పల్మునాలజీ కౌన్సెలింగ్
నాకు గత ఆర్నెల్లుగా దగ్గు, ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక పెద్ద డాక్టర్‌గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి ఈ విషయంలో తగిన సూచనలు ఇవ్వగలరు.
- ఆనందరావు, ఇల్లందు
పల్మునరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్) రావడం పెరిగిపోతే అది కనెక్టివ్ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. ఫలితంగా రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనివల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. కొంతమంది రోగుల్లో దీనికి కారణం ఏమిటో తెలుసుకుంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపథిక్ పల్మునరీ ఫైబ్రోసిస్ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది మరింత ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు వస్తుండటం, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెడంటరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటోఇమ్యూన్), వైరల్ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్‌లతో ఉన్న గాలిని పీల్చడం, కోడిదాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్ పొగ ఈ కండిషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్‌ఫ్లమేషన్‌ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్‌లలో నిపుణులైన పల్మునాలజిస్ట్‌లను సంప్రదించండి.
డాక్టర్ రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్
అండ్ స్లీప్ స్పెషలిస్ట్,
కిమ్స్ హాస్పిటల్,
సికింద్రాబాద్.
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 38 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. కార్డియాలజిస్టును కలిసి గుండె సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా?
- సురేశ్‌బాబు, పిడుగురాళ్ల
మీరు తెలిపిన వివరాలు, పేర్కొన్న లక్షణాలను బట్టి మీకు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్ డిసీజ్’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్ డిసీజ్ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారు కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్షణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటినుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
నా వయసు 32 ఏళ్లు. నేను పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాను. మా దగ్గర నిర్వహించిన మెడికల్ క్యాంప్‌లో నాకు హెచ్‌బీఎస్‌ఏజీ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దీనివల్ల కాలేయం చెడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? నా వ్యాధి మందులతో తగ్గిపోతుందా?
- ఎస్.ఆర్., హైదరాబాద్
మీరు హెపటైటిస్-బి అనే ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ వైరస్ రక్తంలో ఉన్నంత మాత్రాన కాలేయం చెడిపోయే అవకాశం లేదు. రక్తంలో ఈ వైరస్ ఉండే దశను బట్టి లివర్ చెడిపోయే అవకాశం ఉంటుంది. వైరస్ ఏ దశలో ఉందో తెలుసుకోడానికి కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్ ఫంక్షన్ పరీక్షలో తేడా వస్తే ఒకసారి మీకు దగ్గర్లో ఉండే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోవచ్చు.
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్
న్యూరాలజీ కౌన్సెలింగ్
మా అమ్మగారి వయసు 62 ఏళ్లు ఇటీవల ఆమెకు పక్షవాతం వచ్చింది. ఆ టైమ్‌లో ఇంట్లో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయాం. ఆసుపత్రికి తీసుకురావడం చాలా ఆలస్యం అయ్యింది. త్వరగా తీసుకొచ్చి ఉంటే ఇంకా మెరుగైన ఫలితం ఉండేదని తెలిపారు. ప్రస్తుతం మా అమ్మగారు మంచానికే పరిమితమై మాట్లాడలేకపోతున్నారు. క్రమం తప్పకుండా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నాం. పక్షవాతం వస్తే అది పూర్తిగా నయం కాదా? అసలు పక్షవాతం ఎందుకు వస్తుంది? వస్తే ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దయచేసి మా అమ్మగారి సమస్యకు పరిష్కారం చూపించగలరు.
- కళ్యాణి, చిత్తూరు
పక్షవాతం విషయంలో ‘సమయం’ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి మొదటి మూడు గంటలలోపు చికిత్స ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. టైముకు హాస్పిటల్‌కు తీసుకొస్తే క్లాట్ బరస్టింగ్ థెరపీ ద్వారా ప్రాణాపాయం లేకుండా, కాళ్లు, చేతులు చచ్చుబడిపోకుండా, మాటపడిపోకుండా కాపాడవచ్చు. ఆలస్యం అయ్యే కొద్దీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పక్షవాతం బారిన పడడానికి ప్రతి ఒక్కరిలో ముందస్తుగా కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఈ ప్రమాద ఘంటికలను ఏమాత్రం నిర్లక్షం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే చాలా వరకు సమస్యను అధిగమించవచ్చు. మెదడులో రక్తసరఫరా ఆగిన చోటుపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ముఖం బలహీనం కావడం, మూతి వంకరపోవడం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, చేతులు బలహీనం కావడం, మాట్లాడడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో సరైన చికిత్స అందిస్తే వైకల్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. మీ అమ్మగారు మానసికంగా కుంగిపోకుండా చూసుకోండి. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ సరైన చికిత్స అందించేలా చూడండి. పక్షవాతానికి జన్యుపరమైన కారణాలతో పాటు మారుతున్న జీవనశైలి, జంక్‌ఫుడ్స్, ఒత్తిడి, పొగతాగడం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కారణాలుంటాయి. పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మీకుగానీ, మీ తోబుట్టువులకు గానీ షుగర్, హైబీపీ గానీ ఉంటే మీరూ జాగ్రత్త తీసుకోవడం అవసరం. వాటిని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఎక్కువగా తాజా ఆకుకూరలు, పండ్లతో పాటు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకునేలా చూడండి. ఒత్తిడికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించండి.
డాక్టర్ వికాస్ అగర్వాల్
సీనియర్ న్యూరో ఫిజీషియన్,
యశోద హాస్పిటల్స్,
సికింద్రాబాద్.
సకాల చికిత్సతో పక్షవాతం దుష్ర్పభావాన్ని నివారించవచ్చు
Published Thu, Dec 3 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM
Advertisement