానంలో ఉండటం విశేషం.
ప్రపంచంలో ప్రతిష్టాత్మక మారథాన్‌లుగా పేరొందిన న్యూయార్క్, బోస్టన్, లండన్, చికాగో, బెర్లిన్, టోక్యో రేసుల్లోనూ కెన్యా, ఇథియోపియా అథ్లెట్స్ పలుమార్లు విజేతలుగా నిలిచారు.
1956లో తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన కెన్యా ఇప్పటివరకు 25 స్వర్ణాలు, 32 రజతాలు, 29 కాంస్యాలు సాధించింది. ఇందులో అథ్లెట్స్ మాత్రమే 24 స్వర్ణాలు, 31 రజతాలు, 24 కాంస్యాలు అందించడం విశేషం.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కెన్యా అథ్లెట్స్ పురుషుల విభాగంలో 800 మీటర్లు, 1500 మీటర్లు, 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్, మారథాన్‌లో... మహిళల విభాగంలో 800 మీటర్లు, 1500 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గి సంచలనం సృష్టించారు.
1956లోనే ఒలింపిక్స్‌లో తొలిసారి అడుగుపెట్టిన ఇథియోపియా ఇప్పటివరకు 21 స్వర్ణాలు, ఏడు రజతాలు, 17 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలు సాధించింది. ఈ పతకాలన్నీ అథ్లెటిక్స్‌లోనే రావడం విశేషం.
ఇథియోపియా విఖ్యాత అథ్లెట్స్
అబీబి బికిలా: బూట్లు లేకుండా పరుగెత్తి 1960 రోమ్ ఒలింపిక్స్ మారథాన్ రేసులో స్వర్ణం సాధించాడు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లోనూ బికిలా మారథాన్‌లో పసిడి పతకం గెలిచాడు.
హెయిలీ గెబ్రెసెలాసీ: వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో (1996 అట్లాంటా, 2000 సిడ్నీ) 10,000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు సాధించాడు. వరుసగా నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (1993, 1995, 1997, 1999) 10,000 మీటర్ల రేసుల్లో విజేతగా నిలిచాడు.
కెనెనిసా బెకెలె: వరుసగా నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2003, 2005, 2007, 2009) 10,000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గాడు. ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 10,000 మీటర్ల రేసులో... బీజింగ్ ఒలింపిక్స్‌లో 10,000 మీటర్లు, 5000 మీటర్ల రేసులో పసిడి పతకాలు సాధించాడు.
తిరునెష్ దిబాబా: బీజింగ్ ఒలింపిక్స్‌లో 10,000, 5000 మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గింది. లండన్ ఒలింపిక్స్‌లో 10,000 మీటర్ల రేసులో పసిడి పతకం. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు.
కెన్యా మేటి అథ్లెట్స్
కెంబోయ్ ఎజికిల్: రెండు ఒలింపిక్స్‌లో (ఏథెన్స్, లండన్) 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో స్వర్ణాలు నెగ్గాడు. వరుసగా మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ (2009, 2011, 2013) పసిడి పతకాలు సొంతం చేసుకున్నాడు.
వివియన్ చెరుయోట్: రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2009, 2011) మూడు స్వర్ణాలు సాధించిన చెరుయోట్ లండన్ ఒలింపిక్స్‌లో రజతం, కాంస్యం నెగ్గింది.
నాన్సీ లాంగత్: ఐదు అడుగుల ఎత్తు ఉన్న నాన్సీ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 1500 మీటర్ల రేసులో స్వర్ణం సాధించింది. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో 800, 1500 మీటర్లలో పసిడి పతకాలు నెగ్గింది.
డేవిడ్ రుదిషా: లండన్ ఒలింపిక్స్‌లో 800 మీటర్ల రేసులో ప్రపంచ రికార్డు సమయంతో స్వర్ణం నెగ్గిన 25 ఏళ్ల రుదిషా... 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పసిడి సాధించాడు.
పమేలా జెలిమో: బీజింగ్ ఒలింపిక్స్‌లో 18 ఏళ్ల ప్రాయంలోనే 800 మీటర్ల రేసులో స్వర్ణం నెగ్గి కెన్యా తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.