►క్షయతో మన్యంలో మరణ మృదంగం
►సకాలంలో వ్యాధిని గుర్తించకపోవడంతో నష్టం
►గుర్తించినా సక్రమంగా మందులు వాడని రోగులు
►వైద్యసిబ్బంది పర్యవేక్షణ శూన్యం
నిర్లక్ష్యం గిరిజనుల ప్రాణాలను తోడేస్తోంది. క్షయ ప్రాణాలు తీసే రోగం కానప్పటికీ దాని లక్షణాలను ముందుగా అంచనా వేయలేకపోవడం, వ్యాధిని నిర్ధారించాక కూడా సక్రమంగా మందులు వాడకపోవడంతో ఏజెన్సీ వాసులు పిట్టల్లా రాలిపోతున్నారు. కొందరు మందులు వాడుతూనే సారా తాగేస్తున్నారు. ఫలితంగా రోగం ముదిరి చనిపోతున్నారు. పరీక్ష కేంద్రాలు పెంచినా ఫలితం లేకపోతోంది. శీతల వాతావరణంతో రోగులు విలవిల్లాడిపోతున్నారు.
కొయ్యూరు: క్షయను గుర్తించడంలో తీవ్ర జాప్యంతో ఏజెన్సీలో పెద్ద ఎత్తున హాని జరిగిపోతోంది. ఏజెన్సీలో ప్రస్తుతం 570 మంది రోగులున్నారు. ప్రతీనెలా కొత్తగా మరో 150 మంది ఈ మహమ్మారిబారిన పడుతున్నారు. శీతలగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా పీడితులు విలవిల్లాడిపోతున్నారు. నివాస ప్రాంతాల్లోకి గాలి,వెలుతురు సరిగ్గా రాకపోవడం.. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం..ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది ఉమ్మిని వేయడం.. ఎక్కువగా పొగ తాగడంతో పాటు మద్యానికి బానిస కావడం మూలం గా ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీని ప్రధాన లక్షణం దగ్గు..తగ్గకుండా రెండు వారాల పాటు వస్తే వెంటనే కఫం పరీక్ష చేయించుకోవాలి చాలా మంది గిరిజనులకు దీనిపై అవగాహన లేక బాగా నీరశించిపోయాక ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. క్షయగా నిర్ధారించాక మందులు వాడుతున్నారు. నెల రోజులు మాత్రలు వేసుకుని మానేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అనంతరం ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకోవడం లేదు. ఈ రోగులు రెగ్యులర్‌గా ఈ మందులు వేసుకుంటున్నదీ లేనిదీ క్షయ వైద్యాధికారులెవ్వరూ పర్యవేక్షించడం లేదు. నెలల తరబడి వారి ఆచూకీ లేకుండాపోతోంది. 2014లో అప్పటి ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ అనేక ఆస్పత్రులలో క్షయ నివేదికలను పరిశీలించి పరిస్థితిని గమనించారు.
క్షయరోగులకు ఫాలోఆప్ చికిత్స అందడం లేదని నిర్ధారించారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మలేరియా బాధితులు రోజూ మందులు మింగుతున్నదీ లేనిదీ ఆశా వర్కర్లుచూస్తారు. టీబీ రోగుల విషయంలో ఇది కానరాదు. ఒక క్షయరోగికి సకాలంలో వైద్య అందకుంటే అతని ద్వారా క్రిములు పరిసరాల్లోని మరో 20మందికి వ్యాపిస్తాయి. వ్యాధిని గుర్తించడంలోనే తీవ్ర జాప్యంతో జరగాల్సిన హాని జరిగిపోతోంది. ఈ రోగుల్లో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని మూలంగా హెచ్‌ఐవీ సోకే అవకాశం అధికంగా ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో ఉండే రోగులకు నేరుగా మందులను అందించే అవకాశం కల్పిస్తే బాగుంటుంది. కొంతలో కొంత వరకు మరణాలను ఆపవచ్చు.
నాలుగు శాతం చనిపోతున్నారు
క్షయసోకిన వారిలో నాలుగుశాతం చనిపోతున్నారు. ముందుగా వ్యాధిని గుర్తించకపోవడం కీలకలోపం. తరువాత మందులు వాడడంలో నిర్లక్ష ్యం చేసినా ఇబ్బందులొస్తాయి. ఇప్పుడు అంతా ఆన్‌లైన్ కావడంతో ప్రతి రోగికి సకాలంలో ఫాలో ఆప్ చికిత్స అందిస్తున్నాం.
వసుంధర,డీటీసీవో,
విశాఖపట్నం
అవగాహన లోపం వల్లే
అవగాహన లోపం వల్లే క్షయ సోకిన వారు చనిపోతున్నారు. రోగులకు అవగాహన కల్పిస్తే తప్పకుండా వ్యాధి నయం అవుతుంది. దీంతో పాటు రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. ఇచ్చిన మందులను వేసుకోవాలి. మందులు వాడేటప్పుడు బలమైన ఆహారం తినాలి.
బి.సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌వో,
నర్సీపట్నం క్లస్టర్
నిర్లక్షయం
Published Thu, Jan 28 2016 12:22 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement