హోమియో కౌన్సెలింగ్
నా వయసు 51 ఏళ్లు. విపరీతంగా ముక్కితే గానీ నాకు మలవిసర్జన కావడం లేదు. నాకు మలద్వారం వద్ద చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – కేశవరావు, హబ్సిగూడ
ఇటీవల మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మీరు పేర్కొంటున్న సమస్యలు వస్తున్నాయి. మీ ప్రశ్నలో మీ సమస్య పైల్స్, ఫిషర్ లేదా ఫిస్టులానా అన్న స్పష్టత లేదు. అయితే ఈ మూడు సమస్యల్లోనూ మలబద్దకం వచ్చి, మలవిసర్జన సాఫీగా జరగదు. పైల్స్‌ను సాధారణ వాడుకలో మొలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద ఉండే సిరలు ఉబ్బడం వల్ల ఈ సమస్య వస్తుంది. పీచుపదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో మలం గట్టిపడి మలబద్దకానికి దారితీస్తుంది. తద్వారా కలిగే ఒత్తిడి వల్ల మలద్వారం చుట్టూ ఉండే సిరలు ఉబ్బుతాయి. పైల్స్ ఉన్నవారిలో నొప్పి, కొందరిలో మలవిసర్జన సమయంలో రక్తం పడటం, మలద్వారం వద్ద ఏదో అడ్డంకి ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారిలో మలద్వారం చుట్టూ ఉండే చర్మం చిట్లిపోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మలబద్ధకం వల్ల మలం బయటకు రావడానికి అధికంగా ముక్కడం. యానల్ ఫిషర్‌లో ప్రధానమైన లక్షణం మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి.
మలం బయటకు వచ్చేటప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక యానల్ ఫిస్టులా అనేది మలద్వార భాగానికీ, చర్మానికీ మధ్యలో ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడటం. విసర్జన సమయంలో కలిగే తీవ్రమైన ఒత్తిడికి మలద్వారంలో ఉండే కణజాలం దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న కణజాలంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి తొలిచేస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఒక అసాధారణమైన ద్వారం ఏర్పడుతుంది. మలద్వారం వద్దగల చర్మంపై ఇది ఒక చీముతో కూడిన గడ్డలాగా కనపడుతుంది. దీన్ని చీముగడ్డగా భావించి చికిత్స చేయడం వల్ల పైన చర్మం మీద ఉన్న గడ్డ నయమవుతుంది. కానీ లోపల ఉండే ద్వారం అలాగే మిగిలి ఉంటుంది. అందుకే ఈ సమస్య తరచూ వచ్చి ఇబ్బంది పెడుతుంది. యానల్ ఫిస్టులాలో కనపడే ప్రధాన లక్షణం మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, దీనితో పాటు అక్కడ ఏర్పడ్డ రంధ్రం నుంచి చీముతో కూడిన రక్తం బయటకు వస్తుంటుంది. దీనివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పైల్స్, ఫిషర్, ఫిస్టులా... ఈ మూడు సమస్యలకూ హోమియోపతిలో అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రైయోనియా, నక్స్‌వామికా, అల్యూమినా, కొలిన్‌సోనియా వంటి మందులను రోగి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇస్తారు. వీటిని నిర్ణీత కాలం పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల సురక్షితమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది.
డాక్టర్ ఎ.ఎం.రెడ్డి
సీనియర్ డాక్టర్,
పాజిటివ్ హోమియోపతి,
హైదరాబాద్
గుక్కపడితే పాప నీలంగా మారుతోంది!
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాపకు 10 నెలలు. ఒక్కోసారి ఇక అదేపనిగా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటుంది. గుక్కపట్టి ఏడుస్తున్నప్పుడు పాప ముఖం నీలంగా అవుతోంది. ఆ సమయంలో పాపను చూస్తుంటే ఆందోళనగా ఉంది. దయచేసి పాప సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
– షమీమ్‌బేగం, కొత్తగూడెం
మీ పాప ఎదుర్కొంటున్న సమస్యను ‘బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. అంటే పాప కాసేపు ఊపిరి తీసుకోకుండా ఉండిపోతుందన్నమాట. పిల్లల్లో కోపం / ఫ్రస్టేషన్ / భయం / కొన్ని సందర్భాల్లో గాయపడటం జరిగినప్పుడు ఇలా కావడం చాలా సాధారణం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తొమ్మిది నెలల నుంచి 24 నెలల లోపు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నారుల్లో ఐదు శాతం మందిలో ఇది చాలా సహజం. కుటుంబ చర్రితలో ఈ లక్షణం ఉన్నవారి పిల్లల్లో ఇది ఎక్కువ. ఇలాంటి లక్షణం ఉన్న పిల్లలు పెద్దయ్యాక చాలా మొండిగా అవుతారంటూ కొన్ని అపోహలున్నా, వాటికి శాస్త్రీయమైన ఆధారాలేమీ లేవు.
ఇది ఎందుకు వస్తుందనేది చెప్పడం కష్టమైనప్పటికీ రక్తహీనత ఉన్నవారిలో ఇది ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుంది. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్‌లో... సింపుల్, సైనోటిక్, పాలిడ్, కాంప్లికేటెడ్ అని నాలుగు రకాలు ఉన్నాయి.
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు వస్తోంది సైనోటిక్ అనిపిస్తోంది. ఇక ప్యాలిడ్ అనే రకంలో పిల్లలు పాలిపోయినట్లుగా అయిపోయి, స్పృహతప్పిపోతారు. ఇటువంటి పిల్లల్లో ఒకసారి ఈసీజీ, ఈఈజీ తీయించడం చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన కారణాలు ఏవైనా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే... పాపలో ఈ ధోరణి కనిపించినప్పుడు కుటుంబ సభ్యులంతా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు కాబట్టి వాళ్లకు ధైర్యం చెప్పడమే మొదటి అవసరం. చాలా కొద్దిమందిలో మాత్రం ఐరన్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలూ, తల్లిదండ్రుల మధ్య ప్రేమాభిమానాలు బలపడినకొద్దీ ఈ లక్షణం క్రమంగా తగ్గిపోతుంది. ఐదేళ్ల వయసు వచ్చాక ఈ లక్షణం కనిపించడం చాలా అరుదు. పైన పేర్కొన్న పరీక్షలు కూడా ఏవైనా తీవ్రమైన సమస్య ఉందేమో అన్నది తెలుసుకోడానికి మాత్రమే. ఈ విషయంలో నిర్భయంగా ఉండండి. మరీ అవసరమైనప్పుడు మీ పిల్లల డాక్టర్‌ను సంప్రదిస్తే చాలు.
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్,
విజయనగర్ కాలనీ హైదరాబాద్
సిరలు ఉబ్బడం వల్లనే ఆ ఇబ్బంది
Published Tue, Jan 31 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
Advertisement