
కదలనివ్వని పరుగులు
తొక్కిసలాట ఈ భూమ్మీద ఎక్కువగా దేవుడి కోసం జరుగుతుంటుంది. కిలో రెండ్రూపాయల బియ్యం కోసం, కొత్త సినిమా టికెట్ల కోసం కూడా జరుగుతుంది. అయితే ఇంత జరగదు. మనుషులు మరీ ఒకరిమీద ఒకరు పడి, గాయపడి , కూలబడేంత జరగదు. ఒకవేళ చవక దుకాణం దగ్గరో, సినిమా టిక్కెట్ల వరుసలోనో ఎవరైనా తోసుకుని, తొక్కుకుని పడిపోయారనుకున్నా అప్పుడు కూడా దాని వెనుక తప్పకుండా ఏదో ఒక ‘దేవుడి ఆశ ’ (దేవుడు మనిషికి పెట్టిన ఆశ కాదు.
మనిషి మనిషికి చూపిన దేవుడి ఆశ) ఉండే ఉంటుంది. కుచేలుడి అటుకుల మూటని శ్రీకృష్ణపరమాత్ముడు ప్రియంగా స్వీకరించినట్లు.. నిరుపేదలు కిలో రెండ్రూపాయల బియ్యంలో ఇంత బెల్లం వేసి, తియ్యగా వండి పెట్టిన నైవేద్యాన్ని ఆ భగవంతుడు తృప్తిగా భుజిస్తాడని స్వామీజీ ఎవరైనా తన తపోశక్తితో కనిపెట్టానని భక్తులకు చెబితే రేషన్ దగ్గరి తొక్కిసలాటకు అది కారణం అయి ఉండొచ్చు.
అలాగే.. ప్రేక్షకుల ఆరాధ్య దైవమైన కథానాయకుడు తనూ ఒక మామూలు మనిషిలా అవతరించి తన అభిమానులతో కలిసి తొలిరోజు తొలి ఆట చూడబోతున్నారన్న ప్రకటన.. తొక్కిసలాటకు దారి తీసి ఉండొచ్చు. అలాగని అవి దేవుడి సంకల్పంతో జరిగిన తొక్కిసలాటలు అని కాదు. దైవసాక్షాత్కారానికి మనసు తొందరపడడం వల్ల జరిగే తొక్కిసలాటలు.
దేవుడు ఉన్నచోటనే ఉంటాడు. ఎక్కడికీ అదృశ్యమైపోడు. మరి ఎందుకింత తొందర? మనకు కనిపించకుండా, మన తోటివాళ్లకూ దర్శనభాగ్యం కలక్కుండా ఎందుకు రెండు మోచేతులూ అడ్డుపెట్టి, వరుసలో మన వెనుక ఉన్నవారిని అపేస్తున్నాం? సాక్షాత్కార క్షణాలు సంప్రాప్తించకముందే ఎందుకు మనం మన ముందున్న వారి భుజంపై తలను పెట్టి వారి నిలువుకాళ్ల ధ్యానాన్ని ధ్వంసం చేస్తున్నాం? ‘ముందు మనం’ అనే తొందరేనా ఇందుకు కారణం?
కాకపోవచ్చు.
పరుగులు మనకు అలవాటైపోయాయి. వాటిని మానుకోలేకపోతున్నాం. జీవితంలోని పరుగుల్లోంచి అలసట తీర్చుకోడానికే కదా దర్శనానికి వస్తాం. వచ్చాక ఇక్కడా అవే పరుగులైతే దేని కోసం వచ్చినట్టు? వచ్చి, ఏం తీసుకెళుతున్నట్టు? ప్రసాదమా? దాన్నయినా స్థిమితంగా కళ్లు మూసుకుని, ఇంత ముక్క విరిచి నోట్లో వేసుకుంటున్నామా? లేక, సమయం లేదని నోట్లోకి విసిరేస్తున్నామా? గమనించండి.
అయితే ఏమిటి పరిష్కారం? దేనికట పరిష్కారం? తొక్కిసలాట లేని దర్శనానికా? పరుగుల్లేని జీవితానికా? తొక్కిసలాట లేని దర్శనానికే. పరుగులు ఎలాగూ తప్పేలా లేవు. కూటి పరుగులు, సీటు పరుగులు, అమెరికా ఫ్లయిట్ పరుగులు. తర్వాత... ఆస్తి కోసం, అంతస్తు కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం భూగోళమంతా పరుగులే పరుగులు. ఇంత పరుగు ఉండబట్టే కదా దేవుడి దగ్గర కాసేపు ఆగాలనుకుంటున్నాం. ఆగినప్పుడైనా ఆగినట్లు ఉండకపోతే ఎలా?
సారెన్ కీగార్డ్ అంటాడు- ‘‘ఈ మనుషుల పరుగు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఇంత తీరికలేకుండా, తిండీతిప్పలు కూడా పట్టకుండా బతుకులెందుకు ఈడుస్తున్నారో అర్థం కాదు. అందుకే ఇలాంటి వాళ్ల ముక్కు మీద ఈగ వాలినప్పుడు, పక్కనుంచి వేగంగా వెళుతున్న వాహనం వీళ్ల ఒంటి మీద బురదనీళ్లు చిమ్మినప్పుడు, ఇంటి పెంకు ఊడి వీళ్ల తలపై పడినప్పుడు నేను పడీ పడీ నవ్వుతాను’’ అని! కీగార్డ్ పందొమ్మిదో శతాబ్దపు డెన్మార్క్ తత్వవేత్త. క్రైస్తవ ధర్మశాస్త్రజ్ఞుడు. కవి. సామాజిక ప్రవర్తనల విమర్శకుడు. మతగ్రంధాల రచయిత. స్థూలంగా ఆధ్మాత్మికవేత్త. మన తొందరపాటు చూసి దేవుడు మరీ ఈయన నవ్వినంతగా నవ్వకపోవచ్చు. లేదా అసలు నవ్వకపోవచ్చు. ఒకటి మాత్రం అనుకోవచ్చు. ‘నేనే ఇంటింటికీ వెళ్లి మానవులందరికీ దర్శనం ఇస్తే ఈ తొక్కిసలాటలు ఉండవు కదా అని!
అప్పుడైనా తొందరపడబోమన్న నమ్మకం లేదు! ‘అయ్యో, పని కాలేదు.. ఈయనొచ్చి కూర్చున్నాడే’ అనుకుంటూ బకెట్ తీసుకుని స్నానానికి బయల్దేరుతాం.. ‘కాసేపు వేచి ఉండండి స్వామీ’ అన్న చిన్న విన్నపంతో. ఆ తర్వాతైనా దేవుడికి మన దర్శనభాగ్యం కలిగిస్తామా? సందేహమే. ‘పూజ అయ్యేంత వరకు కాస్త ఆగు దేవుడా’ అని పూజగదిలోకి పరుగులు పెడతాం. పరుగులు పెట్టొచ్చు. కానీ దేవుడి కోసం పరుగెత్తే తొందరలో దేవుడి పటాన్ని తొక్కుకుంటూ వెళుతున్నామేమో చూసుకోవాలి.